అంచనాలు అందుకున్న సీక్వెల్!

49

ముంబయి, మే 10 (న్యూస్‌టైమ్): విజయవంతమైన చిత్రాలకు సీక్వెల్స్ రావడం మామూలే. ఇందులో వింతేమీ లేదు. అయితే, అదే సీక్వెల్‌లో కొత్త నటీనటులతో ప్రయోగం చేస్తే మాత్రం ప్రేక్షకుల్లో ఆశలు ఆకాశానికి నిచ్చెనలు వేస్తాయి. ‘స్టూడెంట్‌ ఆఫ్ ది ఇయర్‌’ సీక్వెల్ విషయంలోనూ అదే జరిగింది. 2012లో వచ్చిన ఈ చిత్రానికి రెండో భాగం ‘స్టూడెంట్‌ ఆఫ్ ది ఇయర్‌-2’ పేరిట శుక్రవారం విడుదల అయిన చిత్రం ఊహించినట్లే అలరిస్తోంది. టైగర్‌ ష్రాఫ్‌, అనన్యా పాండే, తారా సుతారియా, ఆదిత్య సీల్‌, గుల్‌ పనాగ్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం విశాల్‌-శేఖర్‌ అందించారు.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించిన రవి కే చంద్రన్‌ తన ప్రతిభకు మరోసారి పదునుపెట్టారు. అర్షద్‌ సయ్యద్ అందించిన కథలో సీక్వెల్‌ వాసనలే ఉన్నా యువతను విశేషంగా ఆకట్టుకునేలా దర్శకుడు పునీత్ మల్హోత్రా చక్కని స్క్రీన్‌ప్లేతో సినిమాను తీర్చిదిద్దారు. ధర్మ ప్రొడక్షన్స్‌, ఫాక్స్‌ స్టార్‌ స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం విడుదల అయింది. ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటుడు టైగర్‌ ష్రాఫ్‌ కథానాయకుడిగా నటించారు. తారా సుతారియా, అనన్యా పాండేలు కథానాయికలుగా వెండితెరకు పరిచయమయ్యారు. కథ విషయానికి వస్తే, సంపన్న కుటుంబానికి చెందిన శ్రేయ సుఖాడియా (అనన్య పాండే), డ్యాన్సర్‌ కావాలని కలలు కనే అమ్మాయి మృదుల అలియాస్‌ మియా (తారా సుతారియా) ఒకే కాలేజ్‌లో చదువుతుంటారు. ఆ కాలేజ్‌లో కొత్తగా చేరతాడు రోహన్‌ శర్మ (టైగర్‌ ష్రాఫ్‌). శ్రేయ, మియా రోహన్‌ను చూసి ఇష్టపడతారు. అయితే రోహన్‌ దృష్టి మాత్రం కాలేజ్‌లో ఉత్తమ విద్యార్థికి అందించే ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ కప్పు పైనే ఉంటుంది.

మరి దాన్ని గెలుచుకున్నాడా? శ్రేయ, మియాల్లో ఎవరు రోహన్‌ ప్రేమను గెలుచుకున్నారు? అన్నదే ఈ సినిమా కథ. ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ లాంటి కథనే ఎంచుకున్నారు దర్శకుడు పునీత్‌ మల్హోత్రా. మొదటి చిత్రంలో ఒక హీరోయిన్‌, ఇద్దరు హీరోలు ఉన్నారు. సీక్వెల్‌లో మాత్రం ఇద్దరు హీరోయిన్లను పెట్టారు. రెండు సినిమాలకు మధ్య వ్యత్యాసం ఈ ఒక్క పాయింట్‌ మాత్రమేనని చెప్పాలి. ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ సినిమా చూసినవారికి సీక్వెల్‌ చిత్రం అంత గొప్పగా అనిపించదు. సీక్వెల్‌ సినిమా కావడంతో మొదటి సినిమాలో చూపించిన కాలేజ్‌లాంటి భవనాన్నే ఇందులోనూ చూపించారు.

అందులోని దాదాపు చాలా సన్నివేశాలను కాపీ కొట్టినట్లుగా అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు ఆమిర్‌ ఖాన్‌ నటించిన ‘జో జీతా హై వహీ సికందర్‌’ సినిమాను తలపిస్తాయి. ప్రధమార్ధాన్ని రోహన్‌ ప్రపంచాన్ని మనకు పరిచయం చేసే సన్నివేశాలతో నడిపించాడు దర్శకుడు. అసలు కథ ద్వితీయార్ధంలోనే ఉంటుంది. ప్రేయసి కోసం స్పోర్ట్స్‌ కోటాలో అంతటి పేరున్న కాలేజ్‌లోకి వెళ్లిన రోహన్‌కు చేదు అనుభవాలు ఎదురవుతాయి. ప్రేమలో విఫలమవుతాడు. కానీ కుంగిపోకుండా ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ ట్రోఫీని గెలవడానికి అతను చేసిన సాధనలు సినిమాకు బలాన్నిచ్చాయి. విశాల్‌-శేఖర్‌ అందించిన సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా ఉన్నాయి. ప్రతీ ఫ్రేమ్‌ ఎంతో ఫ్రెష్‌గా కనిపిస్తుంటుంది.

ఒక్కమాటలో చెప్పాలంటే, ఇది టైగర్‌ ష్రాఫ్ వన్‌ మ్యాన్‌ షో. తన దేహదారుఢ్యంతో, మార్షల్‌ ఆర్ట్స్‌, డ్యాన్సింగ్‌ స్కిల్స్‌తో నూటికి నూరు మార్కలు వచ్చేలా నటించాడు. ఇక తారా సుతారియాకు, అనన్యా పాండేలకు ఇది తొలి సినిమా కావడంతో వారి నుంచి ఎక్కువగా ఆశించలేం. వారి గ్లామర్‌కు మాత్రమే మార్కులు పడతాయి. నటన పరంగా ఇద్దరూ ఇంకా ఎంతో పరిణతి చెందాల్సి ఉంది. సినిమా అవకాశం వచ్చింది అన్నట్లుగా నటించారే తప్ప వారు నటనను సీరియస్‌గా తీసుకోలేదనిపిస్తుంది. తోటి విద్యార్థిగా, ప్రతినాయకుడి ఛాయలున్న పాత్రల్లో నటించాడు మానవ్‌ సీల్‌.

అతని నటన కూడా మెప్పిస్తుంది. ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’లో కథానాయికగా నటించిన ఆలియా భట్‌ సీక్వెల్‌లో ‘హుకప్‌’ అనే ప్రత్యేక గీతంలో మెరిశారు. ప్రముఖ హాలీవుడ్‌ నటుడు విల్‌ స్మిత్‌ కూడా ఓ పాటలో అలరిస్తారు. మిగతావారంతా తమ పాత్రల పరిధి మేర బాగానే నటించారు. నిర్మాణ విలువలు, టైగర్‌ ష్రాఫ్‌ నటన, సంగీతం, ద్వితీయార్ధంలో తారా సుతారియా, అనన్యా పాండేల నటన ఈ చిత్రానికి అనుకూల అంశాలైతే, కథ, కథనంలో కొత్తదనం లేకపోవడం ప్రధాన ప్రతికూలమని చెప్పాలి.