అగ్నిగుండంలా మారిన రాష్ట్రం

38

అమరావతి, మే 11 (న్యూస్‌టైమ్): వాతావరణంలో చోటుచేసుకున్న అనూహ్య మార్పుల నేపథ్యంలో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ గణనీయంగా పెరిగిపోతున్నాయి. వాయువ్య భారత్ నుంచి మధ్యప్రదేశ్, విదర్భ, తెలంగాణ మీదుగా వీస్తున్న వేడిగాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరిపోతున్నట్లు భారత వాతావరణ పరిశోధన సంస్థ (ఐఎండీ) తెలిపింది. ఉభయగోదావరి, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో రెండు మూడు రోజులు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సగటున 45 నుంచి 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశలున్నాయని వెల్లడించింది.

మరోవైపు, వేడిగాలుల తీవ్రత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఉదయం నుంచే వేడిగాలులు వీస్తుండటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో చాలా చోట్ల కర్నూలు, పశ్చిమ గోదావరి, కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో 45 డిగ్రీల నుంచి 47 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. చిన్నారులు, వృద్ధులు వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

రాగల రెండు మూడు రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లోనూ చాలా చోట్ల 45 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు రికార్డు అవుతాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర కోస్తాంధ్రలోని కొన్ని చోట్ల మాత్రం సగటు ఉష్ణోగ్రతలు 30 నుంచి 34 డిగ్రీల మధ్య నమోదవుతున్నట్లు స్పష్టం చేసింది. ఏపీ రియల్ టైమ్ గవర్నెన్సు సొసైటీ (ఆర్టీజీఎస్) అంచనా వేసిన విధంగానే రాష్ట్రంలో శుక్రవారం మూడుచోట్ల పగటి ఉష్ణోగ్రత 46 డిగ్రీల సెల్సియస్ దాటింది. రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రత 46.47 డిగ్రీలు ప్రకాశం జిల్లా కురిచేడులో నమోదైంది. గుంటూరు జిల్లా పెదకూరపాడులో 46.37, నెల్లూరు జిల్లా మన్నాపోలూరులో 46.04, కృష్ణా జిల్లా పమిడిముక్కలలో 46 డిగ్రీలు నమోదైంది.

45 నుంచి 45.9 డిగ్రీల మధ్య 33 చోట్ల, 44 నుంచి 44.9 డిగ్రీల మధ్య 62 ప్రాంతాల్లో, 43-43.9 డిగ్రీల మధ్య 116 ప్రాంతాల్లో, 42-42.9 డిగ్రీలు 133 ప్రాంతాల్లో, 41-41.9 డిగ్రీల మధ్య 133 ప్రాంతాల్లో, 40 -40.9 డిగ్రీల మధ్య 142 ప్రాంతాల్లో నమోదు అయింది. కాగా, శనివారం కూడా రాష్ట్రంలో చాలా చోట్ల 45 నుంచి 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని ఆర్టీజీఎస్ హెచ్చరించింది. ఉభయ గోదావరి జిల్లాల నుంచి నెల్లూరు జిల్లాల పరిధిలో ఎక్కువ ఎండలు కాస్తాయని తెలిపింది. రాయలసీమ జిల్లాల్లోనూ కొన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉంటుందని తెలిపింది. వడగాల్పులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. రాష్ట్రం నిప్పుల కొలిమిలా మండుతోంది.

