పథకం ప్రకారం పోటీకి దూరం చేశారు: వివేక్

50

హైదరాబాద్, మార్చి 26 (న్యూస్‌టైమ్): టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పథకం ప్రకారం తనను ఈసారి ఎన్నికల్లో పోటీకి దూరం చేశారని మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అనుమానం వ్యక్తంచేశారు. రాజకీయ వ్యూహంలో భాగంగా కేవలం తను పోటీచేసే అవకాశం లేకుండా కేసీఆర్ చివరి క్షణంలో టికెట్ నిరాకరించారని పేర్కొన్నారు. ఇప్పుడు ఆయన ఆటబొమ్మలు కొందరు తనమీద తప్పుడు ఆరోపణలు ప్రచారం చేస్తున్నారని, పార్టీకి వ్యతిరేకంగా పోటీచేసిన వ్యక్తికి టికెట్ ఇవ్వడాన్ని బట్టే ఎవరు ద్రోహం చేశారో తెలిపోయిందన్నారు.

తన తండ్రి కాకా, తను తెలంగాణ సాధనే లక్ష్యంగా రాజీలేని పోరాటం చేశామని, తెలంగాణ మేలు కోసమే కేసీఆర్ ఆహ్వానిస్తే పార్టీలోకి వచ్చానని, అంతేగానీ, రాజకీయ ఎదుగుదల కోసం మాత్రం కాదన్నారు. తెలంగాణ కోసం పనిచేయడం, ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా లొంగకుండా పోరాడడమే పార్టీకి ద్రోహం చేయడమా? పార్టీ బలహీనంగా ఉన్నచోట పటిష్ఠం చేయడానికి పనిచేయడమే తను చేసిన ద్రోహమా? అని వివేక్ ప్రశ్నించారు. 2014లో టీఆర్ఎస్‌కు ఇద్దరు ఎంపీలే ఉంటే తను తోటి ఎంపీలతో కలిసి బిల్లు ఆమోదం కోసం జాతీయ పార్టీలపై ఒత్తిడి తేవడమే చేసిన ద్రోహమా? అని ఆందోళన వ్యక్తంచేశారు.

తెలంగాణ సాధనలో కాకా సేవలకు గుర్తింపుగానే ట్యాంక్ బండ్‌పై విగ్రహం పెట్టారని, టికెట్ హామీ ఇచ్చి కూడా తనను పెద్దపల్లికి దూరంగా ఉంచడానికే కేసీఆర్ తొత్తులు కొందరు పనిచేశారన్నారు. ప్రభుత్వ సలహాదారుగా ఎలాంటి ప్రయోజనాలు తీసుకోకపోగా, ఆ పదవి వల్లే హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడి పదవి పోగొట్టుకోవాల్సి వచ్చిందన్నారు. బహుశా, కేసీఆర్‌కు, టీఆర్ఎస్‌కూ ఇదే తను చేసిన ద్రోహం కావచ్చని వివేక్ వ్యాఖ్యానించారు. ఎవరెన్ని కుట్రలు, వ్యూహాలు పన్నినా ప్రజలకు తనను దూరం చేయలేరని, పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేసిన తనకు ద్రోహం చేయడంం దిగ్భ్రాంతి కలిగిస్తోందన్నారు.

ఉద్యమంలో ఏ పాత్ర లేనివాళ్లకు, కనీసం జై తెలంగాణ అని నినాదం కూడా చేయనివాళ్లకు కేసీఆర్ టికెట్లిచ్చారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు విరుద్ధంగా ఉద్యమకారులను పక్కనబెట్టారని, తెలంగాణకు, ప్రజలకు వ్యతిరేకంగా పనిచేసినవాళ్లే ఇప్పుడు పార్టీకి పెద్ద ముఖాలుగా ఉండడం బాధిస్తోందన్నారు. ప్రజాస్వామిక తెలంగాణ సాధించాలన్న ఆశయం నెరవేరకపోగా నియంతృత్వపోకడలను ప్రజల మీద రుద్ధుతున్నారన్నారు.

ఈ విషయాన్ని జనం త్వరలోనే గుర్తిస్తారని, రాష్ట్ర వ్యాప్తంగా తన అభిమానులు, మద్దతుదారులు కోరుతున్నా కూడా సమయం తక్కువగా ఉండడం వల్ల పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని వివేక్ పేర్కొన్నారు. జీవితాంతం తెలంగాణ ప్రజల మేలు కోసం పనిచేస్తూనే ఉంటానని చెప్పిన వివేక్ కష్టకాలంలో తోడున్న మద్దతుదారులకు ధన్యవాదాలు తెలిపారు.