ఆసక్తిదాయకంగా మారిన ఆరో దశ పోలింగ్

67

న్యూఢిల్లీ, మే 12 (న్యూస్‌టైమ్): మొత్తానికి దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరంలో తుది అంకానికి చేరుకుంటోంది. ఏడు దశల ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే ఐదు దశలు పూర్తి కాగా ఆదివారం ఆరో విడత పోలింగ్‌ జరగనుంది. ఏడు రాష్ట్రాల్లోని 59 స్థానాలకు ఈసీ ఎన్నికలు నిర్వహిస్తోంది. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌ నుంచి 14, హరియాణా 10, బిహార్‌ 8, మధ్యప్రదేశ్‌ 8, పశ్చిమబెంగాల్‌ 8, ఢిల్లీ 7, ఝార్ఖండ్‌‌లోని 4 స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ముఖ్యంగా ఈ దశలో ముఖ్యనేతలతో పాటు పలువురు సినీ, క్రీడారంగానికి చెందిన ప్రముఖులు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

దీంతోపాటు చాలా స్థానాల్లో పోటీ రసవత్తరంగా సాగనుంది. ప్రధాన పోరు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్‌ మధ్యే అయినప్పటికీ ఉత్తరప్రదేశ్‌లో మాత్రం బీజేపీ, బీఎస్పీ-ఎస్పీ-ఆర్‌ఎల్డీ కూటమి మధ్య జరుగుతోంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆజమ్‌గఢ్‌ నియోజకవర్గం నుంచి సమాజ్‌వాదీ (ఎస్పీ) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి అఖిలేశ్‌ తండ్రి, ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ గెలుపొందారు. ఈసారి ఆయన మెయిన్‌పురి నుంచి బరిలో ఉండటంతో అఖిలేశ్‌ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. అఖిలేశ్‌కు పోటీగా భోజ్‌పురి చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు దినేశ్‌లాల్‌ యాదవ్‌(నిరుహువా)ను భాజపా రంగంలోకి దింపింది. ఈ ఏడాది మార్చిలోనే భాజపాలో చేరిన ఆయనకు ఆ పార్టీ అధినాయకత్వం అఖిలేశ్‌పై పోటీకి నిలబెట్టింది.

యూపీలో బలంగా ఉండే ఎస్పీ అధినేతపై సినీనటుడు పోటీ చేయడంతో ఆ నియోజకవర్గంలో ఓటర్లు ఎవరికి పట్టం కడతారనే ఆసక్తి నెలకొంది. పొత్తులో భాగంగా బీఎస్పీ, ఆర్‌ఎల్డీ అఖిలేశ్‌కు మద్దతు పలుకుతున్నాయి. అలాగే, మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో కూడా పోటీ రసవత్తరంగా మారింది. కాంగ్రెస్‌ నుంచి సీనియర్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్‌ సింగ్‌ బరిలో ఉండగా భాజపా తమ అభ్యర్థిగా సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌ను నిలబెట్టింది. మాలేగావ్‌ పేలుళ్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ప్రజ్ఞాసింగ్‌ గత నెలలోనే భాజపాలో చేరారు. పార్టీలో చేరిన కొద్ది గంటల్లోనే ఆమెకు భోపాల్‌ టికెట్‌ను కేటాయిస్తూ పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకొంది. మరోవైపు, ద్విగ్విజయ్‌ పోటీపై కాంగ్రెస్‌ వర్గాల్లో కొద్దిరోజులు చర్చ జరిగింది. ఆయన్ను ఎక్కడి నుంచి బరిలోకి దించాలనే అంశంలో సీనియర్లు తమ అభిప్రాయాలను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారు. దిగ్విజయ్‌ భోపాల్‌, ఇండోర్‌, విదిశ నియోజకవర్గాల్లో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేస్తే బావుంటుందని మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ సూచించారు.

