ఫోక్స్‌వాగ‌న్‌కు రూ. 500 కోట్ల జ‌రిమానా

82

న్యూఢిల్లీ, మార్చి 7 (న్యూస్‌టైమ్): ప్రపంచ ప్రఖ్యాత కార్ల తయారీ సంస్థ ‘ఫోక్స్‌వాగన్‌’కు గట్టిదెబ్బే తగిలింది. ఇన్నాళ్లూ తనను ఎదిరించేవారే లేరని విర్రవీగిన ‘ఫోక్స్‌వాగన్‌’ యాజమాన్యం భారీ జరిమానా చెల్లించకతప్పని పరిస్థితి ఎదురైంది. సంస్థ‌పై గురువారం నేషనల్ గ్రీన్ ట్రిబ్యున‌ల్ 500 కోట్ల రూపాయల భారీ జ‌రిమానా విధించింది. ప‌ర్యావ‌ర‌ణానికి హాని చేసే డివైస్‌ల‌ను డీజిల్ కార్ల‌లో వాడిన‌ట్లు ఆ సంస్థ‌పై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. రెండు నెలల్లో జ‌రిమానా మొత్తాన్ని కేంద్ర కాలుష్య నంయత్రణ మండలికి చెల్లించాలని ఎన్జీటీ న్యాయస్థానం ఆదేశించింది. ఎమిష‌న్ సూత్రాల‌ను ఉల్లంఘించిన ఫోక్స్‌వాగన్ సంస్థ‌పై కేసు వేశారు. ఆ కంపెనీ వాహ‌నాల‌ను అమ్మ‌రాదంటూ ఆ పిటిష‌న్‌లో కోరారు.

దీనిపై గురువారం ఎన్జీటీ కోర్టు విచార‌ణ చేప‌ట్టింది. ఫోక్స్‌వాగ‌న్‌ కంపెనీ డీజిల్ కార్ల ఉద్గార పరీక్షల సమయంలో మోసపూరిత పరికరాన్ని సంస్థ వాడిందన్న కేసులో ట్రిబ్యునల్ గ‌తంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సంస్థ చేసిన ఈ పని వల్ల పర్యావరణానికి కలిగిన అసలు నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర పర్యావరణ, భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖలు, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్‌లతో ఓ కమిషన్‌ను ఎన్‌జీటీ చైర్‌పర్సన్ జస్టిస్ ఆదర్శ్ కుమార్ ఏర్పాటు చేశారు.

నెల రోజుల్లో ఈ కమిటీ నివేదిక సమర్పించాలని ఎన్‌జీటీ ఆదేశించింది. ఈ కేసులో విచారణ చేపట్టిన ట్రైబ్యూనల్‌ నష్ట నివారణ చర్యల కింద కేంద్ర కాలుష్య నియంత్రణ మండలికి రూ.100 కోట్లు జమ చేయాలని గతంలోనే ఆదేశించింది. కేసు దర్యాప్తు నిమిత్తం కాలుష్య నియంత్రణ మండలి, భారీ పరిశ్రమల శాఖ, నేషనల్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరింగ్‌ రీసర్చ్‌ ఇనిస్టిట్యూట్‌, ఆటోమేటివ్‌ రీసర్చ్‌ అసోసియేషన్ ఆఫ్‌ ఇండియా ప్రతినిధులతో ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. వీరి నుంచి సిఫార్సులు తీసుకున్న అనంతరం పర్యావరణాన్ని కలుషితం చేసినందుకుగానూ ఫోక్స్‌వ్యాగన్‌కు రూ. 500 కోట్ల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది.