నరేంద్రమోదీకి ఎదురుగాలి!

131

న్యూఢిల్లీ, మార్చి 28 (న్యూస్‌టైమ్): 2014 సాధారణ ఎన్నికలతో పోల్చిచూస్తే ఈసారి ఎన్నికల్లో నరేంద్రమోదీ హవా అంతగా ప్రభావం చూపడం లేదన్నది స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో ఆయన సారధ్యంలోని ఎన్డీయే ఈ ఎన్నికల్లో ఎలా గట్టెక్కుతుందో అంతుచిక్కని పరిస్థితిలో కూటమి పక్షాలే ఉండడం గమనార్హం. దాయాది దేశమైన పాక్ ఉగ్రవాదాన్ని చూపించి ఈసారి సాధారణ ఎన్నికల్లో గట్టెక్కాలని చూసిన భారతీయ జనతా పార్టీని ఓటర్లు ఎంత వరకు ఆదరిస్తారో చూడాలి.

ఎన్నికలను ఎదుర్కొనేందుకు మోదీ సర్కారు దాదాపు ఏడాది క్రితం నుంచే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ వస్తోంది. అందులో భాగంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘చౌకీదార్’ నినాదాన్ని ఎత్తుకున్నారని రుజువవుతోంది. గత ఎన్నికలతో పోలిస్తే ఓ భవిష్యద్దర్శనం కలిగిన నేత నుంచి కాపలాదారుగా ప్రచారం చేసుకోవటం ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఇదెంత మేరకు అటు ఎన్డీయేకు, ఇటు బీజేపీకి లాభిస్తుందన్నదే ప్రశ్నార్థకంగా మారింది. 2014 ఎన్నికల సందర్భంలో మోదీ దేశ ఆర్థిక వ్యవస్థ తీరు గురించీ, గ్రామీణ భారతం, పట్టణ ప్రాంత ప్రజల సమస్యలు, ఆర్థికమాంద్యం తదితర అంశాల గురించి గొప్పగా ప్రచారం చేసి ప్రజల మనసుల్ని అనూహ్యంగా కొల్లగొట్టారు.

సమర్థ నాయకత్వంతో దేశానికి దిశానిర్దేశం చేస్తామని కూడా ప్రచారం చేశారు. అంతకు ముందు 2004లో అటల్ బిహారీ వాజపేయి నేతృత్వంలో భారత్ వెలిగిపోతోందని ప్రచారం చేశారు. వాటి ఫలితాలు ఎలా ఉన్నా గత ఎన్నికల నినాదాలతో పోలిస్తే, చౌకీదార్ నినాదం ప్రజలను ఆకర్షిస్తుందా? అన్నదే ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తోంది. నిజానికి చౌకీదార్ అన్నది ప్రధానంగా రెండువిధాలుగా సమస్యాత్మకమైనది. నాయత్వానికి, కాపలాదారుకి మధ్య గుణాత్మకంగా చాలా తేడా ఉంది. మొదటిది, ఎక్కడైనా ఏదైనా పనిలో ఎదురయ్యే సమస్యలు, వేతన సమస్యలు తదితర సమస్యలు చౌకీదారుతో కాకుండా నాయకత్వానికే చెప్పుకుంటారు. చౌకీదారు నాయకుని ఆలోచనలకు అనుగుణంగా నడుచుకుంటాడు.

