సాహితీ సమరాంగణ సార్వభౌముడు

52

అమరావతి, మార్చి 26 (న్యూస్‌టైమ్): సాహితీ సమరాంగణ సార్వభౌముడు, కర్ణాటకాంధ్ర మహారాజు అయిన శ్రీకృష్ణదేవరాయలు తనను తాను ‘తెలుగు వల్లభుండ తెలుగొకండ’ అంటూ చాటుకుని, ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అంటూ తెలుగువారికి మరింత దగ్గరయ్యాడు. అయితే ఆయన ఎలా ఉండేవాడో, ఆయన రూపం ఎలా ఉండేదో తెలుగు వాళ్లకు తెలియదు.

శ్రీకృష్ణదేవరాయలుగా ఎన్టీఆర్ నటించిన చిత్రాలు చూసి, రాయలవారు సినిమాలో ఎన్టీఆర్ ఉన్నట్టే ఉండేవారేమో అన్న ఒక అవగాహన కలిగింది. మనం చూసే రాయల చిత్రాలన్నిటికీ ఆధారం డోమింగో పేస్ గీసిన చిత్రం. శ్రీకృష్ణదేవరాయల పాలనాకాలంలో భారతదేశాన్ని సందర్శించిన ఈ పోర్చుగీసు యాత్రికుడు 15 నెలలు శ్రమించి రాయలవారి చిత్రాన్ని గీసారట.

ప్రస్తుతం ఆ చిత్రం పూనేలో ఉన్న భారతీయ ఇతిహాసిక్ సంశోధన్ మండల్ అనే చోట భద్రపరచబడింది. అందుకే ఎన్టీఆర్‌కు వేసిన వేషధారణ కూడా డోమింగో గీసిన చిత్రం మాదిరిగానే ఉంటుంది. ఆ వేషానికి మరింత ఠీవినీ, దర్పాన్నీ జోడించి, నాటి రాయల రాజసాన్ని గుర్తుకు తెచ్చేవారు ఎన్టీఆర్.