రవిప్రకాష్‌కు మరోసారి నోటీసులు

46

హైదరాబాద్, మే 11 (న్యూస్‌టైమ్): టీవీ9 యాజమాన్యంలో తలెత్తిన వివాదాలపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. అలంద మీడియా డైరెక్టర్‌ కౌశిక్‌రావు ఫిర్యాదు మేరకు టీవీ9 సీఈవో రవిప్రకాశ్‌, ఫైనాన్స్‌ డైరెక్టర్‌ మూర్తి, సినీనటుడు శివాజీపై సైబరాబాద్‌ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. రెండు రోజుల కిందట రవిప్రకాశ్‌, శివాజీ, మూర్తి ఇళ్లతో పాటు టీవీ9 కార్యాలయంలో సోదాలు నిర్వహించిన పోలీసులు శుక్రవారం ఉదయం విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు కూడా జారీ చేశారు. అయితే, పోలీసుల ఆదేశాలతో టీవీ9 ఫైనాన్స్‌ డైరెక్టర్‌ మూర్తి ఒక్కరే శుక్రవారం మధ్యాహ్నం సైబర్‌ క్రైం పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. రవిప్రకాశ్‌, సినీనటుడు శివాజీ విచారణకు హాజరుకాలేదు. దీంతో వీరిద్దరికీ మరోసారి నోటీసులు జారీ చేయాలని సీసీఎస్‌ పోలీసులు నిర్ణయించారు.

సొంత లబ్ధి కోసం ఛానల్‌కు సంబంధించి నకిలీపత్రాలు సృష్టించారని, ఫోర్జరీ చేశారని గత నెల 24న కౌశిక్‌ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆయన ఫిర్యాదు ఆధారంగా సైబర్‌ క్రైం పోలీసులు మోసంతో పాటు ఐటీ చట్టం కింద రవిప్రకాశ్‌, శివాజీ, మూర్తిలపై కేసు నమోదు చేశారు. మరోవైపు, టీవీ9 కంపెనీ సెక్రటరీ దేవేంద్ర అగర్వాల్‌ను కూడా పోలీసులు ప్రశ్నించారు. కంపెనీ సెక్రటరీ సంతకాన్ని సీఈవో రవిప్రకాశ్‌ ఫోర్జరీ చేశారనే ఆరోపణల నేపథ్యంలో దేవేంద్ర అగర్వాల్‌ను సైబర్‌ క్రైమ్‌ పోలీసులు విచారించారు.