ఈ అర్థంలో చౌకీదారు నిర్ణయాత్మక శక్తి ఏ రూపంలోనూ కానేరడు. ఇదంతా గాకున్నా బాలాకోట్ లాంటి సంరక్షణ విషయాలను ముందుపెట్టి దేశరక్షణ విషయాలు మాట్లాడినా ప్రజలకు చేరేదేమో. అవినీతి నిర్మూలన, స్వచ్ఛభారత్ లాంటి నినాదాలను వదిలి చౌకీదార్ నినాదాన్ని పట్టుకోవటంలో ఆంతర్యం అంతుబట్టదు. ఇక, రెండవది, ఇప్పుడు అవినీతి, లంచగొండితనానికి వ్యతిరేకంగా మాట్లాడాల్సిన అవసరం ఏర్పడింది. గత ఎన్నికల సందర్భంలో అభివృద్ధిలో మందగమనం, ఆర్థికమాంద్యం, నిరుద్యోగం ప్రధాన ప్రచారాస్త్రాలుగా చేసుకొని ఎన్నికల గోదాలో దిగారు నరేంద్ర మోదీ.

దీంతో దేశంలో పట్టణ యువ ఓటర్లంతా మోదీ ప్రసంగాలకు ఆకర్షితులయ్యారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ వైఫల్యాలు మోదీకి వరాలుగా పనికివచ్చాయి. కానీ ఇప్పుడు తిరిగి అధికారం చేజిక్కించుకోవటానికి అలాంటి ఆకర్షణీయమైన ఒక నినాదం కూడా లేకపోవటం గమనార్హం. కానీ, సరిగ్గా ఈ సమయంలో కారవాన్ పత్రికలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్ప లంచాల డైరీ వెలుగు చూసింది. దీనికితోడు రాఫెల్ ఒప్పంద కుంభకోణం ఉండనే ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో అవినీతి నినాదం పనిచేయకపోవచ్చని బీజేపీ నాయకత్వం ఆలోచించినట్లు కనిపిస్తోంది.

2014 ఎన్నికల సందర్భంలో మోదీ బలమైన అభ్యర్థిగా ప్రధాని రేసులో ముందుకువచ్చినా అప్పటికే అతన్ని గుజరాత్‌లో 2002లో జరిగిన మతకలహాల నరమేధం వెన్నాడింది. అయినా, అప్పుడున్న పరిస్థితుల్లో ఒక ప్రాంతీయ నేతగా మాత్రమే గుర్తింపు ఉన్న మోదీ దూకుడైన ప్రచారంతో ప్రధాని రేసులో అగ్రభాగానికి చేరారు. అయితే, ఈ సారి మోదీ సర్కార్, దేశాన్ని మార్చేద్దాం పదండి లాంటి నినాదాలతో మొదలుపెట్టి అచ్చే దిన్ ఆయేగీ (మంచిరోజులొస్తాయి) లాంటి జనాకర్షక నినాదాలతో ప్రజలను ఆకట్టుకున్నారు. సరిగ్గా అదే సమయంలోనే ఢిల్లీలోని శ్రీరాం కాలేజీలో విద్యార్థులతో మోదీ ముఖాముఖి జరిగింది. ఆయన అక్కడ గుజరాత్ మోడల్ అభివృద్ధి గురించి మాట్లాడారు.

అంటే వేగవంతమైన ప్రభుత్వ నిర్ణయాలు, నైపుణ్యాల పెంపుతో అభివృద్ధిని శరవేగంగా సాధించవచ్చని చెప్పుకొచ్చారు. అప్పుడు ఆ ఉపన్యాసం యువ ఓటర్లుగా ఉన్న విద్యార్థులు, యువతను బాగా ఉత్తేజపరిచింది. ఒక భవిష్యత్ దర్శనం ఉన్న నేత మోదీ దేశానికి అవసరమనే భావన ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఒక భవిష్యత్ దర్శనం ఉన్న నేత నుంచి కాపలాదారుగా మారటం ఏవిధంగానూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, సమర్థనీయంగా ప్రజలకు అనిపించటంలేదు.

