ప్రభావం చూపని పవన్‌కల్యాణ్

46

అమరావతి, మే 23 (న్యూస్‌టైమ్): ఎన్నికలకు ముందు ఎంత హడావుడి చేశాడో గానీ, చివరికి ఓటింగ్ సమయానికి వచ్చేసరికి మాత్రం మడం తిప్పాడు పవన్ కల్యాణ్. ‘వచ్చేది నేనే, రానున్నది జనసేన ప్రభుత్వమే’ అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలిస్తూ ఊళ్లేగిన జనసేనాని చివరికి మడం తిప్పేశాడు. కనీసం తన అన్నలా నామమాత్రపు సీట్లను కూడా దక్కించుకోలేకపోగా, ఉన్న పరువునూ ఊడగొట్టకున్నాడు. సొంత జిల్లా పశ్చిమ గోదావరిలోని భీమవరం నుంచి అసెంబ్లీ బరిలోకి దిగిన ఆయన ఏ మాత్రం అక్కడి ఓటర్లను ప్రభావితం చేయలేకపోయారు. కనీసం రెండో స్థానంగా ఎంచుకున్న విశాఖ జిల్లా గాజువాకలోనైనా తన పరువు నిలబెట్టుకుంటాడని ఆశతో ఎదురుచూసిన అభిమానుల ఆశలు అడియాశలే అయ్యాయి.

ఇక, మధ్యాహ్నానికి వచ్చిన ఫలితాల ప్రకారం రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా చివరి వరకూ కొనసాగిందనే చెప్పాలి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (పుంగనూరు), పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (మాచర్ల), బొత్స అప్పల నరసయ్య (గజపతినగరం) గెలుపొందారు. చిత్తూరు జిల్లా కుప్పంలో14వ రౌండ్‌ ముగిసే సరికి చంద్రబాబు 22,957 ఓట్ల ఆధిక్యంలో ఉండగా, పులివెందులలో 17వ రౌండ్‌ ముగిసే సరికి జగన్‌ 62 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మరోవైపు, ఏపీ ఎన్నికల్లో తెదేపా పరాజయం చవిచూడటంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీఎం పదవికి రాజీనామా చేయనున్నారు.

రాజీనామా లేఖను గవర్నర్‌కు పంపనున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులు అంజాద్‌బాషా (కడప), ఎలిజా (చింతలపూడి), జోగి రమేష్‌ (పెడన), ఆదిమూలం (సత్యవేడు)లు గెలుపొందారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నట్లు చిత్తూరు జిల్లా పలమనేరు తెదేపా అభ్యర్థి అమర్‌నాథ్‌రెడ్డి అన్నారు. అపజయానికి కారణాలు ఇప్పుడే చెప్పలేమన్నారు. ఏపీలో రెండో విజయం కూడా వైకాపానే నమోదు చేసింది. విజయనగరం శాసనసభ అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి గెలుపొందారు.

అంతకముందు, విజయనగరం జిల్లా పార్వతీపురం వైకాపా అభ్యర్థి జోగారావు విజయం సాధించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా విజయం సాధించడం పట్ల సీఎం కేసీఆర్‌ జగన్‌కు ఫోన్‌ చేసి అభినందనలు తెలిపారు. వైకాపా అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌కు ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. కాగా, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా విజయం ముందుగానే ఊహించిందని వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి అన్నారు.