చంద్రబాబు హయాంలో రైతులకు మేలు జరగలేదు: ఆదాల

106

నెల్లూరు, మార్చి 19 (న్యూస్‌టైమ్): పార్టీ మారగానే నేతలు మాట మార్చడం సహజం. ఏ గూటి పక్షి ఆ గూడి పలుకే పలుకుతుందనడానికి మచ్చుతునకగా తాజా రాజకీయాలలో జంప్ జిలానీలను పేర్కొనవచ్చు. నిన్నమొన్నటి వరకూ తమ భుజస్కంధాలపై పెట్టుకుని కొనియాడిన నేతల్ని నేడు బజారున పడేసే ప్రయత్నం చేస్తున్నారు పార్టీలు మారిన నేతలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హయాంలో రైతులకు ఎటువంటి మేలు జరగలేదని నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి విమర్శించడం గమనార్హం.

ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు రైతు సంక్షేమానికి చిరునామా చంద్రబాబునాయుడేనని చెప్పేవారు. కోవూరు, రేబాలలో జరిగిన ఆత్మీయ సమావేశాల్లో మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి మాట్లాడారు. కోవూరులో దాదాపు 500 మంది పార్టీలో చేరగా రేబాలలో శివరామ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆదాల మాట్లాడుతూ పెన్నా, సంగం బ్యారేజీ పనులు పూర్తి కాలేదని, దీనికి కారణం చంద్రబాబునాయుడేనని వ్యాఖ్యానించారు. కోవూరు షుగర్ ఫ్యాక్టరీని 2004లో వైయస్ రాజశేఖర్ రెడ్డికి చెబితే ఎన్నికల తర్వాత తెరిపించారని గుర్తు చేశారు.

అదే చంద్రబాబు హయాంలో ఎన్నిసార్లు గుర్తుచేసిన షుగర్ ఫ్యాక్టరీ గురించి పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. టిడిపి అధికారంలోకి వచ్చాక ఒక్క పరిశ్రమ జిల్లాకు రాలేదని, కొత్త ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా రాలేదని ఎద్దేవాచేశారు. తను అల్లూరు నియోజకవర్గంలో గెలిచాక ఎక్కడ అవినీతికి పాల్పడకుండా ఈ ప్రాంత అవసరాలు తెలుసుకుంటూ ముందుకు సాగానని గుర్తుచేశారు. తాగు, సాగునీటి అవసరాలను తీర్చామని చెప్పారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి సహకారంతో ముత్తుకూరు ప్రాంతంలో పలు పరిశ్రమలను ఏర్పాటు చేసి 30 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని స్పష్టం చేశారు.

చంద్రబాబు హయాంలో మూడు సీట్లే వచ్చాయని నెల్లూరు జిల్లాపై కోపం పెంచుకున్నారని, అందుకే నిధులు సరిగా ఇవ్వలేదని ఆరోపించారు. ప్రజానేతలంటే ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలని అభిప్రాయపడ్డారు. వైయస్ జగన్ అధికారంలోకి వస్తే రైతులకు ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పేద రాష్ట్రం కాదని, ఏడు ఎనిమిది పోర్టులు, కృష్ణా, గోదావరి, పెన్నా డెల్టాలు ఉన్నాయని, ఆంధ్రులు చాలా తెలివైన వాళ్ళని ఆదాల పేర్కొన్నారు. రాష్ట్రానికి నిధుల కొరత లేదని, అందువల్ల నవరత్నాల అమలు కష్ట సాధ్యం కాదని తెలిపారు.

కార్యకర్తలు కొద్ది కాలం కష్టపడితే పార్టీ అధికారంలోకి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, కోటేశ్వర్ రెడ్డి, నరేంద్ర రెడ్డి, ఝాన్సీ సుబ్బారెడ్డి, విజయ భాస్కర్‌రెడ్డి, అల్లా బక్ష్, ద్వారక నాథరెడ్డి, సురా శ్రీనివాసులు, పుట్ట ధనలక్ష్మి, రామకృష్ణారెడ్డి, రమేష్‌బాబు, పెంచల నరసయ్య తదితరులు పాల్గొన్నారు.