రాష్ట్ర ప్రగతికి పెద్దపీట వేసేలా కేంద్ర వనరులు: పురందేశ్వరి

363

విశాఖపట్నం, మార్చి 28 (న్యూస్‌టైమ్): ఆంధ్రరాష్ట్ర అభివృద్ధికి కేంద్రం వనరులు అందించిందని, వీటిని ప్రజలకు తెలియజేయాలని విశాఖ పార్లమెంటరీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. గురువారం ఉదయం అమె తన ప్రచారాన్ని గాజువాక నియోజకవర్గంలోని షీలానగర్‌ నుంచి ప్రారంభించారు. రాష్ట్ర అభివృద్దికి కేంద్రం అందించిన పథకాలు, వనరుల వివరాలు ప్రజలకు చెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వం సాహసించడం లేదన్నారు.

పేదల సంక్షేమం లక్ష్యంగా కేంద్రంలో బిజెపి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. దీనిలో భాగంగా 2014 నుంచి నేటి వరకు అనేక సంక్షేమ పథకాలను కేంద్ర ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోందన్నారు. ఉగ్రవాదులకు ధీటైన జబాబు ఇచ్చిన ఘనత బిజెపి ప్రభుత్వానిదేన్నారు. భారతీయ సైనికులకు వెన్నుదన్నుగా దేశంలోని 130 కోట్ల మంది ప్రజలు ఉన్నారని మోదీ రుజువుచేసారన్నారు. విశాఖలో గతంలో తాను ఎంపీగా సేవలు అందించానని, తనకు నగరంపై విస్తృత అవగాహన ఉందన్నారు. విశాఖ అభివృద్ధికి కృషిచేస్తానన్నారు. విశాఖలో జరిగిన భూ మాఫియాపై ఏర్పాటు చేసిన సిట్‌ నివేదిక అందించినా, నేటికీ ఈ నివేదికను బయట పెట్టలేని దుస్తితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు.

ఆ పార్టీకి చెందిన మంత్రులు, ప్రజా ప్రతినిధులు భూ మాఫియాలో భాగస్వాములుగా ఉండటమే దీనికి కారణమన్నారు.నేడు కేంద్రం అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తున్నా, రాష్ట్రంలో జన్మభూమి కమిటీలకు చేయి తడిపితేనే సంక్షేమ పథకాలు ప్రజలకు అందే పరిస్థితి కల్పించారన్నారు. భారతీయ జనతాపార్టీకి ఓటు వేస్తే నీతివంతమైన పాలన సాధ్యపడుతుందన్నారు. సమర్ధుడైన పులుసు జనార్ధన రావును శాసన సభ్యునిగా గెలిపించాలన్నారు. రానున్న ఎన్నికల్లో కమలం గుర్తుపై ఓటు వేసి తనను పార్లమెంట్‌ సభ్యురాలిగా ఎన్నుకోవాలని కోరారు. కార్యక్రమంలో బిజెపి గాజువాక శాసన సభ అభ్యర్ధి, మాజీ మేయర్ పులుసు జనార్ధన్‌రావు, స్థానిక నాయకులు, పెద్దసంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.