కాంగ్రెస్ నేతల మధ్య కొట్లాట!

118

హైదరాబాద్, మే 11 (న్యూస్‌టైమ్): ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను, ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యలను నిరసిస్తూ అఖిలపక్షాల అధ్వర్యాన శనివారం ఇక్కడి ఇందిరా పార్క్‌ వద్ద నిర్వహించిన దీక్షలో కాంగ్రెస్‌ నాయకులు హద్దులుమీరారు. క్రమశిక్షణను ఉల్లంఘించి యుద్ధవాతావరణాన్ని తలపించేలా తన్నుకున్నారు. పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావును ఏకంగా చొక్కాపట్టుకునే పని చేశాడో నేత. ధర్నా వేదికపై ఉన్న కుర్చీ కోసం జరిగిన కొట్లా చివరికి కొట్టుకునే దాకా వచ్చింది.

పరస్పరం కాంగ్రెస్‌ నేతలు గొడవకు దిగి కొట్టుకున్నారు. కాంగ్రెస్‌ నేతల కొట్లాటతో ధర్నాలో గందరగోళం నెలకొంది. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి కుంతియా కోసం సభా వేదికపై కుర్చీని ఏర్పాటు చేశారు. ఈ కుర్చీపై అదే పార్టీకి చెందిన నాయకుడు గజ్జెల నగేశ్‌ కూర్చున్నారు. దీంతో నగేశ్‌ను సీనియర్‌ నాయకుడు వి. హనుమంతరావు వారిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుని కోసం వేసి కుర్చీలో కూర్చుంటావా? అంటూ అసహనం వెలిబుచ్చారు.

ఈ క్రమంలో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మొదట వీహెచ్‌ను నగేశ్‌ తోసేశారు. దీంతో కోపంతో ఊగిపోయిన వీహెచ్‌ నగేశ్‌పై చేయి చేసుకుని చేతిలో ఉన్న మైక్‌తో దాడి చేశారు. ఈ తోపులాటలో వీహెచ్‌ కూడా కిందపడిపోయారు. దీంతో ధర్నా వేదిక రణరంగంగా మారింది. అక్కడున్న మిగతా పార్టీల నాయకులు సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది. కాంగ్రెస్‌ నేతలు షబ్బీర్‌ అలీ, వీహెచ్‌, తెలంగాణ తెదేపా అధ్యక్షడు ఎల్‌.రమణ, సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి, తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరామ్‌, వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు. ఈ సందర్బంగా వేదికపై కాంగ్రెస్‌ వ్యవహారాల రాష్ట్ర ఇన్‌ఛార్జి కుంతియా కోసం ఏర్పాటు చేసిన కుర్చీలో టీపీసీసీ అధికార ప్రతినిధి నగేశ్‌ కూర్చునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో నగేశ్‌, వీహెచ్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

వీహెచ్‌ చేయి చేసుకోవడంతో నగేశ్‌ ఆయన చొక్కా పట్టుకున్నారు. తోపులాటలో ఇద్దరూ కిందపడిపోయారు. దీంతో అప్రమత్తమైన అఖిలపక్ష నేతలు కిందపడిపోయిన వీహెచ్‌ను పైకి లేపారు. ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి వచ్చినప్పుడు బాధ్యతగల నాయకుడు ఇలా ప్రవర్తించడం సరికాదంటూ వీహెచ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు సంఘీభావం తెలుపుతూ దీక్ష చేస్తున్నప్పడు మనలో మనకే సమన్వయం లేకపోవడం ఏంటని ధ్వజమెత్తారు. ఈ ఘటనతో అప్రమత్తమైన అఖిలపక్ష నేతలు వేదికపై ఉన్న నేతలంతా కిందికి దిగాలని, ఒక్కో పార్టీ నుంచి ఒక నాయకుడు మాత్రమే ఉండాలని ఆదేశించారు.

సభాస్థలి చిన్నగా ఉండటంతో పాటు ఎక్కువ మంది నేతలు తరలిరావడంతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది. కోదండరాం, సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ జోక్యం చేసుకుని పరిస్థితి సద్దుమణిగేలా చేశారు. కాంగ్రెస్‌ నేతల మధ్య విభేదాలు ఉంటే గాంధీభవన్‌లో తేల్చుకోవాలి గానీ, దీక్షా శిబిరం వద్ద ఘర్షణకు దిగడం సరికాదని వివిధ పార్టీల నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతకముందు, తెలంగాణ గాంధీభవన్‌లో జరిగిన తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్‌ నేతల సమావేశంలో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంఛార్జి ఆర్‌సీ కుంతియా తీరుపై వీహెచ్‌ తీవ్రంగా స్పందించారు.

పార్టీకి నష్టం కలిగించేలా కార్యక్రమాలు చేస్తున్నారంటూ అసంతృప్తి వ్యక్తంచేశారు. ఉదయం సమావేశం ప్రారంభం కాకముందే గాంధీ భవన్‌కు వచ్చిన వీహెచ్‌ అప్పటికే అక్కడికి వచ్చి ఉన్న కుంతియా, ఉత్తమ్‌ వద్దకు వెళ్లారు. పార్టీలో దీర్ఘకాలికంగా జెండాలు మోస్తున్న వారిని కాదని ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ఏ విధంగా టికెట్లు ఇస్తారని నిలదీశారు. ఒకే సామాజిక వర్గానికి చెందినవారికి టికెట్లు కేటాయిస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ఎమ్మెల్సీలుగా ఉన్నవారికి మళ్లీ అసెంబ్లీ టికెట్లు ఇవ్వడమేంటని ప్రశ్నించారు.