కొనసాగుతున్న రహస్య పాలన!

62

న్యూఢిల్లీ, మార్చి 19 (న్యూస్‌టైమ్): అధికారంలో ఉన్న ఏ పక్షమైనా తన తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు శాయశక్తులా కృషిచేస్తూనే ఉంటుంది. ఇది జగమెరిగిన సత్యం. ఆ కప్పిపుచ్చుకునేవి సమాచార పరమైనవి కావచ్చు లేదా ఇంకేమైనా కావచ్చు.

తాజాగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కూడా అలాంటి తప్పిదాన్నే చేసింది. అధికార గణాంకాలను ప్రజలకు తెలియకుండా దాచిపెడుతోందన్న విమర్శను మూటగట్టుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆర్థిక, సామాజిక శాస్త్రవేత్తలు ఇదే అంశంపై ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వ అధికార గణాంకాలను తెలియజేయటంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను తీవ్రంగా గర్హిస్తూ దేశవ్యాప్తంగా ఉన్న 108 మంది ఆర్థికవేత్తలు సంతకాల ఉద్యమం చేపట్టారు. గణాంకాల్లో ప్రామాణికంగా పరిగణించే సీఎస్‌ఓ, ఎన్‌ఎస్‌ఎస్‌ఓ లాంటి సంస్థలు ఎలాంటి రాజకీయ జోక్యాలు, ఆధిపత్యా ల్లేకుండా స్వేచ్ఛగా పనిచేసేలా ఉండాలని ఆర్థికవేత్తలు కోరుతున్నారు. ప్రభుత్వ తీరును తప్పుపడుతున్న వారిలో భారతీయ ప్రఖ్యాత ఆర్థికవేత్తలతో పాటు, విదేశీ ఆర్థికవేత్తలు కూడా తమ భావజాలాలు, రాజకీయాలకు అతీతంగా ఉన్నారు.

అధికారంలో ఉన్నది ఏ పార్టీ అన్నదానితో సంబంధం లేకుండా గత కొన్నేళ్లుగా ఆర్థిక, అభివృద్ధి గణాంకాలను ప్రజలకు తెలియకుండా దాచిపెడుతున్న తీరును తీవ్రంగా తప్పుబట్టారు. అంతేగాకుండా ఈ సంస్థలపై ప్రభుత్వ, రాజకీయ జోక్యం లేకుండా స్వేచ్ఛగా పనిచేసే వాతావరణం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆర్థిక, అభివృద్ధి గణాంకాలతోనే ఆర్థిక విధానాల రూపకల్పన జరుగుతుంది. కాబట్టి గణాంకాల పట్ల విశ్వసనీయతను సన్నగిల్లనీయరాదని ఆర్థికవేత్తలు అంటున్నారు. అలాగే దేశంలో ప్రామాణికంగా పరిగణించబడే సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్, నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ లాంటి సంస్థలపై రాజకీయ జోక్యం అసలే ఉండరాదని కోరారు. గణాంకాల్లో విశ్వసనీయతను కాపాడాలని, రాజకీయజోక్యాన్ని నిరసించాలని డిమాండ్ చేస్తూ సంతకం చేసిన ఆర్థికవేత్తల్లో ప్రఖ్యాత ఆర్థికవేత్తలు అభిజిత్ బెనర్జీ, ప్రణబ్ బర్ధన్, జీన్ డ్రేజ్, జేమ్స్ బోయ్‌సీ, జయతీ ఘోష్, అమర్త్య లహిరి, సుధా నారాయణన్, అశిమా సూద్, జయన్ జోస్ థామస్, వంశీ వకుళాభరణం తదితరులున్నారు.

ఈ మధ్యకాలంలో గణాంక సంస్థల పనితీరును, వాటి గణాంకాలను రాజకీయపార్టీలు ప్రభావితం చేయటాన్ని తీవ్రంగా ఖండించారు. వాస్తవానికి ప్రభుత్వ గణాంక సంస్థలు తమ విజయాలుగా తెలిపే లెక్కలను సాధారణంగా చాలామంది విశ్వాసంలోకి తీసుకోరు. ఆ లెక్కలను తమదైన పద్ధతిలో గణాంకాలను చూపుతారన్న అపవాదు కూడా ఉంది. ఏదేమైనా గతంలో ఈ గణాంక సంస్థలకు ప్రజల్లో, మేధావుల్లో, ఆర్థిక వేత్తల్లో గౌరవం ఉంది. ఎందుకంటే అవి చెప్పే గణాంకాలే సామాజిక అంశాలకు, ఇంకా అనేక అభివృద్ధి విషయాలకు ప్రామాణికంగా పరిగణిస్తారు. ఆర్థిక గణాంకాలు సమాజంలో మంచి పాత్రను పోషిస్తాయి. వాటినే రాజకీయాలకు అతీతంగా అందరూ వినియోగిస్తారు.

