బెంగాల్‌లో రాజీనామాకు సిద్ధమైన దీదీ!

38

కోల్‌కతా, మే 25 (న్యూస్‌టైమ్): లోక్‌సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్‌కు (టీఎంసీకి) పరాభవం ఎదురవడంతో ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలుగుతానని శనివారం ప్రతిపాదించారు. అయితే, ఆ ప్రతిపాదనను టీఎంసీ తిరస్కరించింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మమత శనివారం కోల్‌కతాలో తొలిసారి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఓట్ల కోసం బీజేపీ బెంగాల్‌లో ప్రజలను మతం పేరుతో చీల్చుతున్నదని ఆమె ఆరోపించారు. ముఖ్యమంత్రి పదవి నుంచి నిష్క్రమిస్తానని టీఎంసీ అంతర్గత సమావేశంలో తను ప్రతిపాదించానని, కానీ తన ప్రతిపాదనను పార్టీ తిరస్కరించిందని, కనుక తను పదవిలో కొనసాగవచ్చనీ ఆమె తెలిపారు.

ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించడంపై మమత అనుమానాన్ని వ్యక్తం చేశారు. ‘‘బీజేపీ సాధించిన భారీ విజయం అనుమానానికి అతీతమైనదేమీ కాదు. పలు రాష్ట్రాల్లో ప్రతిపక్షం పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అక్కడ ఏదో జరిగింది. ఇందులో విదేశీ శక్తుల ప్రమేయం కూడా ఉంది’’ అని మమత వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో విజయం సాధించేందుకు బీజేపీ బెంగాల్‌లో అత్యవసర స్థితి (ఎమర్జెన్సీ) లాంటి పరిస్థితిని సృష్టించిందని ఆమె ఆరోపించారు.

మొత్తం 42 లోక్‌సభ స్థానాలున్న బెంగాల్‌లో ఈసారి బీజేపీ 18 స్థానాలను కైవసం చేసుకోవడంతో టీఎంసీ 22 స్థానాలకే పరిమితమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మమత టీఎంసీ అభ్యర్థులందరితోపాటు పార్టీ సీనియర్ నేతలతో శనివారం సమావేశమయ్యారు. తనకు ముఖ్యమంత్రి పదవి ముఖ్యం కాదని, ఆ పదవి నుంచి వైదొలగాలని భావించానని, కానీ తన ప్రతిపాదనను పార్టీ తిరస్కరించిందని ఆమె విలేకర్లకు చెప్పారు. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను తన ప్రభుత్వం నెరవేర్చిందని, ఇప్పుడు పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి కేంద్రీకరిస్తానని తెలిపారు. బీజేపీ విజయం సాధించేలా ఈవీఎంలను ప్రోగ్రామ్ చేశారని, ఓట్లను కొనుగోలు చేసేందుకు రూ.కోట్లను వెచ్చించారని మమత ఆరోపించారు.

పశ్చిమ బెంగాల్‌తో సరిహద్దును పంచుకుంటున్న అస్సాం మంత్రి హిమంత బిశ్వ శర్మ రెండు వారాల నుంచి కోల్‌కతాలోనే మకాం వేశారని మమత పేర్కొంటూ ఆయన ఇక్కడ ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. బీఎస్‌ఎఫ్ జవాన్లు ఓటర్లను పోలింగ్ బూత్‌లకు తీసుకొచ్చి వారితో బలవంతంగా బీజేపీకి ఓట్లు వేయించారని, ఇలాంటి ఎన్నో అక్రమాలను ఈసీ చూసీ చూడనట్టు వదిలేసిందన్నారు. ఈ ఎన్నికల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఈసీయే అని ఆమె మండిపడ్డారు. నరేంద్రమోదీ సర్కారు వైఫల్యాలను ప్రశ్నించిన విపక్ష నేతలను పాకిస్థానీయులుగా ముద్రవేసిన బీజేపీ నేతలు ఇప్పుడు పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను ఎందుకు ఆహ్వానించారని, ఇది దేశ ద్రోహం కాదా అని దీదీ నిలదీశారు.

మతోన్మాదంపై తన పోరాటాన్ని కొనసాగిస్తానని, ఇఫ్తార్ విందుకు హాజరవుతానని, ఇదంతా ముస్లింలను ప్రసన్నం చేసుకునేందుకు తాము చేసే పనులుగా బీజేపీ అనుకోవచ్చని, అయినప్పటికీ పాలిచ్చే గోవుతో తన్నించుకునేందుకు తను సిద్ధమేననీ మమత స్పష్టం చేశారు. దేశంలో మోదీ పవనాలు వీస్తున్నాయన్న వాదనను ఆమె తోసిపుచ్చుతూ పథకం ప్రకారం ఓట్లను బీజేపీ లూటీ చేసిందని, అందుకే ఆ పార్టీకి ఇన్ని సీట్లు వచ్చాయని అన్నారు. ‘‘గుజరాత్, హర్యానా, ఢిల్లీలో కాంగ్రెస్ కనీసం ఒక్క సీటు కూడా గెలువకపోవడం ఎలా సాధ్యమైంది? కొద్ది నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ల మాటేమిటి? ఇదంతా సక్రమమేనని, ఎలాంటి అక్రమాలు జరుగలేదని నేను అంగీకరించాలా?’’ అని మమత ప్రశ్నిస్తూ బెంగాల్‌లో ఎన్నార్సీ (నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్)ను అనుమతించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.