లోక్‌సభ ఫలితాల్లో టీఆర్ఎస్‌కు ఊహించని షాక్

62

హైదరాబాద్, మే 23 (న్యూస్‌టైమ్): ‘కారు… సారు… పదహారు’ అంటూ ఊదరగొట్టిన అధికార టీఆర్ఎస్ నేతలకు లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఊహించని షాక్ తగిలింది. ‘ఎన్నిక ఏదైనా ఏకపక్షమే’ అనుకున్న గులాబీ దళాన్ని తెలంగాణ ప్రజలు ఖంగుతినింపించారు. రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాలుంటే అందులో తన మిత్రపక్షమైన ఎంఐఎం ఒక స్థానాన్ని, మిగిలిన పదహారు సీట్లను తమ పార్టీ అభ్యర్ధులే గెలుచుకుంటారన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ధీమా పటాపంచులైంది.

ఈ నేపథ్యంలో ఆ పదహారు సంఖ్య కాస్తా తొమ్మిదికి పరిమితం కావాల్సి వచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికలలో దాదాపు 102 స్థానాలలో అసలు డిపాజిట్లు కోల్పోయిన భారతీయ జనతా పార్టీకి లోక్‌సభ ఎన్నికలలో ఊహకందని రీతిలో ఫలితం వచ్చింది. ఆ పార్టీ ఏకంగా తెలంగాణలోని నాలుగు కీలక స్థానాలను కైవసం చేసుకుంది. చివరికి ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చిన నిజామాబాద్ ఎంపీ స్థానాన్నీ బీజేపీ తన ఖాతాలో వేసుకుని గులాబీ దళాన్ని ఆశ్చర్యానికి గురించేసింది.

కాంగ్రెస్ ప్రభావం ఈ ఎన్నికలలో అసలు ఉండదని టీఆర్ఎస్ భావించినప్పటికీ ఆ పార్టీ కూడా తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేసి, మూడు స్థానాల్లో పాగా వేసింది. గత అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలుపొందిన టీపీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి నల్గొండ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. ఇక, కొమటిరెడ్డి వెంకటరెడ్డి భువనగిరి నుంచి జెండా ఎగురవేశారు. మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ తనకు సికిందరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో తిరుగులేదనుకుని తన కుమారుడిని పోటీకి నిలిపినా బీజేపీ అభ్యర్ధి జి. కిషన్‌రెడ్డి ముందు చతికిలపడాల్సి వచ్చింది.

ఆయన్ని అక్కడ టీఆర్ఎస్ తట్టుకోలేకపోయింది. 2014లో టీఆర్ఎస్ 11 ఎంపీ స్థానాలతో చక్రం తిప్పినప్పటికీ ఈసారి ఆ సంఖ్య 9కి చేరింది. అప్పట్లో బీజేపీకి సికిందరాబాద్ ఒక్కటే బండారు దత్తాత్రేయ రూపంలో లభిస్తే, ఈసారి నాలుగు స్థానాలలో విజయకేతనాన్ని ఎగురవేసింది. గతసారి కాంగ్రెస్ రెండు స్థానాల్లో గెలిస్తే, ఈసారి ఒక స్థానాన్ని పెంచుకుంది. ఎంఐఎం సంగతి సరే సరి. అప్పుడూ ఒక్కటే. ఇప్పుడూ ఒక్కటే. ఇక, తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ ఏ లోక్‌సభ స్థానాన్ని దక్కించుకుందో గమనిస్తే…

హైదరాబాద్‌…

అసదుద్దీన్‌ ఒవైసీ (ఎంఐఎం)

జహీరాబాద్‌…

బి.బి.పాటిల్‌ (టీఆర్ఎస్)

మెదక్‌…

కొత్త ప్రభాకర్ రెడ్డి (టీఆర్ఎస్)

పెద్దపల్లి (ఎస్సీ)…

వెంకటేశ్ నేత (టీఆర్ఎస్)

మహబూబ్‌నగర్‌…

మన్నె శ్రీనివాసరెడ్డి (టీఆర్ఎస్)

చేవెళ్ల…

గడ్డం రంజిత్ రెడ్డి (టీఆర్ఎస్)

వరంగల్‌ (ఎస్సీ)…

పసునూరి దయాకర్ (టీఆర్ఎస్)

నాగర్‌ కర్నూల్‌ (ఎస్సీ)…

పి.రాములు (టీఆర్ఎస్)

ఖమ్మం…

నామా నాగేశ్వరరావు (టీఆర్ఎస్)

మహబూబాబాద్‌ (ఎస్టీ)…

మాలోతు కవిత (టీఆర్ఎస్)

సికింద్రాబాద్‌…

జి. కిషన్‌రెడ్డి (బీజేపీ)

ఆదిలాబాద్‌ (ఎస్టీ)…

సోయం బాపూరావు (బీజేపీ)

కరీంనగర్‌…

బండి సంజయ్‌ (బీజేపీ)

నిజామాబాద్‌…

ధర్మపురి అరవింద్ (బీజేపీ)

మల్కాజ్‌గిరి…

ఎనుముల రేవంత్‌రెడ్డి (కాంగ్రెస్)

నల్గొండ…

ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (కాంగ్రెస్)

భువనగిరి…

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (కాంగ్రెస్)