బెంగాల్‌లో ఆరో విడతలోనూ చెలరేగిన హింస

105
The voters standing in the queues to cast their votes, at a polling booth, during the 6th Phase of General Elections-2019, at Malviya Nagar, in New Delhi on May 12, 2019.

న్యూఢిల్లీ, కోల్‌కతా, మే 12 (న్యూస్‌టైమ్): పశ్చిమ బెంగాల్‌లో సార్వత్రిక ఎన్నికల ఆరో విడత పోలింగ్‌ సందర్భంగా ఆదివారం పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. వివిధ ప్రాంతాల్లో భాజపా, తృణమూల్‌ కార్యకర్తలు పరస్పరం ఘర్షణకు దిగారు. ఇటీవల జరిగిన అయిదో విడత పోలింగ్‌లో రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో ఈ ఆరోదశకు పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. అయినా పాత పరిస్థితులే పునరావృతం అయ్యాయి. ఘటాల్‌ లోక్‌సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి భారతీఘోష్‌పై తృణమూల్‌ కాంగ్రెస్‌ మహిళా కార్యకర్తలు దాడికి యత్నించారు. నియోజకవర్గంలోని ఓ పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలించేందుకు వెళ్లిన భారతిని చుట్టుముట్టిన టీఎంసీ కార్యకర్తలు వ్యతిరేక నినాదాలు చేశారు.

ఆమె మరో పోలింగ్‌ కేంద్రానికి వెళ్లగా అక్కడ కూడా స్థానిక మహిళలు అడ్డుకోవడంతో భారతి కంటతడి పెట్టారు. భారతి వాహనంపైనా కొందరు దాడికి పాల్పడ్డారు. టీఎంసీ కార్యకర్తలే దాడి చేశారని భాజపా కార్యకర్తలు ఆరోపించారు. పోలింగ్‌కు కొన్ని గంటల ముందు భాజపాకు చెందిన బూత్‌ కన్వీనర్‌ హత్యకు గురయ్యాడు. ఝార్గామ్‌ జిల్లాలోని గోపీబల్లాబ్‌పూర్‌లో శనివారం అర్ధరాత్రి తీవ్రగాయాలతో ఉన్న అతని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అతన్ని రమణ్‌సింగ్‌గా పోలీసులు గుర్తించి ఘటనపై విచారణ చేపట్టారు. ఈ ఘటనపై భాజపా జాతీయ కార్యదర్శి కైలేష్‌ విజయ్‌వర్గీయా మండిపడ్డారు.

తృణమూల్‌ కార్యకర్తలే రమణ్‌సింగ్‌ను హతమార్చారని ఆరోపించారు. భాజపా కార్యకర్త ఇంట్లోకి టీఎంసీ కార్యకర్తలు చొరబడి దారుణంగా హత్య చేశారని, భాజపా బూత్‌ కన్వీనర్‌ అయినందునే ఈ ఘటనకు పాల్పడ్డారని పేర్కొన్నారు. మరో ఘటనలో తూర్పు మిడ్నాపూర్‌లోని భగబన్‌పూర్‌లో ఇద్దరు భాజపా కార్యకర్తలపై దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో గాయపడ్డ ఆ ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య రాష్ట్రంలోని 8 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ఆరో విడత పోలింగ్‌ కొనసాగింది. మరోవైపు, ఉత్తర్‌ప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కేంద్ర మంత్రి, భాజపా నేత మేనకా గాంధీ, బీఎస్పీ అభ్యర్థి చంద్ర భద్ర సింగ్‌ (సోను)కి మధ్య ఓ పోలింగ్‌ కేంద్రం వద్ద చిన్నపాటి గొడవ చెలరేగింది. సోను మద్దతుదారులు ఓటర్లను బెదిరిస్తున్నారని మేనక ఆరోపించారు. ఇద్దరు నేతలు పరస్పరం చూపుడు వేలు చూపెడుతూ వాదనలకు దిగారు.

