దొంగలే దొంగన్నట్టుంది!

75
  • ఐటీ గ్రిడ్స్‌ కేసుపై చంద్రబాబు

  • తెరాసతో కలిసి జగన్ నాటకం

  • డేటా దొంగిలించిన వారే కేసులు

  • ఓట్లు సరిచూసుకోవాలని పిలుపు

  • మోసగాళ్ల పట్ల అప్రమత్తం: క్యాడర్‌కు పిలుపు

  • దర్యాప్తులో ఏపీ పోలీసుల వేట

  • దరఖాస్తుదారుల గుర్తింపుపై దృష్టి

  • ఐపీ చిరునామాల కోసం సీడాక్‌కు లేఖ

అమరావతి, మార్చి 7 (న్యూస్‌టైమ్): ‘ఐటీ గ్రిడ్స్‌’ కేసులో తెలుగుదేశాన్ని దోషిగా నిలిపేందుకు తెలంగాణలోని అధికార పార్టీతో కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌‌మోహన్‌రెడ్డి కుట్రచేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అనుమానం వ్యక్తంచేశారు. ‘‘దొంగలే దొంగన్నట్టుంది. తెరాసతో కలిసి జగన్ నాటకాలు ఆడుతున్నారు. డేటా దొంగిలించిన వారే తిరిగి తమ తప్పిదాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఎదురు కేసులు పెడుతున్నారు. జగన్ దురాగతం వల్ల ఓట్లు కోల్పోయిన వారు తమ ఓటు ఉందోలేదో సరిచూసుకోవాలి.

మోసగాళ్ల పట్ల తెదేపా క్యాడర్‌ అప్రమత్తంగా ఉండాలి’’ అని వ్యాఖ్యానించారు. అమరావతి నుంచి గురువారం పార్టీ కేడర్‌తో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లోను, అనంతరం మీడియా సమావేశంలోనూ చంద్రబాబు మాట్లాడుతూ ఐటీ గ్రిడ్స్ కేసు కేవలం కుట్రపూరితమన్నారు. ‘‘కేసీఆర్, జగన్ మాయా రాజకీయం మన రాష్ట్రంలో చెల్లదు. హైదరాబాద్‌లో మనపై కేసులు పెట్టిస్తున్నారు. మన డేటా దొంగిలించి ఓట్లు వేయాలని మనకే ఫోన్లు చేస్తున్నారు’’ అని ధ్వజమెత్తారు. తమకు ఓట్లు వేయాలని వైకాపా నుంచి ఫోన్లు చేసేవారిని నిలదీయాలని క్యాడర్‌కు చంద్రబాబు పిలుపునిచ్చారు.

తమ నెంబర్ ఎవరిచ్చారని వారిని ప్రశ్నించాలని సూచించారు. తెదేపా డేటా ఎందుకు చోరీ చేశారని నిగ్గదీయాలని, దొంగలకు ఓట్లు ఎందుకు వేస్తామని ధైర్యంగా చెప్పాలని దిశానిర్దేశం చేశారు. దేశంలో అన్నిపార్టీలకు యాప్‌లు ఉన్నాయని, కానీ తెదేపా యాప్‌పైనే దుష్ప్రచారానికి తెగబడ్డారని దుయ్యబట్టారు. ఏపీపై వైకాపా, తెరాస, భాజపా కుట్రల మీద కుట్రలు చేస్తున్నాయని చంద్రబాబు ఆక్షేపించారు. ఏపీలో ఓట్ల తొలగింపు వెనుక ఆ మూడు పార్టీ మోసం దాగి ఉందన్నారు. ఫారం-7 దుర్వినియోగం చేశానని జగనే స్వయంగా చెప్పారని, తొలిదశలో 13 లక్షల ఓట్ల తొలగింపునకు కుట్ర పన్నారని సీఎం ఆరోపించారు. 2 వేల మంది వైకాపా వాళ్లే 8 లక్షల దరఖాస్తులు పెట్టారని, 59 లక్షల ఓట్ల తొలగింపు సూత్రధారి జగనేనని ఆయన స్పష్టంచేశారు. సకాలంలో వేగంగా స్పందించి, ఈ కుట్రలను అడ్డుకున్నామని సీఎం తెలిపారు. డ్వాక్రా మహిళలు అందరికీ ఈ రోజు మరో శుభదినమని సీఎం చంద్రబాబు అన్నారు.