నిజానికి ఇప్పుడు అధికారం నిలుపుకునేందుకు గత ప్రభుత్వ హయాంలో ఏం చేశారో, మరోసారి అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పుకోవాలి. అలా చెప్పుకోవటానికి బదులు చౌకీదార్ నినాదంతో ప్రజల ముందుకుపోవటం నాయకత్వ లక్షణానికి సరిపోనిదే అవుతుంది. మరోవైపు, కాపలాదారు ప్రచారం తిప్పికొట్టిన పరిస్థితులే కనిపిస్తున్నాయి. అంబానీలాంటి ధనవంతులు, కుబేరులకే కాపలాదారు కానీ ప్రజలకు కాదని ప్రధాన విమర్శ ఉంది. అలాగే ఇది సూటు బూటు సర్కార్ అనే విమర్శ కూడా చాలారోజులుగా ప్రధాని మోదీ ఎదుర్కొంటూనే ఉన్నారు. ప్రస్తుత పరిస్థితులన్నింటినీ పక్కనబెట్టి మోదీ నేను కూడా కాపలాదారునే అనే ఉద్యమాన్ని చేపట్టారు. ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధి కోసం కష్టించి పనిచేస్తూ దేశానికి కాపలాదారుగా పనిచేస్తామని చెప్పుకొస్తున్నారు.

కాపలాదారుకు సరికొత్త అర్థాన్నిచ్చి దాంతో ముందుకు పోవాలన్న మోదీ ప్రయోగం ఏ మేరకు ప్రజలను సమ్మతింపజేస్తుందో చూడాలి. గత ఎన్నికల సందర్భంలో అభివృద్ధిలో మందగమనం, ఆర్థికమాంద్యం, నిరుద్యోగం ప్రధాన ప్రచారాస్త్రాలుగా చేసుకొని ఎన్నికల గోదాలో దిగారు ఆయన. దీంతో దేశంలో పట్టణ యువ ఓటర్లంతా మోదీ ప్రసంగాలకు ఆకర్షితులయ్యారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ వైఫల్యాలు మోదీకి వరాలుగా పనికివచ్చాయి. కానీ ఇప్పుడు తిరిగి అధికారం చేజిక్కించుకోవటానికి అలాంటి ఆకర్షణీయమైన ఒక నినాదం కూడా లేకపోవటం గమనార్హం. నేను కూడా కాపలాదారునే అనే నినాదంతో 25 లక్షల మంది మోదీ ప్రచార నినాదాన్ని ప్రజల్లోకి తీసుకుపోతున్నారు.

వాస్తవ జీవితంలో చౌకీదార్ బతుకులు ఎంత దుర్భరంగా ఉన్నాయో ప్రజలందరికీ అనుభవమే. అయితే, ఎల్లప్పుడు ప్రచార యుద్ధంతోనే ఎన్నికల్లో గెలువవచ్చనేది సాధ్యం కాకపోవచ్చు. 2004 ఎన్నికల్లో బీజేపీ ఎన్నికల ప్రచారం కోసం 150 కోట్లు ఖర్చుచేసింది. 2014 ఎన్నికల్లో యూపీఏ ఒక నెలలోనే 308 కోట్లు ఖర్చుచేసింది. 2015 ఎన్నికల్లో ఢిల్లీలో బీజేపీ చేసిన ఎన్నికల ఖర్చు ఆకాశానికి తాకింది.

అయితే, ప్రచార పటాటోపంతోనే ఎన్నికల్లో ప్రజలు ఓటేస్తారని అనుకోవటానికి లేదు. వారికి కూడా ఆలోచించే శక్తి ఉన్నదన్నది గుర్తెరగాలి. ఈ పరిస్థితుల నేపథ్యంలో చౌకీదార్ ఓటర్ల విశ్వాసాన్ని పొందగలుగుతరా? వేచి చూడాల్సిందే. గుడ్డెద్దు చేలో పడినిన చందంగా నరేంద్రమోదీ నినాదం మిగులుతుందన్న విమర్శ విపక్షాల్లో ఉంది. కానీ, బీజేపీ మాత్రం మోదీ చౌకీదారు నినాదం సరైనదేనని నమ్ముతోంది.