ఎక్కడి నుంచైనా పోటీకి తాను సిద్ధమేనని, అయితే ఈ విషయంలో తుది నిర్ణయం మాత్రం పార్టీ అధ్యక్షుడు రాహుల్‌దేనని దిగ్విజయ్‌ స్పష్టం చేశారు. దీంతో చివరకు భోపాల్‌ నుంచే పోటీకి దించాలని నిర్ణయించారు. మరోవైపు, 1984 తర్వాత భోపాల్‌లో కాంగ్రెస్‌ గెలవలేదు. అంతకుముందు కాంగ్రెస్‌ నుంచి శంకర్‌ దయాళ్‌ శర్మ, కేఎన్‌ ప్రధాన్‌ వంటి వారు మాత్రమే ఇక్కడి నుంచి గెలుపొందారు.

గత ఎన్నికల్లో భాజపా అభ్యర్థి అలోక్‌ సంజార్‌ విజయం సాధించారు. సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న ఆయన స్థానంలో భాజపా ఈసారి ప్రజ్ఞా ఠాకూర్‌ను దింపింది. ఈసారి కూడా భాజపా అభ్యర్థి ప్రజ్ఞా ఠాకూర్‌కే అనుకూలంగా ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. యూపీలోని సుల్తాన్‌పూర్‌ నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి మేనకాగాంధీ బరిలో దిగారు. మేనక తనయుడు, ఎంపీ వరుణ్‌గాంధీ గత ఎన్నికల్లో సుల్తాన్‌పూర్‌ నుంచి మేనక ఫిలిబీత్‌ నుంచి గెలుపొందారు. ఈసారి తల్లీకొడుకులిద్దరూ నియోజకవర్గాలను మార్చుకున్నారు. గోమతి నదీతీరంలో ఉన్న పూర్తి వ్యవసాయాధారిత ప్రాంతం సుల్తాన్‌పూర్‌.

ఇక్కడ 14లక్షల పైచిలుకు ఓటర్లు ఉన్నారు. ఫిలిబీత్‌ను అభివృద్ధి చేసినట్లే సుల్తాన్‌పూర్‌ను కూడా తాను అభివృద్ధి చేస్తానని మేనక చెబుతున్నారు. ఇక్కడ కాంగ్రెస్‌ నుంచి మాజీ ఎంపీ సంజయ్‌ సింగ్‌, బీఎస్పీ తరఫున చంద్రభద్ర సింగ్‌ పోటీ చేస్తున్నారు. ఎస్పీ-బీఎస్పీ-ఆర్‌ఎల్డీ పొత్తు తమకు సమస్యే కాదని మేనక ధీమా వ్యక్తంచేస్తున్నారు. ఇక, దేశ రాజధాని ఢిల్లీపై అందరి దృష్టీ కేంద్రీకృతమైంది. ఇక్కడ అధికార ఆమ్ ఆద్మీ పార్టీ గాలివీస్తుందా? లేక బీజేపీకి, లేదా కాంగ్రెస్‌కు ఓటర్లు పట్టం కట్టనున్నారా? అన్నది అంతుచిక్కడం లేదు. తూర్పు ఢిల్లీ నియోజకవర్గంలో త్రిముఖ పోరు నెలకొంది. భాజపా తమ అభ్యర్థిగా టీమిండియా మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ను బరిలోకి దించింది.

ఇటీవల భాజపాలో చేరిన ఆయనకు ఆ పార్టీ అధినాయకత్వం వెంటనే టికెట్‌ను ఖరారు చేసింది. తొలిసారిగా ఎన్నికల్లో పోటీచేస్తున్న గంభీర్‌కు ఆమ్‌ ఆద్మీతో పాటు కాంగ్రెస్‌ పార్టీ గట్టి పోటీ ఇస్తున్నాయి. ఆప్‌ అభ్యర్థిగా ఆతిషి మర్లేనా, కాంగ్రెస్‌ నుంచి అర్విందర్‌ సింగ్‌ లవ్లీ పోటీ చేస్తున్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధే తనను గెలిపిస్తుందని గంభీర్‌ భావిస్తున్నారు. మరోవైపు, ఆప్‌ అభ్యర్థి ఆతిషి ఏడాది క్రితం వరకు ఢిల్లీ మంత్రి మనీశ్‌ సిసోడియాకు సలహాదారుగా పనిచేశారు. 2015లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ మేనిఫెస్టో రూపకల్పనలో ఆమె క్రియాశీలకంగా వ్యవహరించారు.

