18 నుంచి నామినేషన్ల స్వీకరణ

96

మచిలీపట్నం, మార్చి 16 (న్యూస్‌టైమ్): ఈ నెల 18వ తేదీ నుండి నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎఎండి ఇంతియాజ్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో ఆయన ఎన్నికల నిర్వహణపై ప్రత్యేకించి సమావేశం నిర్వహించి బందరు పార్లమెంటు పరిధిలో జిల్లా కలెక్టరు ఆర్వోగా నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

ఈ నెల 19వ తేదీన ఉదయం 10 గంటలకు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం ర్యాండమైజేషన్ ఏర్పాట్లు చేయలన్నారు. ఆర్వోలకు ఇప్పటికే శిక్షణ ఇచ్చినట్లు తదుపరి పీవోలకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై ప్రతిరోజు నివేదిక ఇవ్వలన్నారు. జిల్లాలో ఈ నెల 15వ తేదీ ఉదయం వరకు 34,32,115 మంది ఓటర్లు ఉన్నారని, 15వ తేదీ ఒక్క రోజే జిల్లాలో 55,189 ఫారం-6 దరఖాస్తులు అందాయన్నారు.

జిల్లాలో స్వీప్ కార్యక్రమాలు కలెక్టరు వివరిస్తూ ఓటర్లను చైతన్యం పర్చుటకు 32 ప్రచార వాహనాల ద్వారా ప్రచారం నిర్వహించినట్లు, విజయవాడలో 15 అడుగుల ఈవీఎం నమూనా ఆవిష్కరించామని, వివిధ కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు, మానవహారాలు, ర్యాలీలు పెద్దఎత్తున నిర్వహించిన కారణంగా మీడియా సహకారంతో ఓటర్లలో అవగాహన పెంపొంది అనూహ్యింగా ఈ నెల 15వ తేదీన ఫారం-6 దరఖాస్తులు అత్యధికంగా వచ్చాయన్నారు. ముఖ్యంగా విజయవాడ నగరంలో గల 3 అసెంబ్లీ నియోజక వర్గాల్లో, పెనమలూరు, మైనలవరం, గన్నవరం నియోజక వర్గాల్లో అత్యధికంగా వచ్చాయన్నారు. మచిలీపట్నంలో 6 వేలు, గుడివాడలో 5 వేలు వచ్చాయన్నారు.

ఇప్పటి వరకు జిల్లాలో ఫారం -6 పెండింగ్ 1.50 లక్షలు కాగా ఈ నెల 25లోగా వీటిని పరిష్కరించాలన్నారు. ఈ నెల 18న నామినేషన్ల పర్వం మొదలుకానున్నదని జిల్లాకు సీనియర్ ఐఆర్ఎస్ అధికారులు 6 మంది వ్యయ పరిశీలకులు వస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 18న ఉదయం 11 గంటల నుండి నామినేషన్ల మొదలై 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ముగుస్తుందన్నారు. ఈ నెల 23,24 తేదిలు శెలవులు కారణంగా నామినేషన్ల స్వీకరణ ఉండదన్నారు.

అభ్యర్దులు గుర్తించుకోవలసిన విషయాలు కలెక్టరు వివరిస్తూ అభ్యర్దులు రిటర్నింగ్ వద్ద నుండి వాహనాలకు అనుమతులు తీసుకోవాలని అన్నారు. నామినేషన్లు వేసేటప్పుడు అభ్యర్దులు రిటర్నింగ్ అధికారి కార్యాలయ ఆవరణలో 3 వాహనాలకు మించి అనుమతి లేదన్నారు. రిటర్నింగ్ అధికారి ఛాంబరులో అభ్యర్దితో సహా 5 మందిని మాత్రమే అనుమతిస్తారని తెలిపారు. ఆర్వో ఛాంబరులో సీసీ కెమోరా పర్యవేక్షణ, వీడియో కవరేజ్ ఏర్పాటు చేసామన్నారు. అభ్యర్దులు పూర్తి సమాచారంతో రావాలని అన్నారు. ప్రమాణం తీసుకునేందుకు సిద్దంగా రావాలన్నారు.

అసెంబ్లీ నియోజక వర్గానికి 10 వేల రూ.లు, పార్లమెంటు నియోజక వర్గానికి 25 వేల రూ.లు చొప్పున సెక్యూరిటి డిపాజిట్ చెల్లించాలని, ఎస్.సి, ఎస్.టిలకు దీనిలో 50 శాతం డిస్‌కౌంటు ఉంటుందన్నారు. విజయవాడలో ఈ నెల 17 తేదీ ఉదయం 8 గంటలకు ప్రముఖ క్రీడాకారిణి పి.వి. సింథూతో ఓటర్ చైతన్యంపై పెద్ద ర్యాలీ మున్సిపల్ స్టేడియం నుండి ప్రారంభం అవుతుందని సాయంత్రం 6 గంటలకు విజయవాడ బెర్మ్ పార్కులో కవి సమ్మెళనం నిర్వహిస్తున్నట్లు దీనిలో కవులు పాల్గొని ఓటర్ల చైతన్యం గురించి కవితలు వినిపిస్తారన్నారు. జిల్లా కలెక్టరు ఎఎండి ఇంతియాజ్ శనివారం కలెక్టరేట్‌లో డిఇవో కార్యాలయ సమావేశపు హాలులో ఏర్పాటు చేసిన ఎన్నికల కంట్రోల్ కేంద్రాన్ని సందర్శించారు.

ఈ సందర్బంగా కలక్టరు మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు సి విజిల్ యాప్ ద్వారా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘణలపై ఇప్పటి వరకు 51 ఫిర్యాదులు వచ్చాయన్నారు. 1950 కాల్ సెంటరుకు 900 పైగా కాల్స్ వచ్చాయన్నారు. ఈ సమావేశంలో డిఆర్వో ఎ. ప్రసాద్, బందరు ఆర్‌డివో జె. ఉదయభాస్కరరావు, గుడివాడ ఆర్‌డివో జి. సత్యవాణి, డిప్యూటి కలెక్టర్లు చక్రపాణి, ఖాజావలి, కలెక్టరేట్ ఎవో మథూరి, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.