ప్రజలకు ఉచిత వైద్య సేవలు అవసరం

247

విశాఖపట్నం, మార్చి 25 (న్యూస్‌టైమ్): ప్రజలకు ఉచిత వైద్య సేవలు ఎంతో అవసరమని గాయిత్రీ విద్యా పరిషత్‌ కార్యదర్శి ఆచార్య పి.సోమరాజు అన్నారు. సోమవారం సాయంత్రం పెదవాల్తేరులోని గాయత్రీ విద్యాపరిషత్‌ మెడికల్‌ కళాశాల కమ్యూనిటీ సెంటర్‌లో జరిగిన ఉచిత మందుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ధనం కంటే సేవే ప్రధానమని సందేశమిచ్చిన దివంగత ఆచార్య దీక్షితులు, అనసూయ సేవలను గుర్తుచేశారు.

వైద్య సేవలు అందించడానికి తమ సంస్థకు సహకారం అందించడానికి ముందుకు వచ్చిన ఆచార్య జయంతి లక్ష్మీనారాయణ, జయంతి విజయరత్న దంపతుల సేవలను కొనియాడారు. వైద్య కేంద్రానికి వచ్చే పేద, బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఉపయుక్తంగా నిలచే మందులను అందించిన లక్ష్మీనారాయణ దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతీ నెల రోగులకు అవసరమైన మందులను ఉచితంగా గాయత్రీ మెడికల్‌ సెంటర్‌లో పంపిణీ చేస్తామన్నారు.

కార్యక్రమంలో జీవీపీ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య రామ్మూర్తి, కమ్యూనిటీసెంటర్‌ ఇంచార్జి డాక్టర్‌ ఎం.సత్యనారాయణ రాజు, డాక్టర్‌ పద్మిని, ఆచార్య లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.