కాంగ్రెస్‌ అభ్యర్థి అర్విందర్‌ సింగ్‌ లవ్లీ సీనియర్‌ రాజకీయవేత్త. కాంగ్రెస్‌ నుంచి ఆయన నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాగా, మాజీ క్రికెటర్‌ కీర్తి ఆజాద్‌ ఈసారి ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో బిహార్‌లోని దర్బాంగా నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2015లో ఢిల్లీ క్రికెట్‌ బోర్డు అంశంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై భాజపా కీర్తి ఆజాద్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది.

దీంతో గతేడాది ఆయన కాంగ్రెస్‌లో చేరారు. భాజపా నుంచి సిట్టింగ్‌ ఎంపీ పసుపతినాథ్‌ సింగ్‌ మరోసారి బరిలో దిగారు. ఢిల్లీ నగర పరిధిలోని కీలక నియోజకవర్గం ఈశాన్య ఢిల్లీ. ఇక్కడి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి, సీనియర్‌ నేత షీలా దీక్షిత్‌ బరిలోకి దిగారు. తొలిసారిగా ఆమె లోక్‌సభకు పోటీ చేస్తున్నారు. తొలుత ఆమె చాందినీచౌక్‌ నుంచి పోటీ చేస్తారని భావించినా చివరికి కాంగ్రెస్‌ అధిష్ఠానం ఈశాన్య ఢిల్లీనే ఆమెకు ఖరారు చేసింది. భాజపా నుంచి సిట్టింగ్‌ ఎంపీ మనోజ్‌ తివారీ మరోసారి పోటీ చేస్తుండగా ఆప్‌ తరఫున దిలీప్‌ పాండే బరిలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో మూడు పార్టీలు బలంగా ఉన్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్‌- భాజపా మధ్యే జరగనుంది.

ఎక్కువకాలం ముఖ్యమంత్రిగా పనిచేయడం, సీనియర్‌ నేత కావడంతో షీలాదీక్షిత్‌ వైపు మొగ్గు ఉండే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక, న్యూఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గంలో ఆసక్తికర పోరు జరుగుతోంది. భాజపా అభ్యర్థి, సిట్టింగ్‌ ఎంపీ మీనాక్షి లేఖి, కాంగ్రెస్‌ నుంచి కేంద్ర మాజీ మంత్రి అజయ్‌ మాకెన్‌, ఆప్‌ అభ్యర్థిగా బ్రిజేష్‌ గోయల్‌ బరిలో ఉన్నారు. 2004, 2009 ఎన్నికల్లో మాకెన్‌ ఇక్కడి నుంచి విజయం సాధించగా గత ఎన్నికల్లో భాజపా అభ్యర్థి మీనాక్షి లేఖిపై ఆయన ఓటమి పాలయ్యారు. తాజా ఎన్నికల్లోనూ వీరిద్దరే ఆయా పార్టీల నుంచి మళ్లీ తలపడుతున్నారు.

ఆప్‌ పోటీలో ఉన్నప్పటికీ ప్రధాన పోరు మాత్రం కాంగ్రెస్‌, భాజపా మధ్యే జరుగుతోంది. మరోవైపు ఆ రెండు పార్టీ అభ్యర్థులు తనకు పోటీయే కాదని ఆప్‌ అభ్యర్థి బ్రిజేష్‌ గోయల్‌ ధీమా ఉన్నారు. యూపీఏ హయాంలో స్థానికంగా జరిగిన అభివృద్ధి తనను గెలిపిస్తుందని మాకెన్‌ భావిస్తుండగా మోదీ ప్రభావంతో భాజపా గెలుపొందనుందని మీనాక్షిలేఖి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. హరియాణాలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ సీఎం భూపేందర్‌సింగ్‌ హుడా, అతని కుమారుడు దీపేందర్‌ సింగ్‌ హుడాకు ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. భూపేందర్‌ సోనిపత్‌ నుంచి బరిలో ఉండగా దీపేందర్ రోహ్‌తక్‌ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. భూపేందర్‌ ఇప్పటికే నాలుగుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు.

