ఎంపీ స్థానాల్లోనూ వైకాపా ఆధిక్యం

113

అమరావతి, మే 23 (న్యూస్‌టైమ్): ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు శరవేగంగా కొనసాగుతోంది. అసెంబ్లీ స్థానాలతో పాటు లోక్‌సభ స్థానాల్లోనూ వైకాపా అభ్యర్థులు అధిక్యంలో ఉన్నారు. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాలను బట్టి 17 ఎంపీ స్థానాల్లో వైకాపా అభ్యర్థులు ముందంజలో దూసుకెళ్తున్నారు. తెదేపా 5 స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తోంది.

నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు, విశాఖ తెదేపా అభ్యర్థి ఎం.భరత్‌ ఆధిక్యంలో ఉన్నారు. కాగా, రాష్ట్రంలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు 130కి పైగా అసెంబ్లీ స్థానాల్లో వైకాపా, 30 స్థానాల్లో తెదేపా అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. జనసేన పార్టీ ఎక్కడా ఖాతా తెరవలేదు. ఎగ్జిట్ పోల్స్‌కు కాస్త అటూ ఇటుగా ఫలితాలు కనిపిస్తుండడంతో జగన్ శిబిరం ఉత్సాహంతో సంబరాలు చేసుకొంటుంటే తెలుగుదేశం పార్టీలో నైరాశ్యం కమ్ముకుంది.

ఓట్ల లెక్కింపు ప్రారంభం కావడానికి ముందు తెదేపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన నివాసం నుంచి పార్టీ శ్రేణులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించినప్పటికీ తర్వాత ఆయన కనీసం మీడియాతో కూడా మనసు విప్పి మాట్లాడే ప్రయత్నం చేయలేదు. మరోవైపు, జగన్ తన నివాసంలో భార్య భారతి, పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తదితరులతో హుషారుగా గడిపారు. ఇక, హేమాహేమీల పోటీకి కేంద్రమైన ఉత్తరప్రదేశ్‌లో జాతీయ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.

అమేఠీలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ వెనుకంజలో ఉన్నారు. ఆయనపై స్మృతి ఇరానీ 7600 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కేరళలోని తిరువనంతపురం కాంగ్రెస్‌ అభ్యర్థి శశిథరూర్‌ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరోవైపు, కేరళ వయనాడ్‌ లోక్‌సభ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ లక్ష ఓట్ల ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. హైదరాబాద్‌ ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్‌ ఒవైసీ 7523 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. రెండో రౌండ్ ముగిసే సరికి సికింద్రాబాద్‌ భాజపా అభ్యర్థి కిషన్‌రెడ్డి 15వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

కాగా, ఏపీ ప్రజల తీర్పు ఎప్పుడూ గొప్పదేనని సినీ నటుడు మంచు మోహన్‌బాబు అన్నారు. దివంగత సీఎం రాజశేఖర్‌రెడ్డి తన బిడ్డ జగన్‌కు ధైర్య సాహసాలతో పాటు ఆశీస్సులు కూడా ఇచ్చారని అన్నారు. ఇదిలావుండగా, మధుర లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న భాజపా అభ్యర్థి, సినీ నటి హేమమాలిని వెనుకంజలో ఉన్నారు. సినీ నటి, నగరి వైకాపా అభ్యర్థి రోజా ముందంజలో ఉన్నారు. తెలంగాణలోని మెదక్ లోక్‌సభ నియోజకవర్గ తెరాస అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి లక్ష ఓట్ల మెజార్టీతో దూసుకుపోతున్నారు. అదే విధంగా భాజపా అధ్యక్షుడు అమిత్‌షా గుజరాత్‌లోని గాంధీనగర్‌ నియోజకవర్గంలో భారీ ఆధిక్యంలో దూసుకుపోతున్నారు.

ప్రత్యర్థిపై లక్షా పాతికవేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. విశాఖ గాజువాక నియోజకవర్గం నుంచి పోటీ చేసిన జనసేన అధ్యక్షుడు పవన్‌ రెండో రౌండ్ ముగిసేసరికి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాగా, మూడో రౌండ్‌ పూర్తయ్యే సరికి విశాఖ గాజువాక అసెంబ్లీ స్థానంలో జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ 84 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఏపీ ఎన్నికల్లో వైకాపాకు వస్తున్న ఫలితాలపై ఆ పార్టీ అధ్యక్షుడు జగన్‌ సంతోషం వ్యక్తం చేశారు. ఎంపీ విజయసాయిరెడ్డితో కలిసి తన ఆనందాన్ని పంచుకున్నారు. తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు కుప్పంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.