మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు న్యాయం: సీఎం

43

హైదరాబాద్, మే 11 (న్యూస్‌టైమ్): తెలంగాణలోని కీలకమైన నీటి ప్రాజెక్టుల్లో ఒకటైన ‘మల్లన్నసాగర్‌’ భూ సేకరణ తాజా పరిస్థితులపై రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు శనివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. భూ నిర్వాసితులకు సహాయ, పునరావాసంపై ఆయన అధికారులతో చర్చించారు. ప్రగతిభవన్‌లో ఏర్పాటుచేసిన సమీక్షలో సీఎం ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. నిర్వాసితులకు తగిన పరిహారం ఇవ్వాలని, సహాయ పునరావాస చర్యలు చేపట్టాలంటూ ఇటీవల రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో సీఎం ఈ అంశంపై మరోసారి సమీక్షించారు.

ఇప్పటికే యుద్ధప్రాతిపదికన పరిహార చెల్లింపు పనులు చేపట్టాలని, ఈ అంశంపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలంటూ సీఎం అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నెల 15న మల్లన్నసాగర్‌ నిర్వాసితులకు పరిహారం చెల్లింపు వ్యవహారం హైకోర్టులో విచారణకు రానున్న నేపథ్యంలో చెక్కుల పంపిణీ ప్రక్రియ ఎంతవరకు వచ్చిందో అధికారులతో సమీక్షిస్తున్నారు.

అయితే, నిర్వాసితులకు పరిహారం చెల్లింపు కోసం అధికారులు ఆయా గ్రామాల్లో శిబిరాలు ఏర్పాటుచేసి పరిహారం చెల్లింపును పూర్తిచేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు చెక్కుల పంపిణీ ప్రక్రియ ఎంతవరకు వచ్చింది? ఏయే గ్రామాల్లో ఎంతమంది నిర్వాసితులకు చెక్కులు పంపిణీ చేశారు? ఎంత మొత్తంలో పంపిణీ చేశారు? ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉన్నారా? తదితర అంశాలను సీఎం అధికారుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఈ సమీక్ష సమావేశంలో సీఎస్‌ డాక్టర్ ఎస్కే జోసీతో పాటు సోమేశ్‌కుమార్‌, స్మితా సబర్వాల్‌, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లా కలెక్టర్లు, ఆర్డీవోలు, పరిహారం పంపిణీని పూర్తిస్థాయిలో పర్యవేక్షించిన కొందరు అధికారులు పాల్గొన్నారు.

మల్లన్నసాగర్ రిజర్వాయర్ భూ నిర్వాసితుల పునరుపాధి, పునరావాస సాయం పంపిణీ కార్యక్రమం వందకు వంద శాతం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. నిర్వాసితులకు పరిహారం ఇచ్చే కార్యక్రమం చాలా వరకు పూర్తయిందని, మిగిలిన కొద్దిపాటి ప్రక్రియను కొద్ది రోజుల్లోనే పూర్తి చేసి, హైకోర్టుకు నివేదిక పంపాలని సీఎం సూచించారు. పరిహారం చెల్లింపు విషయంలో హైకోర్టు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే స్పందించి, సీనియర్ అధికారులతో మాట్లాడారు. నిర్వాసితులను అన్ని విధాలా ఆదుకునే విషయంలో ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో, అత్యంత మానవత్వంతో వ్యవహరిస్తున్న విషయాన్ని సీఎం గుర్తుచేశారు.

అయినప్పటికీ కోర్టులు తరచూ జోక్యం చేసుకునే పరిస్థితులు రావడం పట్ల ముఖ్యమంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నిర్వాసితులకు పరిహారం అందించే ప్రక్రియను వెంటనే ముగించే కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోషిని సీఎం కోరారు. పరిహారం పంపిణీ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో నిర్వహించే బాధ్యతలను సీఎంవో కార్యదర్శి స్మితా సభర్వాల్‌కు ముఖ్యమంత్రి అప్పగించారు. మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు పరిహారం పంపిణీ కార్యక్రమం చేపట్టేందుకు గ్రామాల వారీగా శిబిరాలు నిర్వహించాలని, ప్రత్యేక అధికారులను నియమించాలని కేసీఆర్ ఆదేశించారు.