రౌడీల్లా వ్యవహరించడం వల్ల ఓట్లు పొందలేరని ఆమె అనగా, తాను ఎటువంటి తప్పు చేయట్లేదని సోను సమాధానం ఇచ్చారు. బీఎస్పీ మద్దతు దారులు తమ నేతకు అనుకూలంగా నినాదాలు చేశారు. ‘‘పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించడానికి మేము ఇక్కడకు వచ్చాము. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఎటువంటి నేరపూరిత చర్యలు జరగకుండా జాగ్రత్త పడుతున్నాం. జైలు నుంచి తప్పించుకుని వచ్చిన వ్యక్తి ఒకరు సోను సింగ్‌తో ఉన్నారు. వీరంతా ఓటర్లను భయపెడుతున్నారు.. ప్రజలపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ తీరు సరైంది కాదు. శాంతి, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు వేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది’’ అని మేనకా గాంధీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కాగా, భాజపా నేతల తీరే సరైన విధంగా లేదని సోను మీడియాకు తెలిపారు. ‘‘భాజపా నేతలు గత రాత్రి డబ్బు పంచుతుంటే అడ్డుకున్నందుకు మా కార్యకర్తలను కొట్టారు.

ఈసీకి ఫిర్యాదు చేస్తాను’’ అని తెలిపారు. కాగా, ఉత్తర్‌ప్రదేశ్‌లో జరుగుతున్న ఆరో విడత సార్వత్రిక పోలింగ్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జౌన్‌పూర్‌లోని శాహ్‌గంజ్‌ పోలింగ్‌ కేంద్రం సమీపంలో ఓ యువకుడు భాజపా జెండాతో తన బూట్లు తుడుచుకున్నాడు. దీనిని చూసిన భాజపా కార్యకర్త అతడి దగ్గరకు వెళ్లి తీవ్ర పదజాలంతో దూషించాడు. ఇద్దరి మధ్యా ఘర్షణ జరిగింది. అంతలో అక్కడికి చేరుకున్న పార్టీ కార్యకర్తలు ఆ యువకుడిని చితక్కొట్టారు. అదే సమయంలో యువకుడి తరఫు వారు కూడా అక్కడికి చేరుకోవడంతో ఇరువర్గాల మధ్య కొట్లాట జరిగింది. విషయం తెలుసుకున్ప పోలీసులు లాఠీ ఛార్జీ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అయితే ఈ సంఘటన వల్ల పోలింగ్‌ ప్రక్రియకు ఎలాంటి అవాంతరం ఏర్పడలేదని అధికారులు తెలిపారు. పశ్చిమ బెంగాల్ ఘటాల్‌ లోక్‌సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి భారతీఘోష్‌పై తృణమూల్‌ కాంగ్రెస్‌ మహిళా కార్యకర్తలు దాడికి యత్నించారు.

నియోజకవర్గంలోని ఓ పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలించేందుకు వెళ్లిన భారతిని చుట్టుముట్టిన టీఎంసీ కార్యకర్తలు వ్యతిరేక నినాదాలు చేశారు. ఆమె మరో పోలింగ్‌ కేంద్రానికి వెళ్లగా అక్కడ కూడా స్థానిక మహిళలు అడ్డుకోవడంతో భారతి కంటతడి పెట్టారు. భారతి వాహనంపైనా కొందరు దాడికి పాల్పడ్డారు. టీఎంసీ కార్యకర్తలే దాడి చేశారని భాజపా కార్యకర్తలు ఆరోపించారు. మరోవైపు, పోలింగ్‌ కేంద్రంలోకి మొబైల్‌ ఫోన్‌తో ప్రవేశించి వీడియో తీశారన్న ఆరోపణలపై ఎన్నికల సంఘం ఆమెను వివరణ కోరింది. దేశ వ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో ఆదివారం ఉదయం 7 గంటల నుంచి ఆరోవిడత పోలింగ్‌ కొనసాగింది. ఈ విడతలో పశ్చిమ్‌బంగాలోని 8 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరిగింది.

