ఆంధ్రప్రదేశ్‌లో ‘ఫ్యాన్’ గాలి!

111

అమరావతి, మే 23 (న్యూస్‌టైమ్): ఊహించని రీతిలో ఆంధ్రప్రదేశ్‌ శాసనసభా ఎన్నికల్లో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జోరు కొనసాగుతోంది. ఎగ్జిట్ పోల్స్‌ అంచనాల ప్రకారమే ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉదయం పదిన్నర సమయానికి అందిన సమాచారం మేరకు దాదాపు 130కు పైగా శాసనసభా స్థానాల్లో ఆ పార్టీ ఆధిక్యంలో ఉంది. అధికార తెలుగుదేశం పార్టీ సుమారు 30 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉండటం గమనార్హం. పలువురు మంత్రులు కూడా వెనుకంజలో ఉన్నారు.

కింజరాపు అచ్చెన్నాయుడు, కిడారి శ్రవణ్‌, డాక్టర్ పొంగూరు నారాయణ, భూమా అఖిలప్రియ, నారా లోకేశ్‌, సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, చింతకాయల అయ్యన్నపాత్రుడు, నిమ్మకాలయ చినరాజప్ప వంటి హేమాహేమీలు కూడా వెనుకంజలో ఉండగా, దేవినేని ఉమామహేశ్వరరావు, కె.ఎస్. జవహర్‌ తదితరులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. గుడివాడ శాసనసభా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన వైకాపా అభ్యర్థి కొడాలి నాని ఆధిక్యంలో ఉన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మంత్రి నారా లోకేశ్‌ వెనుకంజలో ఉన్నారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి తన ఆధిక్యతను ప్రదర్శించారు.

విశాఖ జిల్లా గాజువాక, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శాసనసభా నియోజకవర్గాల్లో జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ వెనుకంజలో ఉన్నారు. కాగా, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపులో తెదేపా అభ్యంతర వ్యక్తం చేసింది. 60ఏ ప్రకారం రావాల్సిన పోస్టల్ బ్యాలెట్‌లను 80సీ ప్రకారం పంపారని ఆరోపించింది. వాటిని పరిగణనలోకి తీసుకోవద్దని ఆర్వోతో వాగ్వాదానికి దిగడంతో ఈసీతో మాట్లాడి తుది నిర్ణయం తీసుకుంటామని ఆర్వో తెలిపారు.

మొదట్లో వైకాపా అభ్యర్ధి కంటే వెనుకబడిన తెదేపా అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తర్వాత పుంజుకున్నారు. ప్రస్తుతానికి ఆయన ముందంజలో ఉన్నారు. వైకాపాపై సుమారు 1500 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. గుంటూరు జిల్లా తెనాలి శాసనసభా స్థానం నుంచి పోటీ చేసిన జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌ ఆధిక్యంలో ఉన్నారు. కడప, బద్వేలు, రాయచోటి, ప్రొద్దులూరు, మైదుకూరు, పులివెందులో శాసనసభా నియోజకవర్గాల్లో వైకాపా ఆధిక్యాన్ని ప్రదర్శించింది.

అనంతపురం జిల్లా హిందూపురం శాసనసభా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన తెదేపా అభ్యర్థి, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ముందంజలో ఉన్నారు. నెల్లూరు సిటీ శాసనసభా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మంత్రి నారాయణ తొలిరౌండ్ పూర్తయ్యేసరికి వెనుకంజలో ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్ముడివరం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి పితాని బాలకృష్ణ ముందంజలో ఉన్నారు.

ఓట్ల లెక్కింపులో భాగంగా కర్నూలు జిల్లా ఆలూరు, 1, 7, 8 పోలింగ్‌ కేంద్రాల్లో ఈవీఎంల్లో సమస్యలు తలెత్తాయి. ఈవీఎంలు ఇన్‌వాలిడ్‌ ఓట్లుగా చూపించాయి. దీంతో అక్కడ టీడీపీ శ్రేణులు, అధికారుల మధ్య వాగ్వాదం తలెత్తింది. అరకు శాసనసభ నియోజకవర్గంలో కిడారి శ్రవాణ్‌తో తలపడిన వైకాపా అభ్యర్థి చెట్టి ఫాల్గుణ ఆధిక్యం ఉన్నారు. కాగా, చిత్తూరు సీతమ్స్‌ కాలేజ్‌ కౌంటింగ్‌ కేంద్రంలో పార్టీ ఏజెంట్ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. స్థలాభావం కారణంగా 4 పార్టీల ఏజెంట్లనే అధికారులు అనుమతించారు. తమనూ అనుమతించాలని అధికారులతో పోలింగ్‌ ఏజెంట్లు వాగ్వాదానికి దిగారు.

వెంటనే సమాచారం తెలుసుకున్న తిరుపతి అర్బన్‌ ఎస్పీ అన్బు రాజన్‌ పరిస్థితిని చక్కదిద్దారు. గుంటూరు జిల్లా మంగళగిరి శాసనసభ నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ప్రస్తుతం మంత్రి నారా లోకేశ్‌ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అయితే, తెలుగుదేశం పార్టీ గెలుపును ఏ శక్తి ఆపలేదని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోమారు స్పష్టం చేశారు.

పార్టీ నేతలతో గురువారం ఉదయం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించిన ఆయన కౌంటింగ్ చివరివరకు కౌంటింగ్ కేంద్రంలోనే ఉండాలని సూచించారు. వైకాపా నేతలు అరాచకాలకు పాల్పడినా సంయమనం పాటించాలని ఆయన కోరారు. ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అటు శాసనసభ, ఇటు లోక్‌సభకు మొత్తం 5,03,199 పోస్టల్‌ బ్యాలెట్లు పోలయ్యాయి. గురువారం ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఉదయం నుంచి జగన్ దంపతులు తాడేపల్లిలోని ఇంటి నుంచి పర్యవేక్షించారు. ఓట్ల లెక్కింపు సరళిని వీరిద్దరూ అక్కడి నుంచే పార్టీ అభ్యర్థులు, నేతలతో కలిసి సమీక్షించారు.

మరోవైపు, ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నివాసం వద్ద ప్రస్తుతం సందడి నెలకొంది. అక్కడి నుంచే ఫలితాలను వీక్షించేందుకు మీడియా కవర్ చేసుకునే నిమిత్తం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటుచేసి ఫలితాల డ్యాష్‌బోర్డును లైవ్‌లో ప్రదర్శించారు. మరోవైపు, కృష్ణా జిల్లా మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని అత్యధిక అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైకాపా ఆధిక్యంలో ఉంది. పామర్రు, నూజివీడు, మచిలీపట్నం, గుడివాడ, గన్నవరం, పెడన, అవనిగడ్డ, పెనమలూరు సహా పది నియోజకవర్గాల్లో వైకాపా ఆధిక్యంలో ఉండగా, ఆరు స్థానాల్లో తెదేపా ఆధిక్యంలో ఉంది.

విజయనగరం, నెల్లూరు జిల్లాల్లోని అన్ని స్థానాల్లో వైకాపా ఆధిక్యంలో ఉంది. శ్రీకాకుళంలో 9 స్థానాల్లో ముందంజలో ఉంది. కాగా, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై జనసేన ప్రభావం పెద్దగా కనిపించ లేదు. ఆ పార్టీకి ఎక్కడా ఆధిక్యం లభించలేదు. తొలుత ఒకటి రెండు స్థానాల్లో ఆధిక్యం లభించినా, ఆ తర్వాత ఎక్కడా లీడ్‌లోకి రాలేదు. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ వెనుకంజలో ఉండటం గమనార్హం.