ఈ గణాంకాలపై ఆధారపడే ఆర్థిక, రాజకీయ పాలనావిధానాలను రూపొందిస్తారు. వాటిపై ఆధారపడే ప్రభుత్వ పనితీరును ప్రశ్నిస్తారు, తగు సూచనలు చేస్తారు, ప్రశంసిస్తారు. కాబట్టి ఈ డేటా సంస్థలపై ఎలాంటి ఆధిపత్యం, నియంత్రణ ఉండరాదు. గత చరిత్రలో గణాంకాలకు సంబంధించి ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన సందర్భాలున్నాయి. ఇప్పుడు ఆ సంప్రదాయాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కానీ ఈ మధ్యకాలంలో ప్రభుత్వం చెబుతున్న గణాంకాల విషయంలో అనేక ఆరోపణలు వచ్చాయి. గణాంకాలను తారుమారు చేసి తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే పారిశ్రామిక అభివృద్ధి, నిరుద్యోగం, ఉద్యోగ కల్పన, జీడీపీలపై ప్రభుత్వం వెల్లడించిన గణాంకాలన్నీ తప్పుడు లెక్కలని ప్రతిపక్షాలు ఆరోపించాయి.

మరోవైపు, ప్రస్తుత ప్రభుత్వం కొంతకాలంగా ఎలాంటి గణాంకాలను నమోదు చేయటం లేదన్నది ఇంకా తీవ్రమైంది. 1950-51 నుంచి ఏటా సీఎస్‌ఓ కేంద్రస్థాయిలో వివిధరంగాల గణాంకాలను ప్రచురిస్తోంది. కానీ 2006 నుంచి ఎంసీఏ డాటాను ప్రకటించటం లేదు. కానీ గతేడాది రెండు వేర్వేరు గణాంకాలను సీఎస్‌ఓ ప్రకటించింది. కానీ అవి ఒకదాని కొకటి పొంతనలేకుండా ఉన్నతీరు గమనార్హం. ఈ నేపథ్యంలోనే పారిశ్రామిక విధాన విభాగం (డీఐపీపీ) గణాంకాలను నమోదు చేయటమే మానేసింది. 2017 డిసెంబర్ వరకే డీఐపీపీలో గణాంకాలున్నాయి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేమంటే? ఎఫ్‌డీఐ పెట్టుబడులు ఇబ్బడిముబ్బడిగా వస్తున్నాయని ప్రభుత్వం చెప్పుకుంది. దానికి అనుగుణంగా గణాంకాలను మార్చినట్లు తేటతెల్లమవుతోంది. మేక్ ఇన్ ఇండియా విజయవంతమయ్యిందని చెప్పుకోవటానికి ప్రభుత్వం వ్యాపారానికి అనుకూల దేశాల్లో భారత్ మెరుగైన స్థానాన్ని సాధించిందని చెప్పుకుంది.

దానికి గాను ఈడీబీలో 2014లో 142వ స్థానంలో ఉన్న భారత్ 2018 నాటికి 78 స్థానానికి చేరుకుందని గొప్పలకు పోయింది. ఇదంతా ప్రభు త్వం నేర్పుగా అల్లిన అంకెల సౌధమే తప్ప మరేమీ కాదని తేలిపోయింది. ఎందుకంటే? పారిశ్రామికవృద్ధి లేకుండా మేక్ ఇన్ ఇండియా ఎలా విజయంవంతమవుతుందో ఏలికలకే తెలియాలి. ఇంకా ముఖ్య విషయం ఏమంటే? ఈ మధ్యనే క్రమం తప్పకుండా వెలువడే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే రిపోర్ట్‌ను 2018 డిసెంబర్‌లో విడుదల చేసింది. దాంట్లో తెలిపిన గణాంకాలు చూస్తే ప్రభుత్వ ఆలోచనను అర్థం చేసుకోవచ్చు. 2011-12 తర్వాత వెలువడిన ఈ సర్వేలో ఉద్యోగకల్పన విషయంలో భీతిగొలిపే విషయాలు వెలుగుచూశాయి.

ఈ క్రమంలోనే రెండు కోట్లకు పైచిలుకు ఉద్యోగాలను కల్పించామని ప్రభుత్వం చెప్పుకుంది. కానీ దానికి సంబంధించిన దాఖలాలేవీ కనిపించటం లేదన్నది వాస్తవం. దీన్నిబట్టి ప్రభుత్వం పద్ధతి ప్రకారం గణాంకాలను తనకు అనుకూలంగా మార్చుకుంటుందనీ, తయారుచేసుకుంటోందని అర్థమవుతోంది. ఇలాంటి ధోరణి రాజకీయంగా ఎలా ఉన్నా జాతీయంగా, అంతర్జాతీయంగా దేశ ఆర్థికవ్యవస్థ విశ్వసనీయతపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందనటంలో సందేహం లేదు. ఇప్పటికైనా సమయం మించిపోలేదు. దేశంలోని ప్రజాస్వామికవాదులు, ఆర్థికవేత్తలు, సామాజిక శాస్త్రవేత్తలు ఏకతాటిపైకి రావాలి. గణాంకాల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకించాలి.

ప్రభుత్వ రంగ గణాంక సంస్థలు, ప్రజా గణాంకాల విషయంలో ప్రభుత్వాల రాజకీయ ఆధిపత్యం, జోక్యాన్ని నిరసించాలి. గణాంక సంస్థల రాజ్యాంగబద్ధమైన స్వేచ్ఛను, సమగ్రతను సంరక్షించుకోవాలి. లేదంటే సామాన్య, మధ్యతరగతి ప్రజల జీవన పరిస్థితులు ఇంతకంటే మెరుగుపడే అవకాశం లేదు.