‘‘లక్ష కోట్ల రూపాయల వ్యయంతో తెలంగాణలో 40 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరు అందివ్వడానికి అతి పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్నాం. అందులో భాగంగా 50 టిఎంసిల సామర్థ్యం కలిగిన మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మిస్తున్నాం. మల్లన్నసాగర్ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయ లాంటిది. ఇంత పెద్ద రిజర్వాయర్ నిర్మించే క్రమంలో కొద్ది మంది భూములు, ఇళ్లు కోల్పోతున్నారు. వారి విషయంలో ప్రభుత్వం ఎంతో సానుభూతితో, మానవత్వంతో వ్యవహరిస్తున్నది. నిర్వాసితులు మెరుగైన పునరుపాధి, పునరావాసం పొందడానికి ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచే ప్యాకేజీని అందిస్తున్నది. రూ. 800 కోట్లను మల్లన్నసాగర్ నిర్వాసితులకు పరిహారం, పునరావాస కార్యక్రమాల కోసమే ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. ప్రభుత్వం ఇంత చేసినా, కొద్ది మందికి సాయం అందించే విషయంలో జరిగిన జాప్యం వల్ల కోర్టులు తరచూ జోక్యం చేసుకోవాల్సి వస్తుంది. అది అత్యంత బాధాకరం. ఏనుగు ఎల్లింది, తోక మిగిలింది అనే చందంగా మొత్తం ప్రక్రియలో కొద్ది పాటి పరిహారం ఇవ్వడమే మిగిలింది. దీనిని అలుసుగా తీసుకుని కొంత మంది వ్యక్తులు, ప్రగతి నిరోధక శక్తులు ప్రాజెక్టునే ఆపడానికి కుట్రలు చేస్తున్నారు. పరిహారం పంపిణీ ప్రక్రియలో మిగిలిన కొంచెం పనిని కూడా త్వరగా పూర్తి చేసి, చిల్లర పంచాయితీని వెంటనే ముగించాలి’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

‘‘పరిహారం పంపిణీని యుద్ధ ప్రాతిపదికన ముగించి, కొండ పోచమ్మ సాగర్ రిజర్వాయర్ మాదిరిగానే శరవేగంగా మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణ పనులు చేపట్టాలి. యుద్ధం జరుగుతుందా అన్నట్లుగా పనులు చేసి, ఆరేడు నెలల్లోనే మల్లన్నసాగర్ నిర్మాణం పూర్తి చేయాలి. వచ్చే ఏడాది జూన్ లో రిజర్వాయర్ లో నీళ్లు నింపాలి’’ అని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలిచ్చారు.

ఇక, ప్రాజెక్టుల నిర్మాణంలో భూములు కోల్పోయిన వారికి దేశంలో కెల్లా అత్యంత మెరుగైన పునరావాస ప్యాకేజీని ప్రభుత్వం అందించింది. రైతులు కోల్పోయిన భూములకు, వ్యవసాయ కొట్టాలకు, బావులకు, బోర్ వెల్స్‌కు, చెట్లకు, తోటలకు, పైపులైన్లకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం పరిహారం అందించింది. పునరుపాధి, పునరావాస ప్యాకేజి కింద ఈ కింది విధంగా సాయం అందిస్తోంది.

కేంద్ర చట్టం ఒక్కో ఇంటికి రూ.1.25 లక్షల వ్యయమయ్యే 60 గజాల స్థలంలో ఇందిరా ఆవాస్ యోజన ఇల్లు మంజూరు చేయాలని చెబుతోంది. కానీ తెలంగాణ ప్రభుత్వం మల్లన్నసాగర్ నిర్వాసితులకు అంతకన్నా నాలుగు రెట్లు ఎక్కువగా, దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఒక్కో ఇంటికోసం రూ.5.04 లక్షల విలువైన 560 అడుగుల డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మిస్తోంది. ఈ ఇళ్లను కూడా ఎక్కడో మారుమూల ప్రాంతంలో కాకుండా గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ఎడ్యుకేషన్ హబ్ పక్కన 460 ఎకరాల విస్తీర్ణంలో ప్రభుత్వమే నిర్మించి ఇస్తోంది. ఇల్లు వద్దు అనుకునే వారికి 250 గజాల ఇంటి స్థలం, రూ.5.04 లక్షల నగదు అందిస్తోంది. ప్రస్తుతం ఉన్న ముంపు గ్రామంలోని ఇంటి స్థలానికి గజం రూ. 1600 చొప్పున లెక్క గట్టి పరిహారం చెల్లిస్తోంది. కోల్పోయిన ఇంటికి కూడా శాస్త్రీయంగా లెక్కగట్టి పరిహారం చెల్లిస్తోంది.

ఒక్కో కుటుంబానికి రూ.7.50 లక్షల పునరావాస ప్యాకేజీ అదనంగా అందిస్తోంది. 18 సంవత్సరాలు దాటిన అవివాహితులకు కూడా రూ.5 లక్షల పునరావాస సాయం, 250 గజాల ఇంటి స్థలం ఇస్తోంది. పునరావాస ప్యాకేజి కింద ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన ఇంటికి ఆర్డీఓ సంతకంతో తహసీల్దార్ పట్టా జారీ చేస్తారు. అవసరమైన పక్షంలో ఈ ఇంటిని అమ్ముకోవడానికి, బహుమతిగా కుటుంబ సభ్యులకు ఇవ్వడానికి అనుకూలంగా ఈ పట్టాలుంటాయి. మల్లన్నసాగర్ నిర్వాసితులకు ప్రభుత్వం అందిస్తున్న పునరోపాధి, పునరావాస కార్యక్రమం కింద గరిష్టంగా దాదాపు కోటి రూపాయల వరకు సాయం అందుతుంది.