ఓటర్ల లెక్కింపునకు యంత్రాంగం సన్నద్ధం

37

చిత్తూరు, మే 16 (న్యూస్‌టైమ్): సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ నెల 23న నిర్వహించే ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఆర్ఓ, ఏఆర్ఓలు సన్నద్ధం కావాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ పి.ఎస్.ప్రద్యుమ్న ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ లోని సమావేశపు మందిరంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి ఆర్ ఓ లతో సమీక్ష నిర్వహించారు.

ఈ సంధర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ పోలింగ్ పర్సన్ లకు మొదటి ర్యాండమైజేషన్ పూర్తైనదని, ఈ నెల 18 వ తేదీ మొదటి విడత, 20 వ తేదీ రెండవ విడత కౌంటింగ్ సిబ్బందికి పివికెఎన్ కాలేజీ, సావిత్రమ్మ కాలేజీల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ నెల 17 వ తేదీన కౌంటింగ్ కేంద్రాలలో ఆయా నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జరిగే కేంద్రాలను బరిలో ఉన్న అభ్యర్థులను తీసుకుని వెళ్ళి అక్కడ చేసిన ఏర్పాట్లను ఏఆర్ఓ లు చూపించవచ్చునని చెప్పారు. వివిధ రాజకీయ పార్టీల తరఫున కౌంటింగ్ రోజున వచ్చే కౌంటింగ్ ఏజెంట్ లకు ఇచ్చే పాసులతో పాటు కౌంటింగ్ రోజున పాటించవలసిన నియమాలను తెలిపాలని, ఏజెంట్ లు 17 సి రిపోర్ట్ను కూడా తీసుకుని వచ్చే విధంగా ఆర్ఓలు సూచించాలన్నారు. కౌంటింగ్ ఏజెంట్ లు బాల్ పాయింట్ పెన్లు మాత్రమే వారి వెంట తీసుకుని రావాలని, రౌండ్ల వారీగా రిసల్ట్ ల కాపీని కౌంటింగ్ కేంద్రంలో అందజేయడం జరుగుతుందని, కౌంటింగ్ సిబ్బందికి మరియు కౌంటింగ్ ఏజెంట్ లకు అందరికీ భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

మొబైల్ ఫోన్ లు కౌంటింగ్ కేంద్రాల్లో నిషేదం అని ఎలక్షన్ అబ్జర్వర్లు, ఆర్ ఓ లకు మాత్రమే ఫోన్ లు తీసుకుని వెళ్లడానికి అనుమతి కలదని తెలిపారు. ఈ నెల 16 వ తేదీ నాటికి కౌంటింగ్ కేంద్రాలలో బ్యారీకేడింగ్ ని పూర్తి చేయాలని ఆర్ ఓ లను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు తిరుపతి నుండి తిరుపతి ఆర్ఓ విజయరామరాజు, చంద్రగిరి ఆర్ఓ మహేశ్ కుమార్, మదనపల్లె నుండి కీర్తి చేకూరీ, జిల్లా కేంద్రం నుండి కుప్పం, పీలేరు, పుంగనూరు, ఆర్ఓలు గంగాధర గౌడ్, కమలకుమారి, కనకనరసా రెడ్డితో పాటు మిగిలిన ఆర్ఓలు అందరూ పాల్గొన్నారు.