కాగా, ఏడు రాష్ట్రాల్లోని 59 నియోజకవర్గాల్లో ఆరో విడత పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగింది. పలువురు ప్రముఖులు పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీమిండియా క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కొహ్లీ, భాజపా భోపాల్‌ అభ్యర్థి ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌, మాజీ క్రికెటర్‌, ఢిల్లీ తూర్పు నియోజకవర్గం భాజపా అభ్యర్థి గౌతమ్‌ గంభీర్‌ ఉదయాన్నే పోలింగ్‌ కేంద్రానికి ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ విడతలో కేంద్ర మంత్రులు రాధామోహన్‌సింగ్‌, హర్షవర్ధన్‌, మేనకాగాంధీ, నరేంద్రసింగ్‌ తోమర్‌, రావు ఇంద్రిజిత్‌సింగ్‌, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్‌యాదవ్‌, కాంగ్రెస్‌నేత దిగ్విజయ్‌సింగ్‌, భూపీందర్‌సింగ్‌ హుడా, జ్యోతిరాదిత్య సింధియా, షీలాదీక్షిత్‌, బాక్సింగ్‌ క్రీడాకారుడు విజేందర్‌సింగ్‌, మాజీ క్రికెటర్‌, ఢిల్లీ తూర్పు భాజపా అభ్యర్థి గౌతమ్‌ గంభీర్‌ భవితవ్యంపై ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. కాగా, ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలింగ్‌ కేంద్రంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఢిల్లీలోని ఔరంగజేబ్‌ లేన్‌లోని ఎన్‌పీ సీనియర్‌ సెకండరీ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూత్‌లో ఓటు వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ ప్రచారంలో విద్వేషాన్నే ఆయుధంగా చేసుకున్నారని, కానీ అందుకు భిన్నంగా తాము మాత్రం ప్రేమతో ముందుకు సాగామని వ్యాఖ్యానించారు. చివరకు ద్వేషంపై ప్రేమే విజయం సాధిస్తుందని విశ్వసిస్తున్నామన్నారు. టీమిండియా కేప్టెన్‌ విరాట్‌ కొహ్లీ హరియాణా గుడ్‌గావ్‌లోని పైన్‌క్రెస్ట్‌ పాఠశాలలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆరో దశలో తొలుత ఓటేసిన వారిలో ఒకరిగా నిలిచి ప్రతిఒక్కరికీ ఆదర్శంగా నిలిచారు. భోపాల్‌ నుంచి బరిలో ఉన్న భాజపా అభ్యర్థి సాద్వి ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్‌ నగరంలోని ఓ పోలింగ్‌ బూత్‌లో ఓటు వేశారు. కాగా, ఈ స్థానంలో కాంగ్రెస్ తరఫున సీనియర్‌ నేత, మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్‌ పోటీలో ఉన్నారు. మాజీ క్రికెటర్‌, ఢిల్లీ తూర్పు భాజపా అభ్యర్థి గౌతమ్‌ గంభీర్‌ ఆయన సతీమణితో కలిసి ఓల్డ్‌ రాజేంద్రనగర్‌లోని పోలింగ్ కేంద్రంలో ఓటేశారు.

ఈయనకు పోటీగా ఆప్‌ తరఫున అతిషీ, కాంగ్రెస్ నుంచి అర్విందర్‌ సింగ్‌ బరిలో ఉన్న విషయం తెలిసిందే. ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా ఆయన సతీమణి సీమాతో కలిసి పాండవ్‌ నగర్‌లోని పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్‌ నాయకురాలు షీలా దీక్షిత్‌ నిజాముద్దీన్‌ ఈస్ట్‌లోని పోలింగ్‌ బూత్‌లో ఓటేశారు. ఈసారి ఎన్నికల్లో ఆమె ఢిల్లీ ఈశాన్యం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన విషయం తెలిసిందే. హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ రాష్ట్రంలోని కర్నాల్‌ పట్టణంలో ఏర్పాటు చేసిన ఓ పోలింగ్‌ బూత్‌లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.