కర్నూలు రోడ్డు ప్రమాదంలో 15 మంది మృతి

127

కర్నూలు, మే 11 (న్యూస్‌టైమ్): బెంగ‌ళూరు-హైద‌రాబాద్ జాతీయ ర‌హ‌దారిపై కర్నూలు సమీపాన శనివారం ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలోని వెల్తుర్ది క్రాస్ రోడ్డు వ‌ద్ద‌ ప్ర‌మాదం చోటుచేసుకుంది. వాల్వో బస్‌ తుఫాన్ వాహనం, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 15 మంది సంఘటనా స్థలంలోనే మృతిచెందగా మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మృతులు గద్వాల శాంతినగర్ వాసులుగా గుర్తించారు.

బైక్‌ను తప్పించబోయి వాల్వో బస్‌ను తుఫాన్ వాహనం ఢీకొట్ట‌డంతో ప్ర‌మాదం జ‌రిగింద‌ని స్థానికులు చెబుతున్నారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వైపు అతివేగంతో వెళ్తున్న ఎస్‌ఆర్‌ఎస్‌ ట్రావెల్స్‌కు చెందిన ఓ బస్సు గద్వాల వైపు వెళ్తున్న తుఫాన్‌ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో తుఫాను వాహనంలోని 15 మంది అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.

వెల్దుర్తిలోని ఓ మలుపు వద్ద ఎదురుగా వస్తోన్న ద్విచక్రవాహనాన్ని తప్పించే క్రమంలో డివైడర్‌ను దాటి అటువైపుగా వస్తోన్న తుఫాన్‌ వాహనాన్ని బస్సు బలంగా ఢీకొట్టింది. వాహనంలో 17 నుంచి 20 మందికి పైగా ఉన్నట్టు సమాచారం. 14 మంది అక్కడికక్కడే మృతిచెందగా మిగతా వారు వాహనంలో చిక్కుకుపోయారు. ఈ ప్రమాదంలో వాహనం నుజ్జునుజ్జవ్వడంతో వారిని బయటకు తీయడం ఇబ్బందిగా మారింది. తీవ్ర గాయాలతో ఉన్న నలుగురిని చికిత్స నిమిత్తం కర్నూలు సర్వజన ఆస్పత్రికి తరలించారు. మృతులంతా గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం రామవరం గ్రామస్థులుగా పోలీసులు గుర్తించారు.

ప్రమాదం తీవ్రత దృష్ట్యా వాహనంలో ఉన్నవారంతా మృతిచెంది ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కాగా, పెళ్లి చూపులకు వెళ్లి అనంతపురం వైపు నుంచి సొంత గ్రామానికి వస్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. వీరంతా ఒకే గ్రామానికి చెందినవారేనని, అందరూ సమీప బంధువులే. ఈ విషాదంతో ఎవరూ అక్కడ మాట్లాడలేని పరిస్థితి నెలకొంది. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని తెలుస్తోంది. ఆధార్‌ కార్డుల్లో వున్న సమాచారం ఆధారంగా మృతులంతా రామాపురం గ్రామస్థులుగా పోలీసులు తేల్చారు. వీరంతా కాసేపట్లోనే కర్నూలు దాటాల్సి ఉన్న సమయంలో ఈ ఘోరం జరిగింది.

బస్సులో వున్న వారిలో కొందరికి గాయాలైనట్టు పోలీసులు తెలిపారు. వారిలో ఎవరికీ ప్రాణాపాయం లేదని తెలుస్తోంది. ఎంతమందికి గాయాలయ్యాయనే విషయం తెలియాల్సి ఉంది. వెల్దుర్తి రోడ్డు ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు డీజీపీతో మాట్లాడి ఘటనపై విచారణ జరిపించాలని ఆదేశించారు. అలాగే, జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన పలువురు మృతి చెందడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

సంఘటనలో గాయపడి కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారికి అవసరమైన సాయం అందించాల్సిందిగా జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌ను సీఎం ఆదేశించారు. మరోవైపు, ప్రమాద ఘటనపై వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ప్రమాదంలో మృతులకు సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని జగన్‌ ఆకాంక్షించారు.