డెంగ్యూ రహిత జిల్లాగా సంగారెడ్డి: కలెక్టర్

114

సంగారెడ్డి, మే 16 (న్యూస్‌టైమ్): డెంగ్యూ తరహా సీజనల్ వ్యాధుల రహిత జిల్లాగా సంగారెడ్డిని అభివృద్ధి చేసేందుకు ప్రజలంతా సహకరించాలని కలెక్టర్ ఎం. హనుమంతరావు పిలుపునిచ్చారు. జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం సందర్భంగా గురువారం ఏర్పాటుచేసిన అవగాహన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. వర్షాకాలానికి ముందుగానే డెంగ్యూపై అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తున్నామని, ఈ ఏడాది ఇక నుండి ఒక్క డెంగ్యూ కేసు కూడా నమోదు కాకుండా ఇటు ప్రజలు, అటు వైద్యాధికారులు, సిబ్బంది అవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్బంగా కలెక్టర్ సూచించారు.

డెంగ్యూ వ్యాధి ప్రబలకుండా జిల్లా వ్యాప్తంగా ముందస్తు నివారణ చర్యలు చేపడుతున్నట్లు జిల్లా మలేరియా అధికారి (డీఎంవో) డాక్టర్ వీర్రాజు తెలిపారు. పాత పాత్రలు, ప్లాస్టిక్‌ వస్తువులు, పూల కుండీలు, డ్రమ్ములు, టైర్లలో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని హితవుపలికారు. వారానికోసారి నీటి నిల్వలను పూర్తిగా ఖాళీ చేసి డ్రైడే పాటించాలని కోరారు. పాత్రలను పూర్తిగా శుభ్రపరచి ఎండలో ఉంచాలని సూచించారు. దీనివల్ల దోమల పెరుగుదలను అరికట్టవచ్చని చెప్పారు.

ప్రతి శుక్రవారం గ్రామాలలోను, మండల, జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనూ పచ్చదనం పరిశుభ్రత పెంచేందుకు కృషిచేయాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు. ఖాళీ ప్రదేశాలలో మొక్కల్ని పెంచడంతో పాటు శ్రమదానం చేయడం ద్వారా చెత్తాచెదారాలను ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉండాలన్నారు.

రానున్న వర్షా కాలంలో మరింత ఎక్కువగా హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామాలలో మొక్కల నర్సరీలు పెంపొందించుకోవాలన్నారు. ఎండ తీవ్రత నేపథ్యంలో ప్రజలు ముందు జాగ్రత్తలు తీసుకుని వడదెబ్బ నుంచి విముక్తులు కావాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ రాథోడ్, డాక్టర్ కాశీనాథ్, తెలంగాణ మెడికల్, హెల్త్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.