వందల కోట్లు కుమ్మరిస్తున్నారు!

33

గుంటూరు, మార్చి 25 (న్యూస్‌టైమ్): ఎన్నికల్లో తన ఓటమే లక్ష్యంగా తెలుగుదేశం, బీజేపీ, వైఎస్సార్ కాగ్రెస్ పార్టీలు వందల కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్నాయని జనసేన అధినేత వపన్ కల్యాణ్ అన్నారు. భీమవరం, గాజువాక నియోజకవర్గాలలో తనను ఓడించేందుకు ఆయా పార్టీలు చేయరాని దారుణాలకు పాల్పడతున్నాయన్నారు. ఎవడు వస్తాడో ఎవడు ఓడిస్తాడో తేల్చుకుందాం రండంటూ ఆయన సవాలు విసిరారు. జనసేన అధికారంలోకి రాగానే 3 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు పవన్‌ కల్యాణ్‌ హామీ ఇచ్చారు. కొత్త రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రిగా తానే వస్తానని విశ్వాసం వ్యక్తంచేశారు.

సోమవారం ఆయన గుంటూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒకరికి ఊడిగం చేసే రోజులు పోయాయని, పల్లకీలు మోసిన ప్రజలనే తాను పల్లకీలు ఎక్కిస్తానని చెప్పారు. తెలుగుజాతి ఆత్మగౌరవం కోసమే పంచె కట్టానన్నారు. అధికారం కొన్ని కుటుంబాలకే పరిమితం కాకూడదన్నారు. గుంటూరులో ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌ కళాశాల ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. రూపాయి వాసన చూపిస్తే మోసపోయే తరం ఇది కాదన్నారు. అతిసారంతో ప్రజల ప్రాణాలు పోయినా తెదేపా ఎంపీ గల్లా జయదేవ్‌ పట్టించుకోలేదని మండిపడ్డారు.

కమిషన్ల కోసమే గుంటూరులో తరచుగా రోడ్లు, కాల్వలు తవ్వుతున్నారని ఆరోపించారు. జనసేన వస్తే 40 ఏళ్లకు సరిపడా శాశ్వత వ్యవస్థ ఏర్పాటు చేస్తానని భరోసా ఇచ్చారు. వైకాపాలాగా డొంకతిరుగుడు రాజకీయాలు తనకు రావని పవన్‌ వ్యాఖ్యానించారు. ఇక్కడ భాజపాను తిట్టడం, ఢిల్లీ వెళ్లి వారి కాళ్లు పట్టుకోవడం వైకాపా నైజమన్నారు. వైకాపాకు ముస్లిం ప్రజల ఓట్లు కావాలి గానీ వారికి పదవులు మాత్రం ఇవ్వరని ధ్వజమెత్తారు.