అమెరికాలో ‘మహర్షి’ రికార్డుస్థాయి కలెక్షన్లు!

41

హైదరాబాద్, మే 12 (న్యూస్‌టైమ్): ప్రిన్స్ మహేష్‌బాబు అల్లరి నరేష్‌తో కలిసి సందడి చేసిన ‘మహర్షి’ చిత్రం అమెరికా బాక్సాఫీసును షేక్ చేస్తోంది. అద్భుతమైన వసూళ్లతో ఈ సినిమా యూఎస్ థియేటర్లలో దూసుకుపోతోంది. ‘మహర్షి’ అక్కడ మిలియన్‌ డాలర్ల మార్క్‌ను దాటినట్లు సినీ విశ్లేషకులు పేర్కొన్నారు.

ఇండియాలో గురువారం విడుదల అయిన ఈ చిత్రం ఒక రోజు ముందు అంటే బుధవారమే అమెరికాలో విడుదల అయింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రీమియర్‌ షోలో 516,441 డాలర్లు (232 లొకేషన్లలో), మొదటి రోజున (గురువారం) 176,657 డాలర్లు (225 లొకేషన్లలో), రెండో రోజు (శుక్రవారం) 232,325 డాలర్లు (224 లొకేషన్లలో), మూడో రోజు (శనివారం) 78,372 డాలర్లు (120 లొకేషన్లలో) మొత్తం 1,003,795 డాలర్లు రాబట్టినట్లు అంచనా వేశారు. ఇది మహేశ్‌ తొమ్మిదో మిలియన్‌ డాలర్ల చిత్రమని పేర్కొన్నారు. ‘మహర్షి’ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు.

మహేశ్‌ స్నేహితుడిగా అల్లరి నరేష్‌ ఈ చిత్రంలో అలరించారు. పూజా హెగ్డే కథానాయిక. మీనాక్షి దీక్షిత్‌, సోనాల్‌ చౌహాన్‌, జగపతిబాబు, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్‌, ప్రకాశ్‌ రాజ్‌, పోసాని కృష్ణమురళీ, రావు రమేశ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాను దిల్‌రాజు, అశ్వినీ దత్‌, ప్రసాద్‌ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మించారు. మే 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల సహా దక్షిణ భారత దేశవ్యాప్తంగా మంచి స్పందన లభించింది. మహేశ్‌ మరోసారి మంచి సందేశం అందించారంటూ నెటిజన్లు, పలువురు ప్రముఖులు ట్వీట్లు చేశారు.