అమెరికాపై విరుచుకుపడిన డ్రాగన్

161

షెంజెన్, మార్చి 8 (న్యూస్‌టైమ్): అగ్రరాజ్యం అమెరికాతో వాణిజ్య పెద్దన్న డ్రాగన్ మరోమారు యుద్ధానికి తలపడుతోంది. చైనాకు చెందిన హువావే కంపెనీపై అమెరికా నిషేధం విధించింది. ఆ కంపెనీ ఉత్ప‌త్తుల‌ను వాడ‌రాదంటూ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. జాతీయ భ‌ద్ర‌త నేప‌థ్యంలో తాము ఈ చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు అమెరికా పేర్కొంది. అంతేకాదు త‌న మిత్ర దేశాలకు కూడా హువావే టెలిక‌మ్యూనికేష‌న్ ఉత్ప‌త్తుల‌ను వాడ‌రాదంటూ అమెరికా హెచ్చరించింది.

ఈ నేప‌థ్యంలో హువావే కంపెనీ అమెరికాపై దావా వేసింది. ప్రస్తుతం టెక్సాస్ కోర్టులో ఈ కేసు న‌మోదు చేసింది. ఫెడ‌ర‌ల్ ఏజెన్సీలు హువావే ఉత్ప‌త్తుల‌ను వాడ‌రాదంటూ అమెరికా నిషేధం విధించ‌డాన్ని ఆ కంపెనీ స‌వాల్ చేసింది. తమ ఉత్ప‌త్తుల్లో లోపం ఉన్న‌ట్లు అమెరికా నిరూపించ‌లేక‌పోయింద‌ని, చైనా ప్ర‌భుత్వంతోనూ త‌మ‌కు లింకులు లేవ‌ని హువావే చైర్మ‌న్ ఇటీవ‌ల షెంజెన్‌లో జ‌రిగిన వాణిజ్య సమావేశంలో వెల్ల‌డించారు. కానీ, అమెరికా మాత్రం ఆ ఉత్ప‌త్తుల‌ను నిషేధిస్తోంది.

త‌మ ఉత్ప‌త్తుల‌పై ప్ర‌జ‌ల్లో అమెరికా త‌ప్పుడు అభిప్రాయాల‌ను చేర‌వేస్తోంద‌ని, త‌మ కంపెనీ స‌ర్వ‌ర్ల‌ను హ్యాక్ చేస్తోంద‌ని హువావే చైర్మ‌న్ ఆరోపించారు. హువావే ఉత్ప‌త్తుల‌ను వాడ‌కూడ‌దంటూ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు కూడా త‌మ టెలికాం సంస్థ‌ల‌కు ఆదేశాలు జారీ చేశాయి. మొత్తానికి అగ్రరాజ్యం తీసుకున్న తాజా నిర్ణయం వాణిజ్య వర్గాలలో చర్చనీయాశం అయింది. ఈ నేపథ్యంలో చైనా ప్రభుత్వం ఇప్పటి వరకూ అధికారికంగా స్పందించలేదు.