చంద్రన్నతో పవనన్న టీ20

133
  • టీడీపీ కొంప ముంచిన జనసేన

  • జగన్‌కు మేలుచేసిన పవన్ వైఖరి

అమరావతి, మే 24 (న్యూస్‌టైమ్): ‘‘వచ్చే ప్రభుత్వం ‘జనసేన’దే. ముఖ్యమంత్రి వవన్ కల్యాణే. రాజకీయాల్లో సరికొత్త మార్పు. ధనంతో కాదు, మనసుతో ఓట్లు రాబట్టుకుందాం’’ వంటి డైలాగ్‌లు వినడానికి ఎంత వినసొంపుగా ఉన్నా విషయానికి వచ్చేసరికి అవి అంతగా ప్రభావాన్ని చూపకపోగా, అంచనాలను తారుమారుచేస్తుంటాయి. ప్రభుత్వంతో ఘర్షణాత్మక వైఖరంటూ పోరాటయాత్ర సాగించిన జనసేనాని చివరికి సాధించింది గుండు సున్నా. అయితే, ఆయన గెలవకపోయినా, ఆయన పార్టీ అభ్యర్ధి మాత్రం ఒకరు గెలిచారనుకోండి. ఆ మాత్రం దానికి, రాజకీయాలలో మార్పు, వంటా వార్పూ వంటి భారీ డైలాగులు ఎందుకూ అన్న ప్రశ్న పక్కనపెడితే, కనీసం పవన్ కల్యాణ్ లక్ష్యమేమిటో కూడా పూర్తిగా వెల్లడించలేకపోయారు. కేవలం తెలుగుదేశాన్ని తిట్టడం, ఆ పార్టీ నేతలపై విరుచుకుపడడం మినహా పోరాటయాత్రలో ఆయన పెద్దగా ప్రజలతో మమేకమైంది ఏమీ లేదనే చెప్పాలి.

తన విజయంపై తనకే నమ్మకం లేదన్నట్లు రాష్ట్రంలోని రెండు చోట్ల నుంచి ఆయన అసెంబ్లీ స్థానాలకు నామినేషన్లు వేసి చివరికి రెండు చోట్లా పరాజయం పొందారు. మొత్తానికి ఆయన వల్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పరోక్షంగా మేలు జరగ్గా, ప్రత్యక్షంగా తెలుగుదేశం పార్టీకి తేరుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. కచ్చితంగా గెలుస్తామన్న స్థానాలలో సైతం ఆ పార్టీ ఓడిపోవడాన్ని విశ్లేషిస్తే, దానిపై పవన్ ప్రభావం కనిపిస్తుంది. వైఎస్సార్‌సీపీకి వీచిన గాలిలో టీడీపీ పరాజయం పాలైందన్నది అందరికీ తెలిసిందే. అయితే, తెలుగుదేశం పార్టీకి సీట్లు గణనీయంగా తగ్గడానికి జనసేన పార్టీయే కారణమని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. తానొకటి తలిస్తే దైవమొకటి తలిచినట్లు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఒకటి తలిస్తే ప్రజలు మరొకటి తలిచారు.

జనసేన పార్టీ పోటీ వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి తనకు లాభం కలుగుతుందని తమ పార్టీకి ప్రయోజనం చేకూరుతుందని ఆయన భావించారు. కానీ జనసేన తెలుగుదేశం పార్టీనే ఘోరంగా దెబ్బ తీస్తుందని బహుశా, ఊహించి ఉండరు. వైసీపీ విజయం సాధించిన 32 చోట్ల అది సాధించిన మెజారిటీ కన్నా జనసేన సాధించిన ఓట్లే అధికం. 2009లో చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీ (పీఆర్పీ) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీని దెబ్బ తీసింది. అదే రీతిలో జనసేన ఈసారి దెబ్బ తీసింది. ఆ ఎన్నికల్లో టీడీపీ 80 స్థానాల్లో రెండో స్థానంలో నిలిచింది.

అక్కడ కాంగ్రెస్‌ సాధించిన మెజారిటీ కన్నా పీఆర్పీకి అధిక ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో టీడీపీ కేవలం 5 వేల ఓట్ల లోపు ఓడిపోయిన స్థానాలు 28 దాకా ఉన్నాయి. ఈసారి యలమంచిలిలో టీడీపీ అభ్యర్థిపై వైసీపీకి 4 వేల ఓట్లు ఆధిక్యం వచ్చింది. జనసేనకు 16,500 ఓట్లు వచ్చాయి. రామచంద్రపురంలో వైసీపీకి 5 వేల ఓట్లు మెజారిటీ రాగా, జనసేనకు 17,592 ఓట్లు వచ్చాయి. తణుకులో వైసీపీ 1264 ఓట్లతో విజయం సాధించింది. జనసేనకు అక్కడ 35502 ఓట్లు పోలయ్యాయి. విజయవాడ వెస్ట్‌లో వైసీపీ 6వేల ఓట్ల తేడాతో గెలిస్తే జనసేనకు 22,312 ఓట్లు వచ్చాయి.

నెల్లూరు సిటీలో మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ 1587 ఓట్లతో ఓడిపోగా జనసేనకు 4104 ఓట్లు పడ్డాయి. తిరుపతిలో వైసీపీ 708 ఓట్ల స్వల్ప తేడాతో గెలిచింది. ఇక్కడ జనసేన అభ్యర్థి చదలవాడ కృష్ణమూర్తికి 12 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. ఇలా విశ్లేషించుకుంటూ పోతే, జనసేన వల్ల తెలుగుదేశం పార్టీ నష్టపోయిన స్థానాలే ఎక్కువ. ఒక్కముక్కలో చెప్పాలంటే, ఈసారి ఎన్నికలలో పవన్ కల్యాణ్ తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడుతో టీ20 మ్యాచ్ ఆడుకున్నారన్నది అర్ధమవుతోంది. అంతకముందు తన అన్న చిరంజీవి వన్డే మ్యాచ్ ఆడితే ఈసారి ఏకంగా తమ్ముడు ఓవర్లు కుదించి టీ20తోనే తలరాతలు మార్చేశారు. బహుశా, ఇదేనేమో రాజకీయాల్లో మార్పంటే?