తెలంగాణలో ధాన్యం సేకరణ విధానంపై ప్రశంసలు

140

హైదరాబాద్, మే 17 (న్యూస్‌టైమ్): తెలంగాణలో ధాన్యం సేకరణ విధానం భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)ని ఆకట్టుకుంది. రాష్ట్రంలో అమలుచేస్తున్న విధానం చాలా బాగుందని ఎఫ్‌సీఐ బృందం ప్రతినిధులు ప్రశంసించారు. రాష్ట్రంలో ప్రతీ ఏటా ధాన్యం దిగుబడులు పెరుగుతున్న నేపథ్యంలో దానికి అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యలు రైతులకు ఎంతో ఉపయోగపడుతున్నట్లు ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.

హైదరాబాద్‌‌లోని పౌరసరఫరాల భవన్‌లో భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) ప్రతినిధుల బృందం సమావేశమైంది. ఎఫ్‌‌సీఐ ప్రధాన సలహాదారు ఎస్‌పీ కార్‌, ఎఫ్‌సీఐ తెలంగాణ జనరల్‌ మేనేజర్‌ అశ్వినీ కుమార్‌, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అకున్‌ సబర్వాల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ధాన్యం సేకరణ, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, ఎదుర్కొంటున్న సమస్యలు, ఇతర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. తెలంగాణ రైస్ మిల్లర్ల దగ్గర ఉన్న 3.44 లక్షల టన్నుల రా రైస్‌ను తీసుకునేందుకు వారు సంసిద్ధత వ్యక్తం చేశారు.

సీఎంఆర్ బియ్యం ధృవీకరణలో జరుగుతున్న జాప్యాన్ని నివారించి సేకరణ ప్రక్రియను వేగవంతం చేస్తామని ఎఫ్‌సీఐ అధికారులు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ధాన్యం సేకరణ, స్టోరేజ్‌ స్పేస్‌ తదితర అంశాల్లో ఎఫ్‌సీఐ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అకున్‌ సబర్వాల్ ఎఫ్‌సీఐ ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు.

ఈ ఏడాది ఖరీఫ్‌, రబీలో 68 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిందని, అందులో 23 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని నిల్వ చేసుకునేందుకు ఎఫ్‌సీఐ గోదాముల్లో స్టోరేజ్‌ స్పేస్‌ చూపించకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఎఫ్‌సీఐ ప్రతినిధులకు తెలిపారు. దీంతోపాటు ఎఫ్‌సీఐ గోదాముల్లో రా రైస్‌, బాయిల్డ్‌ రైస్‌ నిల్వలు పేరుకుపోవడంతో కస్టం మిల్లింగ్‌ రైస్‌‌ను అప్పగించేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈ నిల్వలను ఇతర రాష్ట్రాలకు తరలించాలని విజ్ఞప్తి చేశారు. అకున్ సబర్వాల్ విజ్ఞప్తులకు ఎఫ్‌సీఐ అధికారులు సానుకూలంగా స్పందించారు. బియ్యం నిల్వలను తక్షణమే కేరళ, కర్ణాటకకు తరలిస్తామని హామీ ఇచ్చారు.