అసభ్యకర పోస్టులకు కలతచెంది ఆర్టీసీ డ్రైవర్‌ ఆత్మహత్యాయత్నం

44

కామారెడ్డి, మే 16 (న్యూస్‌టైమ్): సామాజిక మాద్యమాల్లో తప్పుడు పోస్టింగ్‌లు పెట్టినందుకు తీవ్ర మనస్థాపం చెందిన కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్‌ సుతారి శ్రీనివాస్‌ ఎలుకల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయనను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. స్థానికులు తెలిపిన ప్రకారం, హైదరాబాద్ నుంచి కామారెడ్డికి వెళ్లే నాన్ స్టాప్‌ బస్సులో శ్రీనివాస్‌ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.

ఈ నేపథ్యంలో ఇటీవల మేడ్చల్ ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న సిద్ధిరాములు అనే కండక్టర్ శ్రీనివాస్‌ నడుపుతున్న బస్సు ఎక్కి, తనని మెదక్‌ జిల్లా రామాయంపేటలో దించమని కోరాడు. ‘ఇది కామారెడ్డి నాన్‌ స్టాప్ బస్సు అని, రామాయంపేటలో ఆగదు’ అని చెప్పి, అక్కడి బైపాస్ వద్ద దిగాలని శ్రీనివాస్‌ సూచించాడు. అయితే, రామాయంపేటలో ఎందుకు దించవచ్చంటూ సిద్ధిరాములు శ్రీనివాస్‌తో వాగ్వివాదానికి దిగాడు. అంతేకాకుండా శ్రీనివాస్‌ ఫొటోలు తీసుకుని వాటిని వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లో అసభ్యకర పోస్ట్‌లతో కలిపి పెట్టాడు.

ఈ పోస్ట్‌లు చూసి తీవ్ర మనస్థాపానికి గురైన శ్రీనివాస్‌ ఆత్మహత్యయత్నం చేశాడు. విషయం తెలుసుకున్న కామారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్‌లు, కండక్టర్‌లు ఆసుపత్రికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. పరిస్థితి విషమంగా ఉండడంతోనే శ్రీనివాస్‌ను హైదరాబాద్‌కు తరలించాలని వైద్యులు సూచించారు.