వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు సినిమాలే!

41

చెన్నై, మే 12 (న్యూస్‌టైమ్): సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఈ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తారని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూశారు. కానీ తాను పోటీ చేయడంలేదని స్పష్టం చేయడంతో నిరాశచెందారు. అయితే తమిళనాడులో శాసనసభ ఎన్నికలు ఎప్పుడు జరిగినా పోటీకి సిద్ధమని ఒకానొక సందర్భంలో ప్రకటించారు. 2021లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానని తాజాగా రజనీ మీడియా ప్రతినిధుల ద్వారా వెల్లడించారు.

అయితే అప్పటివరకు సినిమాలు చేస్తూనే ఉంటానని తెలిపారు. ప్రస్తుతం రజనీ ‘దర్బార్‌’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఏ.ఆర్ మురుగదాస్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తున్నారు. 2020 సంక్రాంతికి సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రెండేళ్ల క్రితం రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించినప్పటికీ ఇంత వరకు రజనీ పార్టీ పేరును ప్రకటించలేదు. పార్టీ పెట్టడమనేది చిన్న విషయం కాదని అందుకు సమయం పడుతుందని అన్నారు.