అందరికీ అందుబాటులోకి టీవీ: అమిత్ ఖ‌రే

141

న్యూఢిల్లీ, మార్చి 18 (న్యూస్‌టైమ్): సాంకేతిక‌ను అభివృద్ధి ప‌ర‌చుకుంటూ, టీవీ ప్ర‌సారాల‌ను అందరికీ అందుబాటులోకి తేవ‌డం, దూర‌ద‌ర్శ‌న్ ముందున్న స‌వాల‌ని కేంద్ర స‌మాచార, ప్ర‌సార మంత్రిత్వ శాఖ కార్యదర్శి అమిత్ ఖ‌రే అన్నారు. భారతదేశంలో ఉన్న భిన్న‌త్వాన్నీ, సామాజిక‌, ఆర్థిక వైవిధ్యాల‌ను ప‌బ్లిక్ బ్రాడ్‌కాస్ట‌ర్‌గా దూర‌ద‌ర్శ‌న్ త‌న కార్య‌క్ర‌మాల ద్వారా ప్ర‌సారం చేయాల‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. ప్ర‌సార కార్యక్ర‌మాల‌లో ‘స్పెక్ట్ర‌మ్’ను బాధ్య‌తాయుతంగా ఉప‌యోగించుకోవాల‌ని ఖ‌రే సూచించారు.

విశాల‌మైన భారతదేశంలో ‘స్పెస్ట్ర‌మ్’ను విద్యా వ్యాప్తికి ఉప‌యోగించాల‌ని ఆయ‌న సూచించారు. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, ప్రసార భారతి ఏర్పాటు చేసిన రెండు రోజుల బ్రాడ్‌కాస్టింగ్ కాంక్లేవ్‌ను సోమవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. బ్రాడ్‌కాస్టింగ్ రంగంలోని స‌వాళ్ళ‌నూ, అవ‌కాశాల‌నూ ఈ రంగం భ‌విష్య‌త్తునూ ఈ కాంక్లేవ్‌లో చ‌ర్చించ‌నున్నారు. సింగ‌పూర్‌, మ‌లేసియా, బంగ్లాదేశ్ మొద‌లైన దేశాల ప్ర‌తినిధులు ఈ స‌మావేశానికి హాజ‌ర‌య్యారు. దేశ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను నెర‌వేరుస్తూ, సాంకేతిక‌ను అభివృద్ధి ప‌ర‌చుకుంటూ ప్ర‌సార భార‌తి ‘ప‌బ్లిక్ బ్రాడ్ కాస్ట‌ర్’గా త‌న బాధ్య‌త‌ను నెర‌వేరుస్తోంద‌ని ప్ర‌సారభార‌తి ఛైర్మ‌న్‌ సూర్య ప్ర‌కాశ్ అన్నారు. ఈ రోజు మొద‌టి ‘ఇండియా ఇంట‌ర్నేష‌న‌ల్ బ్రాడ్‌కాస్ట్ కాంక్లేవ్’ను ప్రారంభిస్తూ ఆయన ప్రసంగించారు. ఒకప్పుడు రేడియో, టీవీలు మాత్ర‌మే ప్ర‌సార సాధ‌నాల‌నీ, ప్ర‌స్తుతం స‌మాచారం అనేక విధాల డిజిట‌ల్ ప‌ద్ధతుల‌లో లభ్య‌మ‌వుతోంద‌ని అన్నారు.

మ‌న దేశంలో ఏటా మీడియా, వినోద రంగాలు 13.4 శాతం అభివృద్ధి చెందుతున్నాయ‌నీ, ఒక అంచ‌నా ప్ర‌కారం 2021 నాటికి 33.6 బిలియ‌న్ డాల‌ర్ల రంగం గా అభివృద్ధి చెందుతాయ‌నీ అన్నారు. ఫిక్కీ – ఫ్రేమ్స్ నివేదిక ప్ర‌కారం టీవీ – వినోద రంగంలో అగ్ర స్థానాన ఉన్నా 2019లో డిజిట‌ల్ మాధ్య‌మాలు దీనిని దాటేస్తాయ‌ని అన్నారు. ప్ర‌సార మాధ్య‌మాల‌కు ‘కంటెంట్’ ఎంతో ముఖ్య‌మ‌నీ, స‌మాజంలో జ‌రిగే సంఘ‌ట‌న‌ల‌ను ప్ర‌సార సాధ‌నాలు త‌మ కార్య‌క్ర‌మాల‌లో చూపించాల‌ని ఆయ‌న అన్నారు. దూర‌ద‌ర్శ‌న్ డి.జి సుప్రియా సాహు, దూర‌ద‌ర్శ‌న్ న్యూస్ డిజి మాయాంక్ అగ‌ర్వాల్‌, కేంద్ర స‌మాచార‌, ప్ర‌సార మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రెట‌రీ అతుల్ తివారీ తదితరులు కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.