గవర్నర్‌ను కలిసిన యాదాద్రి ఆలయ ఈవో గీతారెడ్డి

98

హైదరాబాద్, మార్చి 7 (న్యూస్‌టైమ్): తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌తో యాదాద్రి ఆలయ ఈవో గీతారెడ్డి రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలకు గవర్నర్‌ను ఈవో ఆహ్వానించారు.

శుక్రవారం నుంచి యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. గవర్నర్ నరసింహన్ దంపతులు స్వామివారి కల్యాణంలో పాల్గొననున్నారు. కాగా, జనహితుడు.. వరప్రదుడిగా నిత్య నీరాజనాలు అందుకుంటున్న యాదాద్రీశుడి జాతర ఆరంభానికి సమయం ఆసన్నమైంది. స్వయంభువులైన పంచనారసింహులు ఉత్సవ వేడుకలను పొందేందుకు సంసిద్ధులయ్యారు.

లోకసంరక్షకుడి వార్షికోత్సవ సంబరాల నిర్వహణకు పూజారులంతా సంప్రదాయ ఏర్పాట్లతో సిద్ధమయ్యారు. ఆలయ నిర్వాహకులు, ఉద్యోగులు తమ వంతు బాధ్యతలను నెరవేర్చేందుకు కంకణబద్ధులు కాగా ప్రభుత్వ శాఖలు సహకారమందించి జయప్రదం చేయాలని నిర్ణయించాయి. తొలిపూజకు ఆలయ పూజారులు ముహూర్తాన్ని ఖరారు చేశారు. మహావిష్ణువు సర్వసేనాధిపతి విష్వక్సేనుడిని ఆరాధిస్తూ ఎలాంటి ఆటంకాలు కలుగకుండా పూజారులు, యాజ్ఞికులు ప్రత్యేక పూజలు చేపడుతారు. పాంచరాత్ర ఆగమం పాటించే ఆలయాల్లో తొలి పూజను విష్వక్సేనుడికి నిర్వహించడం సంప్రదాయం. అగ్ని ప్రతిష్ఠ జరిపి జలపూజ చేస్తారు. పూజించిన జలంతో పుణ్యవాచనం నిర్వహిస్తారు. ఈ తతంగాన్ని స్వస్తివాచనం అంటారని ప్రధాన పూజారి వెల్లడించారు.

11 రోజుల పాటు జరిగే ఉత్సవ వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. బాలాలయంలో యాగశాల నిర్మించారు. అలంకార వేడుకలకు వాహనాలకు మెరుగులు దిద్దారు. తీర్థజనులకు ఇక్కట్లు కలగకుండా సదుపాయాల కల్పనకు అధికారులు దృష్టి కేంద్రీకరించారు. ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖలు జాతరకు వచ్చే జనానికి ఇక్కట్లు కలగకుండా తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహించేందుకు నడుంబిగించాయి. అగ్నిమాపక, పోలీసు యంత్రాంగం, వైద్య ఆరోగ్యశాఖలతో పాటు మున్సిపల్‌ అధికారులు సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధమయ్యారు.

జగత్‌రక్షకుడైన శ్రీ స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని ఆశీర్వచనాలు పొందాలని యాదాద్రి ఆలయ నిర్వాహకులు రాష్ట్రాధినేతలకు ఆహ్వానాలు అందజేశారు. రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ను గురువారం కలిసి ఉత్సవ ఆహ్వాన పత్రికతోపాటు దేవుడి ప్రసాదాన్ని అందజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను, జిల్లా మంత్రి జగదీష్‌రెడ్డిని కలిసి ఆహ్వానపత్రికను అందజేశారు. ఇతర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సైతం పత్రికలను అందజేస్తామని ఈవో వెల్లడించారు. ప్రధానాలయ పునర్నిర్మాణ పనులు జరుగుతున్నందున శ్రీ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను బాలాలయంలోనే చేపడుతున్నామని ఈవో గీతారెడ్డి తెలిపారు. బాలాలయంలో ఉత్సవాలను నిర్వహించడం ఇది మూడోసారి అన్నారు.

తీర్థజనులకు ఎలాంటి ఇక్కట్లు కలగకుండా తగు ఏర్పాట్లు, జాగ్రత్తలు చేపడుతున్నామన్నారు. భక్తులు, స్థానికులు సహకరించాలని కోరారు. యాదాద్రి క్షేత్రంలో తీర్థజనులకు వైద్యసదుపాయాలు అందించేందుకు శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఉచిత శిబిరాలను నిర్వహిస్తుంది. ఉత్సవాలు మొదలయ్యే నాటి నుంచి ఐదురోజులపాటు శిబిరాలు నిర్వహిస్తామని ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు. తొలిరోజు ఉచిత కంటివైద్య శిబిరాన్ని చేపడుతారు.

మరోవైపు, ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా శుక్రవారం నుంచి 18 వరకూ నిత్యహోమం, కల్యాణోత్సవ పర్వాలను రద్దుపరిచామని దేవస్థానం కార్యనిర్వహణ అధికారి గీతారెడ్డి వెల్లడించారు. 11 రోజులపాటు కొనసాగనున్న బ్రహ్మోత్సవ వేడుకల నిర్వహణకు భక్తులు నిర్వహించే శ్రీ సుదర్శ నారసింహహోమం, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవాలు నిర్వహించబడవన్నారు. ఆర్జిత, శాశ్వత భక్తులు సహకరించాలని కోరారు.