హైదరాబాద్‌లో ప్రపంచంలోనే అతి పెద్ద ఫార్మాసిటీ: కేటీఆర్‌

88

హైదరాబాద్, మే 22 (న్యూస్‌టైమ్): ప్రపంచంలోనే అతి పెద్ద ఫార్మాసిటీని త్వరలో హైదరాబాద్‌లో ప్రారంభించనున్నట్లు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. పార్క్ హయత్‌లో బుధవారం జరిగిన ఒడిస్సీ లాజిస్టిక్స్ రెండవ వార్షికోత్సవ వేడుకలకు కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అతిధులుగా మంత్రి నిరంజన్‌రెడ్డి, ఢిల్లీలో తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్ రాష్ట్రానికి కొత్తగా 2800 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ తీసుకొచ్చామన్నారు.

విస్తృతమైన రోడ్డు కనెక్టివిటీ కల్పిస్తున్నామన్నారు. ఎన్నికల కోడ్ వల్ల 6 నెలలుగా అభివృద్ధి పనులన్నీ నెమ్మదిగా జరుగుతున్నాయన్నారు. ఉత్పత్తి రంగం అభివృద్ధి చెందితే ఎక్కువ ఉద్యోగాలు వస్తాయని కేటీఆర్ స్పష్టం చేశారు. ఫార్మా, బయోటెక్నాలజీ, లైఫ్‌సైన్సెస్‌కు హైదరాబాద్ పర్యాయపదంగా మారిందని అన్నారు. హైదరాబాద్‌లో 19 వేల ఎకరాల విస్తీర్ణంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మాసిటీని త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఫార్మారంగానికి హైదరాబాద్ కేంద్ర బిందువన్నారు.

ప్రపంచంలోని ఫార్మా ఉత్పత్తుల్లో మూడోవంతు హైదరాబాద్‌లోనే ఉత్పత్తి అవుతున్నాయని, ప్రపంచంలోనే పేరుగాంచిన ఫార్మాకంపెనీలు హైదరాబాద్‌లో ఉన్నాయని గుర్తుచేశారు. ఫార్మారంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ చేయూతనిస్తుందని తెలిపారు. పారిశ్రామికరంగ అభివృద్ధికి కేంద్రప్రభుత్వం ‘మేకిన్ ఇండియా’ ద్వారా చేయూతనిస్తుండగా అదే స్ఫూర్తిని తెలంగాణ ప్రభుత్వం కొనసాగిస్తోందని చెప్పారు. అందుకే తెలంగాణలో నూతన పారిశ్రామిక విధానం రూపొందించామన్నారు.

రాష్ట్రంలో పరిశ్రమల విస్తరణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని, మౌలిక సదుపాయాల విస్తరణకు పెద్దపీట వేస్తోందని తెలిపారు. రాష్ట్రంలో 1952 నుంచి 2014 సంవత్సరం వరకు 2,018 కిలోమీటర్ల నిడివిగల జాతీయ రహదారులుంటే గడిచిన ఐదేళ్లలో రాష్ట్రానికి కొత్తగా 2,800 కిలోమీటర్ల జాతీయ రహదారులను తీసుకొచ్చామని తెలిపారు. పరిశ్రమల విస్తరణకు రోడ్లు, రైలు, విమానం వంటి రవాణా సౌకర్యాలు కీలకమన్నారు. తెలంగాణలో గడిచిన ఐదేళ్లలో విస్తృతమైన రోడ్డు కనెక్టివిటీ కల్పిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ఉన్న అవుటర్ రింగురోడ్డుకు అదనంగా 330 కిలోమీటర్ల నిడివితో రీజినల్ రింగురోడ్డు నిర్మించనున్నట్టు తెలిపారు. లాజిస్టిక్ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మంచి భవిష్యత్తు ఉన్నదని కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలో లాజిస్టిక్ జోన్ల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు.

హైదరాబాద్‌లో మెట్రోరైల్ ఏర్పాటు అనంతరం రవాణావ్యవస్థ మరింత మెరుగుపడిందని చెప్పారు. ఎన్నికల కోడ్ కారణంగా రాష్ట్రంలో అభివృద్ధి పనులు నెమ్మదించాయన్నారు. ఉత్పత్తిరంగం అభివృద్ధి చెందితే ఎక్కువగా ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. ఒడిస్సీ లాజిస్టిక్స్ ఎండీ అభిషేక్ ఠాగూర్ మాట్లాడుతూ తమ కంపెనీని ప్రారంభించిన రెండు సంవత్సరాల్లోనే ప్రపంచవ్యాప్తంగా సమర్థంగా సేవలందిస్తున్నామని తెలిపారు. ఈ రెండేళ్లలో తెలంగాణ ప్రభుత్వం అందించిన సహకారం మరువలేమన్నారు. రాబోయే రోజుల్లో మరింత ప్రోత్సాహం లభిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు.

తెలంగాణ ప్రభుత్వ సేవలను సద్వినియోగం చేసుకొని రాష్ట్రంలో ఫార్మారంగాన్ని మరింత విస్తృతంచేసేందుకు కృషిచేస్తామన్నారు. అనంతరం హైదరాబాద్ ఫార్మారంగంలో విశిష్ట సేవలందిస్తున్నవారికి కేటీఆర్, వ్యవసాయశాఖ మంత్రి ఎస్ నిరంజన్‌రెడ్డి జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీలో రాష్ట్రప్రభుత్వ ప్రతినిధి సముద్రాల వేణుగోపాలాచారి, పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్, నాగరాజుగౌడ్, విఘ్నేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కాగా, ఇంటర్నేషనల్ రోబో ఫెస్ట్ విజేతలుగా నిలిచిన విద్యార్థులను టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు. హైదరాబాద్‌కు చెందిన విద్యార్థులు మూడు క్యాటగిరీల్లో రెండో, మూడో స్థానాల్లో నిలిచారు. వీరిని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు. సుహాస్, ఆర్నవ్, తరుణ్ మనందరినీ గర్వపడేలా చేసినందుకు, ఈ ముగ్గురికి హృదయపూర్వక అభినందనలు అని ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.