స్థానికులకే పట్టం కట్టండి: గూడూరు ఎమ్మెల్యే

276

నెల్లూరు, మార్చి 19 (న్యూస్‌టైమ్): సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం విజయమే లక్ష్యంగా కార్యకర్తలు, నాయకులు పనిచేయాలని, ప్రజలకు ప్రభుత్వం చేసిన మంచి పనులను వివరించాలని ఆ పార్టీకి చెందిన నెల్లూరు జిల్లా గూడూరు ఎమ్మెల్యే ఇక్కడ పాశిం సునీల్‌కుమార్ పిలుపునిచ్చారు. స్థానికంగా తనను, రాష్ట్రంలో చంద్రబాబునాయుడు నాయకత్వాన్ని మరోసారి బలపర్చి సహకరించాలన్నారు.

రెండు ఓట్లలో స్థానికుడినైన ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు ఒకటి, ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మీకి మరొకటి వేసి గెలిపించాలని కోరారు. చిల్లకూరు మండలం ముత్యాలపాడు, నాంచారమ్మపేట గ్రామాల నుండి స్వచ్ఛందంగా విచ్చేసిన 100 కుటుంబాల వారిని తెలుగుదేశం పార్టీలోకి కండువా వేసి సాదరంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే వారినుద్దేశించి మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో పలుమార్లు మాట్లాడి తమ గ్రామాలలో కోట్ల రూపాయలతో తారు రోడ్డు, సిమెంటు రోడ్లను వేశారని, ఆ రుణం ఓటు రూపంలో తీర్చుకుంటామని పార్టీలోకి వచ్చిన వారు పేర్కొన్నారు.

‘‘మంచినీళ్ళు కొరకు బోర్లు వేయించి మోటార్లతో నీటిని అందించిన మిమ్మల్ని మేము మరువలేము. అందుకే మీకు అండగా నిలుస్తాం’’ అని అన్నారు. గూడూరు పట్టణంలోని 5వ వార్డులో మహిళా నాయకులతో కలిసి ఎమ్మెల్యే సతీమణి పాశిం సంధ్యారాణి స్థానికులతో మమేకమయ్యేందుకు ప్రయత్నించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, పరిశీలకులు కుమారస్వామి రెడ్డి, విష్ణురెడ్డి, జానకి రామిరెడ్డి, రమాదేవి, వెంకటరమణారెడ్డి, రామచంద్రయ్య, అమరనాథరెడ్డి, సురేష్, పట్టాభిరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, దిలీప్ రెడ్డి, నారాయణ, లింగారెడ్డి, జీవని, వెంకటేశ్వర్లు నాయుడు, నాగరాజు, గోపీచంద్, వేణురెడ్డి, రాజశేఖర్ రెడ్డి, రామ్మూర్తి, జిలానీ, రమేష్, భాస్కర్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, ప్రభాకర్, మునిశేఖర్, శ్రీనివాసులురెడ్డి, రఘురాంరెడ్డి, రాగయ్య, రామచంద్రారెడ్డి, నాగేశ్వరరావు, కృష్ణారెడ్డి, శీను తదితరులు పాల్గొన్నారు.