అనుకున్నది సాధించడంలో ‘అన్నే’ ఆదర్శం

149

అమరావతి, మే 20 (న్యూస్‌టైమ్‌): ఒక వ్యక్తి తలచుకుంటే చరిత్ర సృష్టించవచ్చనడానికి ఎన్టీఆర్ జీవితమే నిదర్శనం. అయితే ఎన్టీఆర్ ఆ స్థాయికి రావడానికి ఎంతటి కృషి చేసారో, ఎంతటి పట్టుదలతో ప్రయత్నించారో తెలుసుకున్నవారు ‘కృషివుంటే మనుషులు ఋషులు, మహాపురుషులు అవుతార’న్న సత్యాన్ని తెలుసుకోగలుగుతారు. తన జీవితంలో పొందిన ప్రతీదీ ఆ భగవంతుడూ, ఈ ప్రజలు ఇచ్చినదే అని ఎన్నో ఉపన్యాసాలలో ఎన్టీఆర్ చెప్పినప్పటికీ కష్టపడి పైకొచ్చిన వారు అనే ఒద్దికైన మాట అది.

రోజుకు మూడు షిఫ్టులు పనిచేసి, ఏడాదికి పది పన్నెండు సినిమాలు చేసి పరిశ్రమ కోసం శ్రమించక పొతే ఎన్టీఆర్ వెండితెర వేలుపు కాగలిగేవారా? ఆస్తుల్నీ, ఆదాయాన్నీ వదులుకుని ఖాకీ దుస్తులతో ఎండనక, వాననక వాడవాడలా, పల్లె పల్లెనా తిరిగి ప్రజలను మేలుకొల్పకపోతే అత్యంత ప్రజాదరణ కలిగిన ప్రజా నాయకుడిగా చరిత్ర సృష్టించగలిగేవారా? అప్పటికైనా, ఇప్పటికైనా, ఎప్పటికైనా చరిత్రలో తన పేరు వినిపించాలని కోరుకునేవారందరికీ ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆదర్శంగానూ, మార్గదర్శనంగానూ నిలుస్తుంది.

మరోవైపు, ఎన్టీఆర్ తాను నటించే చిత్రాలలో మాస్ అట్రాక్షన్ కోసం రకరకాల రంగుల కాంబినేషన్‌లో ఉండే దుస్తులను ధరించేవారు. రకరకాల మారువేషాలు కూడా ఉండేవి. ఈ విషయమై ‘కట్టుబట్ట లేని నిరుపేద పాత్రలు, రిక్షా తొక్కే శ్రామిక పాత్రలు వేస్తున్న సమయంలోనూ స్టైలిష్‌గా కనపడడం అవసరమా? నిజ జీవితంలో వీరంతా చిరుగు దుస్తుల్లో కనపడతారు కదా’ అని ఒక విలేఖరి ఎన్టీఆర్‌ను అడిగారు.

అందుకు ఎన్టీఆర్ సమాధానమిస్తూ ‘‘మీరు చెప్పింది నిజమే. కానీ పగలల్లా కష్టపడి, ఆ సంపాదనతో టిక్కెట్టు కొనుక్కుని సినిమా హాలులో కూర్చున్న రిక్షా కార్మికుడుగానీ, కూలీగానీ తన లేనితనాన్ని తిరిగి తెరమీద చూడాలని, చూసి విచారించాలని అనుకోరు. తన జీవితం రంగులమయంగా ఉండాలని కలలు కంటాడు. ఆ కలల్లో తను ఇలా ఉంటే బాగుండని అనుకుంటాడు. అది భవిష్యత్తులో జరగొచ్చు.

జరగక పోవచ్చు. కానీ సినిమాలో తప్పనిసరిగా జరగాలి. ఎందుకంటే ఇదొక ఊహ. ఆ ఊహ అందంగా ఉంటే తప్పేంటి? ఆ శ్రమజీవి తనను నా పాత్రలో చూసుకుంటాడు. అతనికి ఆనందం కలిగించడం నటుడిగా నా బాధ్యత. వారి కోసం నేను ఏమైనా చేస్తాను’’ అని అన్నారు. తన సినిమా చూసే ప్రేక్షకుల గురించి ఎన్టీఆర్ ఆలోచనలు అంత లోతుగా, మానవతా దృక్పథంతో ఉండేవి.