ఏపీఎస్ ఆర్టీసీలో సమ్మె తప్పదా?

42

విజయవాడ, మే 11 (న్యూస్‌టైమ్): ఏపీఎస్ఆర్టీసీలో మరోసారి సమ్మె సైరన్ మోగింది. వేతన బకాయిల చెల్లింపులు చేపట్టాలన్న ప్రధాన డిమాండ్‌తో ఆర్టీసీ యూనియన్లు వేర్వేరుగా యాజమాన్యానికి సమ్మె నోటీసులు అందజేశాయి. గత డిసెంబరులో ఇదే విధంగా సమ్మె నోటీసు అందజేసిన యూనియన్లు చర్చల తర్వాత సమ్మెను విరమించుకున్నాయి. ఈ సారి మాత్రం హామీలు నెరవేర్చకుంటే సమ్మె విరమించేది లేదని అన్ని యూనియన్లు స్పష్టం చేస్తున్నాయి. మొత్తానికి ఏపీలో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు మరోసారి సిద్ధమయ్యారనే సూచనలు కనిపిస్తున్నాయి. గత ఫిబ్రవరిలోనే సమ్మెకు సమాయత్తమైన కార్మిక సంఘాలు ప్రభుత్వ హామీలతో వెనక్కితగ్గాయి. ఈసారి మాత్రం తాడోపేడో తేల్చుకుంటామంటున్నారు కార్మిక సంఘాల నేతలు. ఇప్పటికే సమ్మె నోటీసు అందజేసిన సంఘాలు అన్ని డిపోల్లో ఆందోళనలకు పిలుపునిచ్చాయి.

కార్మికుల హక్కులను కాలరాసే విధంగా ఆర్టీసీ యాజమాన్యం వ్యవహరిస్తుందంటూ కార్మిక సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం వల్లే సమ్మెకు దిగాల్సి వచ్చిందని చెబుతున్నారు. ఎన్నికల కోడ్‌ను సాకుగా చూపించి సమస్యలు పరిష్కరించకపోవడం సరికాదన్నారు. ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి రావాల్సిన 700 కోట్లు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే సమ్మెకు సంబంధించి కార్యాచరణను ఎంప్లాయిస్ జేఏసీ ప్రకటించింది. మే 23 వరకూ వివిధ రూపాల్లో నిరసనలు చేపట్టబోతోంది. ఈ నెల 17, 18 తేదీల్లో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరవుతారని, 22న రాష్ట్రంలోని అన్ని రీజినల్ మేనేజర్ కార్యాలయాల వద్ద జేఏసీ ఆధ్వర్యంలో మహా ధర్నాలు చేపట్టి, అదే రోజు సమ్మె తేదీని ప్రకటిస్తామని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు.

అయితే, కార్మిక సంఘాల సమ్మె నోటీసుపై ఆర్టీసీ యాజమాన్యం స్పందించింది. సమ్మె గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం నుంచి బడ్జెట్ రానందునే ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయామని ఆర్టీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, సీనియర్ ఐపీఎస్ అధికారి సురేంద్రబాబు చెప్పారు. ఆర్టీసీకి రావాల్సిన బకాయిలు, ఆర్టీసీ చెల్లించాల్సిన బకాయిలు, ఇతర అంశాలపై కార్మిక సంఘాలతో చర్చించామని, మరోసారి చర్చిస్తామని ఎండీ సురేంద్రబాబు చెప్పారు.

మొత్తానికి ఆర్టీసీ నష్టాల్లో ఉందన్న విషయాన్ని అర్ధం చేసుకోమని యాజమాన్యం చెబుతుంటే ఇస్తామన్న హామీలే నెరవేర్చాలంటున్నామని, కొత్త డిమాండ్లు అడగడం లేదని కార్మిక సంఘాలు అంటున్నాయి. కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం స్పందిస్తుందా లేక బస్సుకు బ్రేకులు పడుతాయో వేచిచూడాలి.