గత కొద్ది రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మించి పోతున్నాయి. పగటి పూట నిప్పుల వర్షం కురుస్తోందా అన్నట్టు వడగాల్పులు ఎదుర్కొంటున్నారు. ఉదయం నుంచి భానుడి ప్రతాపంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. మరో రెండు రోజుల పాటు కోస్తాలో వడగాల్పులు తప్పవని విశాఖ వాతారణ కేంద్రం అధికారులు బుధవారం రాత్రి ప్రకటించారు. దక్షిణ కోస్తాలో అతితీవ్ర వడగాల్పులు ఉంటాయని పేర్కొన్నారు. ముఖ్యంగా పలు పట్టణాల్లో సాధారణం కంటే 5 నుంచి 7 డిగ్రీల మేర అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవతాయని తెలిపారు. మరో రెండు రోజులు ఇదే పరిస్థితులు నెలకొనున్న నేపథ్యంలో ప్రజానీకం జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

కాగా, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉదయం 8 గంటల నుంచే వేడి గాలులతో కూడిన ఎండలు మండిపోతున్నాయి. కాలు బయట పెట్టాలంటేనే ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు. జిల్లాలో 44 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుంది. గత ఐదు రోజుల నుంచి 3 నుంచి 4 డిగ్రీలు వాస్తవ తీవ్రత ఉంటుందని వాతావరణశాఖ నిపుణులు వెల్లడిస్తున్నారు. ఎండల తీవ్రతకు రొడ్ల పక్కన ఉండే చిరు వ్యాపారులు, కూలి పనులు చేసేవారు, రైతులు ఎండతీవ్రతను తట్టుకోలేకపోతున్నారు. వేడిగాలులు రాత్రి 9 గంటల వరకు ఏ మాత్రం తగ్గడంలేదు. రోడ్డు మీదకు వస్తే, పెద్ద నిప్పల గుండం పక్క నుంచి వెళ్తునట్టుగా ఉంటోంది. ఎట్టి పరిస్దితిల్లోను ఉదయం 9నుంచి సాయంత్రం 5లోపు పిల్లలు, వృద్దులు బయటకు రావోద్దని అధికారులు సూచిస్తున్నారు. ఉష్ణ తాపానికి జనం విలవిల్లాడుతున్నారు.

మధ్యాహ్నం పన్నెండు గంటలకు రొడ్లు నిర్మానుష్యంగా కనిపించాయి. అత్యవసర పనులపై బయటకు వచ్చేవారిలో మహిళలు చీర చెంగులు, చున్నీల చెంగులు కప్పకున్నారు. ఇప్పడే పరిస్దితులు ఇలా ఉంటే మున్ముందు అగ్ని కార్తెలు, రోహిణీ కార్తెలు ఎలా గడుస్తాయి దేవుడా అంటు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతూనే ఉంది. భానుడి ప్రతాపంతో జనం విలవిల్లాడుతున్నారు.

నల్లగొండలో అత్యధికంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఖమ్మంలో 44.8 డిగ్రీలు, హైదరాబాద్‌లో 42.2 డిగ్రీల ఉష్ణోగ్రత గరిష్ఠంగా రికార్డైంది. ఆదిలాబాద్‌లో 44.3, రామగుండం 44, నిజామాబాద్, మహబూబ్‌నగర్ 43.5, మెదక్ 42.6, హైదరాబాద్ 42.1, హన్మకొండలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉత్తర తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో మరో మూడు రోజుల వరకు వడగాలులు వీచే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు 46.5 నుంచి 47 డిగ్రీలకు చేరుకోవచ్చని హెచ్చరిస్తున్నారు. ఉదయం పది గంటల నుంచే భానుడు ప్రతాపం చూపుతుండటంతో ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టాలంటేనే ఒకటికి రెండుసార్లు అలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాయంత్రం ఆరు గంటల వరకు ఎండ తీవ్రత తగ్గకపోవడంతో పాటు ఉక్కపోత చెమటతో ప్రజలు సతమతమవుతున్నారు. ముఖ్యంగా రోగులు, వృద్ధులు, చిన్నారులు ఎండలకు తట్టుకోలేక అల్లాడిపోతున్నారు. ఠారెత్తిస్తున్న ఎండ, వడగాడ్పుల ధాటికి మధ్యాహ్న సమయంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. అటు వడదెబ్బకు రాష్ట్రవ్యాప్తంగా నలుగురు మృతి చెందారు.