నిబంధనల చట్రంలో ఏపీ కేబినెట్ భేటీ

77

అమరావతి, మే 14 (న్యూస్‌టైమ్): ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సుమారు రెండు గంటల పాటు కొనసాగిన ఈ భేటీలో కేంద్రం అనుమతించిన నాలుగు అంశాలపైనే ప్రధానంగా చర్చించారు. ఫొని తీవ్ర తుపానుతో ఉత్తరాంధ్రలో వాటిల్లిన నష్టం, రాష్ట్రంలో నీటి ఎద్దడి, కరవు పరిస్థితులు, ఉపాధి హామీ పనులకు సంబంధించిన అంశాలతో పాటు రాష్ట్రంలో నెలకొన్న అనేక అంశాలపై చర్చించారు.

ఈ భేటీకి ముగ్గురు మంత్రులు మినహా మంత్రులంతా హాజరై పలు సూచనలు చేసినట్టు సమాచారం. తమ శాఖలకు సంబంధించిన అంశాలను ఇందులో ప్రస్తావించారు. విపత్తు నిర్వహణ శాఖ, వ్యవసాయ శాఖ, పంచాయతీ రాజ్‌ శాఖ కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొని తమ శాఖలకు సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. ఫొని తుపాను కారణంగా ప్రాథమిక అంచనాల ప్రకారం రూ.58 కోట్ల మేర నష్టం వాటిల్లిందని, తదుపరి అంచనాలపై సర్వే జరుగుతోందని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.

ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో చాలా చోట్ల విద్యుత్‌ స్తంభాలు నేలకొరగడంతోపాటు పలు పంటలకు కూడా నష్టం వాటిల్లినట్టు అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. తాగునీటి ఎద్దడిపై చర్చ సందర్భంగా రాయలసీమ జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉందని, ట్యాంకర్ల ద్వారా తాగునీటిని అందిస్తున్నామని, సాగునీరు అందక చాలా పంటలు ఎండిపోయాని విపత్తు, ఉద్యానవన, వ్యవసాయ శాఖ కార్యదర్శులు వివరించారు.

ఉపాధి పనులకు సంబంధించి అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో కొన్ని చోట్ల కరవు నేపథ్యంలో ప్రజలు వలసలు వెళ్తున్నారని, ఉపాధి పనుల్లో నిధులు విడుదల్లో జాప్యం నెలకొందని, త్వరితగతిన నిధులు విడుదల చేయాలని అధికారులు కోరినట్లు సమాచారం. ఎన్నికల కోడ్‌ కారణంగా కొత్త పనులేవీ చేపట్టకపోవడంతో ఇబ్బందులు ఏర్పడిన నేపథ్యంలో గతంలో జారీచేసినటువంటి ప్రభుత్వం జారీచేసిన ఆదేశాల ఆధారంగానే ఈ పనులు చేపట్టాలని సీఎం సూచించినట్టు సమాచారం.

ఉపాధి హామీ పథకం అమలులో ఉత్తమ రాష్ట్రంగా ఏపీ నిలిచింది. ఐదు విభాగాల్లో తొలిస్థానం, ఆరు విభాగాల్లో రెండో స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఉపాధిహామీ, పంచాయతీ రాజ్‌ శాఖ అధికారులను అభినందించారు.