టీఆర్ఎస్ సత్తా చాటుదాం: కేటీఆర్

64

హైదరాబాద్, మార్చి 18 (న్యూస్‌టైమ్): తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు మరింత ఊపందుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి రాష్ట్రంలో బలం పుంజుకున్న తెరాసలోకి పంచాయతీ ఎన్నికల తర్వాత వివిధ పార్టీల నుంచి చేరికలు ఎక్కువయ్యాయి. తాజాగా సోమవారం వికారాబాద్, భూపాలపల్లి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గాలకు చెందిన పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కార్యక్రమంలో మంత్రులు మల్లారెడ్డి, వి. శ్రీనివాస్ గౌడ్, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

కొత్తగా పార్టీలో చేరిన వారిని సాదరంగా ఆహ్వానించిన కేటీఆర్ కేడర్‌ను ఉద్దేశించి మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆలోచన దేశానికి ఆచరణగా మారిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు ప్రజాప్రతినిధులపై ప్రజల్లో చులకనభావం ఏర్పడేలా చేస్తున్న చిల్లర విమర్శలు మానుకోవాలని సూచించారు. సీఎం కేసీఆర్ పాలన నచ్చి టీఆర్‌ఎస్‌లో చేరుతుంటే ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

పిచ్చివాడుగు మాని నేతలు పార్టీని వీడి టీఆర్‌ఎస్‌లో ఎందుకు చేరుతున్నారో, లోపం ఏమిటో ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. జరుగుతున్న పరిణామాలపై ప్రజలు ఏప్రిల్ 11న పార్లమెంట్ ఎన్నికల్లో తీర్పు ఇస్తారని చెప్పారు. రాజకీయాల్లో పార్టీలు మారడం సహజమని, టీఆర్‌ఎస్ నుంచి కూడా కాంగ్రెస్‌లో చేరారని గుర్తుచేశారు. ఇప్పుడు మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులు అప్పుడేం చేశారని ప్రశ్నించారు. తమ ఎంపీని, ఎమ్మెల్సీలను కాంగ్రెస్ నాయకులు చేర్చుకున్నారని, ఆ సమయంలో ప్రజాస్వామ్యాన్ని ఎంతకు కొన్నారు? అని తాము ప్రశ్నించలేదని గుర్తుచేశారు.

అమిత్‌షా కాంగ్రెస్ ఎంపీలకు కాషాయ కండువా కప్పుతున్నారని, బీజేపీ ఎంపీలకు రాహుల్ గాంధీ కాంగ్రెస్ జెండా కప్పుతున్నారని, మరి మీరు కూడా కొనుగోళ్ల పనిలో ఉన్నారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో జోష్ సచ్చిందని, సత్తువ లేదని ఆ పార్టీ ఎమ్మెల్యేలే అంటున్నారని చెప్పారు. కేంద్రం పోలవరానికి జాతీయహోదా ఇచ్చి, తెలంగాణలో ఒక్క ప్రాజెక్టుకు కూడా ఆ హోదా ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ 16 సీట్లు గెలిస్తే కేంద్రాన్ని యాచించే స్థితి నుంచి శాసించే స్థాయికి వస్తామని తెలిపారు. టీఆర్‌ఎస్ 16 సీట్లు గెలిస్తే మరో 116 మంది ఆయనకు తోడవుతారని చెప్పారు. ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని 16 నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వాలు వికారాబాద్‌ను నిర్లక్ష్యం చేశాయన్నారు.

వలసలు బంద్ కావాలన్నా, కరువు పోవాలన్నా సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే సాధ్యమవుతుందని చెప్పారు. కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ బీజేపీ పువ్వు పూజకు పనికిరాకుండా అయిందన్నారు. కొడంగల్‌లో టీఆర్‌ఎస్ చేతిలో ఓడిపోయిన అభ్యర్థి ఇప్పుడు మల్కాజ్‌గిరిలో పోటీచేస్తున్నారని, తమ తడాఖా చూపిస్తామని చెప్పారు. మాజీ స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడుతూ దేశాన్ని ముందుండి నడిపించడానికి సీఎం కేసీఆర్ ప్రణాళిక సిద్ధం చేశారన్నారు. ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి 16 సీట్లు గెలిచేలా కృషి చేయాలని సూచించారు. మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని రెండు లోక్‌సభ స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులే గెలిచేలా పనిచేస్తామన్నారు.

వికారాబాద్‌లో అన్ని పార్టీలు ఖాళీ అయ్యాయని, పాత, కొత్త తేడాలేకుండా అందరం కలిసి పనిచేయాలని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ సూచించారు. కాంగ్రెస్ నాయకులకు అధికార యావ తప్ప మరేం లేదని మన్నె క్రిశాంక్ విమర్శించారు. కాంగ్రెస్ లిమిటెడ్ కంపెనీగా మారిందని, తమ కుటుంబంలో చిచ్చు పెట్టారని పేర్కొన్నారు. తాను రాజీనామా చేస్తున్నానని రెండురోజులుగా చెప్పినా పీసీసీ అధ్యక్షుడు ఇప్పటివరకు తనతో మాట్లాడలేదన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, కోరుకంటి చందర్, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి జావత్ రామచంద్రు, కార్పొరేషన్ల చైర్మన్లు గ్యాదరి బాలమల్లు, వాసుదేవరెడ్డి, నాగేందర్‌గౌడ్, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి గట్టు రాంచందర్‌రావు, సహాయ కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, వరంగల్ జెడ్పీ మాజీ చైర్మన్ సాంబారి సమ్మారావు తదితరులు పాల్గొన్నారు.

అంతకముందు, తెలంగాణ భవన్‌లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్, రంగారెడ్డి డీసీఎంఎస్ మాజీ చైర్మన్ నర్సింహగుప్తాతోపాటు వికారాబాద్, కంటోన్మెంట్, భూపాలపల్లి నియోజకవర్గాల నుంచి వివిధ పార్టీలకు చెందిన నాయకులు పెద్ద ఎత్తున టీఆర్‌ఎస్‌లో చేరారు. కేటీఆర్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా, ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ మాజీ ఇన్‌చార్జి అనిల్ జాదవ్ టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. బుధవారం తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం అహరహం కృషిచేస్తున్న సీఎం కేసీఆర్ నాయకత్వంలో పనిచేసేందుకు నిర్ణయించుకున్నట్టు ఆయన తెలిపారు.