వాస్తవానికి ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయనకు ఆసక్తి లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు సీనియర్‌ నేతలను బరిలో దింపాలని ఆ పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. ఈ క్రమంలోనే జాట్ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న సోనిపత్‌ స్థానంలో భూపేందర్‌ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. భూపేందర్‌ను ఐఎన్‌ఎల్‌డీ అధినేత ఓం ప్రకాశ్‌ చౌతాలా మనవడు, జననాయక్‌ జనతా పార్టీ(జేజేపీ) నేత దిగ్విజయ్‌ చౌతాలా ఢీ కొడుతున్నారు. భాజపా తరఫున సిట్టింగ్‌ ఎంపీ రమేశ్‌ చంద్ర కౌశిక్‌ బరిలో ఉన్నారు. దీంతో సోనిపత్‌లో త్రిముఖ పోరు నెలకొంది.

మరోవైపు, రోహ్‌తక్‌లో భూపేందర్‌ తనయుడు, సిట్టింగ్‌ ఎంపీ దీపేందర్‌ హుడా రెండోసారి బరిలోకి దిగారు. భాజపా నుంచి అర్వింద్‌ శర్మ, జేజేపీ తరఫున ప్రదీప్‌ దేశ్వాల్‌ పోటీ చేస్తున్నారు. 2014లో భాజపా అభ్యర్థి ఓపీ ధన్‌కర్‌పై లక్షా 70వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంతో దీపేందర్‌ విజయం సాధించారు. ఈ ఐదేళ్లలో చేసిన అభివృద్ధే తనను గెలిపిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. భూపేందర్‌, దీపేందర్‌ ఇద్దరూ రోహ్‌తక్‌ అభివృద్ధిపైనే దృష్టిసారించి రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలను విస్మరించారని భాజపా ఆరోపిస్తోంది. అలాగే, హరియాణాలో మరో ఆసక్తికర పోరుకు హిస్సార్‌ వేదికైంది.

ముగ్గురు ఉద్దండుల వారసులు ఇక్కడ పోటీ పడుతున్నారు. ఓం ప్రకాశ్‌ చౌతాలా మరో మనవడు, జన నాయక్‌ జనతాపార్టీ (జేజేపీ) అధ్యక్షుడు దుష్యంత్‌ చౌతాలా పోటీ చేస్తున్నారు. అప్పటి జాట్‌ నేత చోటు రామ్‌ ముని మనవడు బ్రిజేంద్ర సింగ్‌ భాజపా అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఐఏఎస్‌గా ఉన్న ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. ఇక కాంగ్రెస్‌ నుంచి బరిలోకి దిగిన భవ్య బిష్ణోయ్‌ మాజీ సీఎం భజన్‌లాల్‌ మనవడు. ఐఎన్‌ఎల్‌డీ అధ్యక్షుడు ఓం ప్రకాశ్‌ చౌతాలా కుమారుడు అజయ్‌ చౌతాలా కుమారుడే దుష్యంత్‌. ఆయన ఐఎన్‌ఎల్‌డీని వీడి తండ్రితో కలిసి జేజేపీని స్థాపించారు.

దుష్యంత్‌ హిస్సార్‌ సిట్టింగ్‌ ఎంపీ. ఈ నేపథ్యంలో ముగ్గురి మధ్య హోరా హోరీ పోరు జరిగే అవకాశముంది. మొత్తానికి అనుకున్నట్లే ఆరో విడత ఎన్నికలు ఆసక్తికరంగానే సాగనున్నాయని చెప్పాలి. పోలింగ్ సందర్భంగా సమస్యాత్మక కేంద్రాల వద్ద అదనపు బలగాలను మోహరించారు. ఇప్పటికే ఈవీఎంలను, వీవీప్యాట్లను పంపిణీ చేసిన ఎన్నికల అధికారులు వాటితో ఆదివారం ఉదయం ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. అనంతరం సాధారణ పోలింగ్ ప్రారంభంకానుంది.