అటల్ ఇన్నోవేషన్ మిషన్‌కు రూ.1000 కోట్లు

44
  • అధ్యాపకుల నియామకంలో రిజర్వేషన్లకు అనుమతి

  • ఎస్ఈబీఎల్ ఆర్డినెన్స్‌కు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా

న్యూఢిల్లీ, మార్చి 7 (న్యూస్‌టైమ్): సమీపిస్తున్న సార్వత్రిక ఎన్నికలకు కేంద్రంలోని ఎన్డీయే సర్కారు పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా దొరికిన ఏ అవకాశాన్నీ వదులుకోకుండా వివిధ వర్గాలపై వరాల జల్లు కురిపిస్తోంది. న్యాయపరమైన అడ్డంకులు ఎదురైన అంశాలలో ఆర్డినెన్స్‌‌లు తీసుకువచ్చేందుకూ వెనుకాడడం లేదు. విశ్వ విద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల్లో అధ్యాపకుల నియామకంలో ఎస్సీ, ఎస్టీ, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులు (ఎస్‌ఈబీఎల్) వారికి రిజర్వేషన్లు కల్పించడానికి తీసుకురావాల్సిన ఆర్డినెన్స్ ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఉన్నత విద్యాసంస్థల్లో ఇంతకు ముందు అమల్లో ఉన్న 200 పాయింట్ల రోస్టర్ ఆధారిత రిజర్వేషన్ విధానాన్ని పునరుద్ధరించడానికి ఆర్డినెన్స్ తీసుకురానున్నారు.

గతంలో ఓ విభాగం లేదా సబ్జెక్టును ఒక యూనిట్‌గా గుర్తిస్తూ రిజర్వేషన్లు అమలు చేసేవారు. కానీ, దీనిని మార్చి యూనివర్సిటీ లేదా కాలేజీని ఒక యూనిట్‌గా గుర్తిస్తూ రిజర్వేషన్లను అమలు చేయనున్నారు. గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఇక్కడ భేటీ అయిన కేంద్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. ప్రతిష్ఠాత్మక అటల్ ఇన్నోవేషన్ మిషన్‌ను 2019-20 ఆర్థిక సంవత్సరంలో కూడా కొనసాగించడానికి సంబంధించిన రూ.1000 కోట్ల కేటాయించాలన్న ప్రతిపాదనకు కూడా కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సమావేశం అనంతరం కేంద్ర మంత్రులు అరుణ్‌జైట్లీ, పీయూష్‌ గోయల్ విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ఉన్నత విద్యాసంస్థల్లో అధ్యాపకుల నియామకం సందర్భంగా ఎస్సీ, ఎస్టీ, ఎస్‌ఈబీఎల్‌లకు రిజర్వేషన్లు కల్పించడానికి ఉద్దేశించి ఆర్డినెన్స్ తీసుకురావడానికి సంబంధించిన ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందన్నారు.

కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల ఉన్నత విద్యా సంస్థల్లో ఖాళీగా ఉన్న 5000 అధ్యాపక పోస్టులను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయడానికి అవకాశం ఏర్పడిందని తెలిపారు. అధ్యాపకుల పోస్టులను భర్తీ చేసేటప్పుడు రిజర్వేషన్లను అమలు చేయడానికి యూనివర్సిటీ లేదా కాలేజీని ఒక యూనిట్‌గా గుర్తించాలని, ఇందుకుగాను ఆర్డినెన్స్ తీసుకురావాలని కోరుతూ గతంలో విద్యార్థులు, ఆధ్యాపకులు ఆందోళనలు చేపట్టారని గుర్తు చేశారు. వారి ఆందోళనలను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావడానికి సంబంధించిన ప్రతిపాదనకు ఆమోదం తెలిపిందని కేంద్రమంత్రులు వివరించారు. అటల్ ఇన్నోవేషన్ మిషన్ పథకం కింద పాఠశాల విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచన, ఆవిష్కరణల దృక్కోణాన్ని పెంపొందించడానికి సంబంధించిన ప్రయోగశాలలను కూడా విస్తరించాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది.

ఈ ప్రయోగశాలలకు ప్రభుత్వం తొలి ఏడాది రూ.12 లక్షల చొప్పున మంజూరు చేస్తుంది. అనంతరం నిర్వహణ కోసం నాలుగేళ్ల పాటు ఏటా రూ.2 లక్షల చొప్పున విడుదల చేస్తుంది. దేశవ్యాప్తంగా 5,441 ప్రయోగశాలలను ఎంపిక చేసిన కేంద్రం ఇప్పటికే 2171 ప్రయోగశాలలకు నిధులు మంజూరు చేసింది. అలాగే దేశవ్యాప్తంగా 101 అటల్ ఇంక్యుబేషన్ సెంటర్లను (ఏఐసీ)కూడా ఎంపిక చేసిన కేంద్రం ఇందులో 31 ఏఐసీలకు నిధులను విడుదల చేసింది.