టైగర్‌ జోన్‌ లక్ష్యం అదేనా?

102

ఆదిలాబాద్‌, మే 11 (న్యూస్‌టైమ్‌): గిరిజనుల బతుకుల్లో పెను జీవన విధ్వంసానికి కవ్వాల్‌ వేదికైంది. తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నా పట్టించుకోని గత పాలకులు గిరిపుత్రులనుండి అడవిని ఆక్రమించేందుకు ప్లాన్‌ చేశారు. అడవితో అంతులేని అనుబంధాన్ని పెనవేసుకున్న గిరిజనులను తరిమికొట్టేందుకే తయారయ్యారు. ఆదిలాబాద్‌ జిల్లాలోని కవ్వాల్‌ ప్రాంతాన్ని టైగర్‌ జోన్‌గా ప్రకటిస్తూ గతంలో జీవో నెంబర్‌ 27ను జారీ చేశారు.

ఏకంగా లక్షా12 వేల321 హెక్టార్లను.. ఉన్నాయో లేవో తెలియని పులులకే కేటాయించారు. ఇన్నేళ్ల కాలంలో పులులు గిరిజనులను ఏ మేరకు ఇబ్బంది పెట్టాయో పులులను గిరిజనులు ఏ మాత్రం హతమార్చారో తెలియదుకానీ పులుల సంరక్షణ పేరుతో సర్కారు పెద్దల తీరు ఆదివాసుల జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. పులి ముసుగులో తొలి దశలో 40 గ్రామాల ఆదివాసులకు, మలిదశలో మరో 220 గ్రామాల అడవిబిడ్డలను అడవితల్లికి దూరం చేస్తున్నారు. కవ్వాల్‌ ప్రాంతంలో పులులు లేవని అడవి బిడ్డలు ప్రాధేయపడ్డా.. అధికార యంత్రాంగం పట్టించుకో లేదు.

సర్వే చేసిన తర్వాత ఇప్పుడు అధికారులు మాటమార్చారు. పులి లేదని వారే చెబుతున్నారు. అయితే అప్పుడప్పుడు మాత్రం వచ్చి వెళ్తోందంటూ సీసీ కెమెరాల్లో చిరుతపులిని చూపి పెద్ద పులిగా చిత్రీకరిస్తున్నారు. గిరిజనులకు పునరావాసం సరిగా ఇవ్వని అధికారులు అడవిలో పెద్ద పులి ఉందో లేదో చూపడం లేదు. మొత్తంగా పులి పేరుతో గిరిపుత్రులను అడవి నుంచి దూరం చేసి వారి బతుకుల్లో చీకట్లు నింపారు.