‘థర్డ్‌ ఫ్రంట్‌’కు అవకాశం లేదు: స్టాలిన్‌

115

చెన్నై, మే 14 (న్యూస్‌టైమ్): లోక్‌సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌, భాజపాయేతర కూటమికి ఎలాంటి అవకాశాలు లేవని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ అన్నారు. కాంగ్రెస్‌, భాజపాయేతర ప్రాంతీయ పార్టీల సమాఖ్య కూటమి ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసిన మరుసటి రోజే స్టాలిన్‌ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుంది. సమాఖ్య కూటమి ఏర్పాటు ప్రయత్నాల్లో భాగంగా కేసీఆర్‌ నిన్న చెన్నై వెళ్లి స్టాలిన్‌ను కలిసిన విషయం తెలిసిందే.

ప్రాంతీయ పార్టీలు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని, ఇందు కోసం తాను చేస్తున్న ప్రయత్నానికి మద్దతు పలకాలని కేసీఆర్‌ కోరారు. అయితే తెలంగాణ సీఎంతో భేటీ జరిగిన మరుసటి రోజే.. సమాఖ్య కూటమిపై స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భాజపా, కాంగ్రెస్‌ లేకుండా మూడో కూటమి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశముందని తనకు అన్పించడం లేదని అన్నారు. అయితే మే 23 తర్వాతే దీనిపై ఓ స్పష్టత వస్తుందన్నారు. అంతేగాక, సమాఖ్య కూటమికి మద్దతు కోరేందుకు కేసీఆర్‌ చెన్నై రాలేదని, కేవలం దైవ దర్శనాల కోసం వచ్చారని అన్నారు.

‘‘కూటమిని ఏర్పాటు చేసేందుకు ఆయన(కేసీఆర్‌) ఇక్కడకు రాలేదు. ఆలయాల దర్శన కోసం తమిళనాడు వచ్చారు. ఈ నేపథ్యంలో మర్యాదపూర్వకంగా కలిసేందుకే నా అపాయింట్‌మెంట్‌ కోరారు. అంతే’’ అని స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు.