థియేటర్లలో ‘మహర్షి’ సందడి

6
Allari Naresh, Pooja Hegde, Mahesh Babu, in Maharshi Movie

హైదరాబాద్, మే 11 (న్యూస్‌టైమ్): ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ‘మహర్షి’ సినిమా మంచి టాక్‌తో థియేటర్లలో సందడి చేస్తోంది. గురువారం విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద విజయవంతంగా రాణిస్తున్నట్లు సినీ విశ్లేషకులు పేర్కొన్నారు. తొలిరోజున ఈ చిత్రం నైజాంలో రూ.6.38 కోట్లు, యూఏలో రూ2.88 కోట్లు, సీడెడ్‌లో రూ.2.89 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.3.2 కోట్లు, పశ్చిమ గోదావరిలో రూ.2.47 కోట్లు, కృష్ణలో రూ.1.39 కోట్లు, గుంటూరులో రూ.4.4 కోట్లు, నెల్లూరులో రూ.1 కోటి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో కలిపి రూ.24.6 కోట్లు (షేర్‌) రాబట్టినట్లు అంచనా వేశారు.

రెండో రోజు కూడా వసూళ్ల జోరు కొనసాగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు 25వ సినిమాగా ‘మహర్షి’ రూపొందింది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. పూజా హెగ్డే కథానాయిక. అల్లరి నరేష్‌ కీలక పాత్ర పోషించారు. దేవిశ్రీ ప్రసాద్‌ బాణీలు అందించారు. దిల్‌రాజు, ప్రసాద్‌ వి పొట్లూరి, అశ్వినీదత్‌ నిర్మాతలుగా వ్యవహరించారు. గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు విశేషమైన స్పందన లభించింది. మహేశ్‌ నటన, కథ, వంశీ టేకింగ్‌ అద్భుతంగా ఉన్నాయని చిత్ర బృందాన్ని ప్రముఖులతోపాటు నెటిజన్లు ప్రశంసించారు.

మరోవైపు, చూడటానికి అంతగా బాగోకపోయినా తనను నటుడిగా స్వీకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు నటుడు ‘అల్లరి’ నరేశ్‌. ఈ మధ్యకాలంలో నరేశ్ నటించిన సినిమాలు అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. అలాంటి సమయంలో ఆయన ‘మహర్షి’ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల మనసును దోచుకున్నారు. మహేశ్‌ బాబు, పూజా హెగ్డే పాత్రలు ఒక ఎత్తైతే, అల్లరి నరేశ్‌ నటించిన రవి పాత్ర మరో ఎత్తు. ఎందుకంటే నరేశ్‌ నటించిన తొలి చిత్రం ‘అల్లరి’లో కూడా ఆయన పాత్ర పేరు ‘రవి’నే.

ఈ నేపథ్యంలో నరేశ్‌ సోషల్‌మీడియా వేదికగా ఓ పోస్ట్‌ పెట్టారు. తనను ఆదరించిన అభిమానులకు మనసారా కృతజ్ఞతలు చెప్పుకొన్నారు. ‘‘17 ఏళ్ల క్రితం ఓ యువకుడు అందరిలాగే తన గమ్యాన్ని వెతుక్కుంటున్నాడు. చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోగలడో లేదో అన్న విషయం కూడా అతనికి తెలీదు. కానీ తన పట్టుబట్టి తన మనసు చెప్పిందే విన్నాడు. 2002 మే 10న ఆ యువకుడు ‘అల్లరి’ నరేశ్‌గా మరోసారి పుట్టాడు. ఆ చిత్రం ప్రేక్షకులు నన్ను స్వీకరించేలా చేసింది. అప్పట్లో అది చాలా అరుదు. చూడటానికి అంత అందంగా లేని నన్ను ప్రేక్షకులు ఆదరించినందుకు నేనెప్పుడూ రుణపడి ఉంటాను. ఇప్పుడు నేనెందుకు ఈ విషయాన్ని మీతో చెప్పుకొంటున్నాను? ఇండస్ట్రీలోకి వచ్చి 17 ఏళ్లు అయిన తర్వాత ఇలా ఎందుకు మాట్లాడుతున్నాను? అందుకు కారణం రవి (మహర్షిలో నరేశ్‌ పాత్ర పేరు). ‘అల్లరి’ సినిమాలో నా పేరు రవి, ఇప్పుడు ‘మహర్షి’లో నా పేరు కూడా అదే. ఈ 55 సినిమాల ప్రయాణం నా జీవితంలో ఎన్నో జ్ఞాపకాలను నింపింది. నన్ను ఇంతగా మెరుగుపరిచిన చిత్ర పరిశ్రమకు, నాపై నమ్మకం ఉంచిన నిర్మాతలు, దర్శకులు, టెక్నీషియన్లు, అభిమానులకు మీ నరేశ్‌ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకొంటున్నాడు’’ అని పేర్కొన్నారు.