పసుపు-కుంకుమ కింద రెండో విడత చెల్లింపులు జమ చేస్తున్నట్లు తెలిపారు. ఒక్కో మహిళ ఖాతాలో ఈరోజే రూ.3,500 జమ అవుతాయని, రేపు మహిళా దినోత్సవం రోజే అందరికీ నగదు అందనుందన్నారు. మహిళలకు మరో కిస్తీ రూ.4 వేలు త్వరలోనే చెల్లిస్తామని ప్రకటించారు. మరోవైపు, ఓటు దొంగల్ని గుర్తించేందుకు ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు వేట మొదలుపెట్టారు. అర్హులైన ఓటర్ల పేర్లను జాబితా నుంచి గల్లంతు చేయించాలనే ఉద్దేశంతో కొంతమంది మోసపూరితంగా ఆన్‌లైన్‌లో ఫారం-7దరఖాస్తులు చేశారంటూ ఎన్నికల సంఘం అధికారులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మోసపూరితంగా ఫారం-7 దరఖాస్తులు పెట్టిన ఘటనలపై బుధవారం వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 322 కేసులు నమోదు కాగా అందులో 235 కేసుల్లో 2,300 మంది దరఖాస్తుదారులను పోలీసులు గుర్తించారు. మిగతా కేసుల్లో ఉన్నదెవరో తేల్చే పనిలో పోలీసులున్నారు.

వీలైనంత వేగంగా కేసుల దర్యాప్తును కొలిక్కొ తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తన ఓటు తొలగించాలని కోరుతూ ఓటరు స్వతహాగా గానీ లేదా ఎవరైనా గ్రామంలో మృతిచెందిన వారి ఓట్లు, ఒకే పేరుతో జాబితాలో రెండుసార్లున్న పేర్లు, స్థానికంగా నివాసం ఉండని వారి పేర్లు తొలగించాలని కోరుతూ ఫారం-7 దరఖాస్తు చేయచ్చు. కేంద్ర ఎన్నికల సంఘం నేషనల్‌ ఓటరు సర్వీసు పోర్టల్‌ వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసి దాని ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తోంది.

ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేయాలన్న ఉద్దేశంతో గత పది రోజుల వ్యవధిలో 8.74 లక్షల ఫారం-7 దరఖాస్తులు ఎన్నికల సంఘానికి అందాయి. ఒకేసారి ఇన్ని లక్షల సంఖ్యలో దరఖాస్తులు రావటాన్ని అనుమానించిన ఎన్నికల సంఘం క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టింది. ఆయా గ్రామాల్లోని ఒకరో ఇద్దరో వ్యక్తులు వారి పేరిట ఈ నకిలీ దరఖాస్తులు చేసినట్లు విచారణలో తేలింది. దీంతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఎక్కడికక్కడ పోలీసుస్టేషన్లలో స్థానిక తహసీల్దార్లు ఫిర్యాదులు చేశారు. ఓట్ల తొలగింపునకు వచ్చిన లక్షల మోసపూరిత దరఖాస్తులన్నీ ఆన్‌లైన్‌లో ఎన్నికల సంఘానికి అందాయి. ఈ నేపథ్యంలో అవి ఏ ఐపీ చిరునామాల ద్వారా అందాయో వివరాలివ్వాలని కోరుతూ పోలీసులు ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.

ఆ ఐపీ చిరునామాలు ఇవ్వాలంటూ ఎన్నికల సంఘం ఇప్పటికే సీడాక్‌కు లేఖ రాసింది. వందల సంఖ్యలో వచ్చిన ఈ కేసుల దర్యాప్తులో ఈ ఐపీ చిరునామాలే కీలకం కానున్నాయని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఏ ఐపీ చిరునామా నుంచి ఎన్ని గంటల సమయంలో ఎన్ని దరఖాస్తులు వచ్చాయనేది దాని ఆధారంగా తేలనుంది. ఆ సమాచారాన్ని విశ్లేషించుకుని మోసపూరితంగా దరఖాస్తులుచేసిన వారిని గుర్తిస్తారు. కాగా, ఐటీ గ్రిడ్స్‌ డేటా కేసులో ఏర్పాటైన తెలంగాణలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) కార్యాచరణను సిద్ధం చేసుకుంటోంది.

ఈ మేరకు ఆ బృందానికి నేతృత్వం వహిస్తున్న ఐజీ స్టీఫెన్‌ రవీంద్ర నేతృత్వంలో డీజీపీ కార్యాలయంలో గురువారం సిట్‌ సమావేశమైంది. 9 మందితో కూడిన ఈ బృందానికి ఇదే తొలి సమావేశం కాగా ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి సేకరించిన వివరాలను సైబరాబాద్‌, హైదరాబాద్‌ పోలీసులు సిట్‌కు అందజేస్తారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా మూడు బృందాలుగా విడగొట్టేందుకు స్టెఫెన్‌ రవీంద్ర నిర్ణయించారు. ప్రధానంగా ఈ కేసులో డేటా ఎక్కడికి వెళ్లింది? దాన్ని ఎలా రికవరీ చేయాలనే దానిపై ఒక బృందం కీలకంగా వ్యవహరించనుంది. మరోవైపు, ఈ కేసులో ప్రధాన నిందితుడైన అశోక్‌ కోసం గాలింపు చేపట్టేందుకు మరో బృందం, అనుమానితులు, సాక్షుల విచారణ కోసం మరో బృందాన్ని ఏర్పాటుచేశారు. దీంతో పాటు డేటా విషయమై అమెజాన్‌, గూగుల్‌ సంస్థలకు సిట్‌ లేఖ రాసింది.