ఎన్నికల కోడ్ నేపథ్యంలో కలెక్టర్ సమీక్ష

115

ఆర్వోలతో ప్రద్యుమ్న వీడియో కాన్ఫ‌రెన్స్

చిత్తూరు, మార్చి 7 (న్యూస్‌టైమ్): ఎన్నికల కోడ్ రానున్న నేపథ్యంలో అన్ని టీమ్‌లు సన్నద్ధంకావాలని చిత్తూరు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి పి.ఎస్. ప్రద్యుమ్న సూచించారు. ఈ నెల 8న సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటన వెలువడే అవకాశం ఉన్నందున వెంటనే కోడ్ అమల్లోకి వస్తుందని, కావున జిల్లా స్థాయి మొదలు పోలింగ్ బూత్ స్థాయి వరకు అన్ని టీమ్‌లు సర్వసన్నద్ధంగా ఉండాలని ఆర్ఓల వీడియో కాన్ఫరెన్స్ సమీక్షా సమావేశంలో కలెక్టర్ ఆదేశించారు.

గురువారం నాడు కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఆర్ఓలు, అన్ని టీమ్లు, సెక్టోరల్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ మాట్లాడుతూ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నికల విధులలో పాల్గొంటున్న అధికారులు, సిబ్బంది అందరూ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా వ్యవహరించి మోడల్ కోడ్ అమలులో ఈసీఐ నిబంధనల మేరకు అమలు చేయడంతో పాటు అధికారులు కూడా అప్రమత్తంగా ఉంటూ ఎన్నికల కోడ్‌ను అతిక్రమించకుండా ఉండాలని తెలిపారు. అదే విధంగా, మోడల్ కోడ్‌లో భాగంగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటన వెలువడిన మరు క్షణం నుండి రాజకీయ నాయకుల పోస్టర్లు, ఫోటోలు, ఫ్లెక్సీలు, హోర్డింగులు తొలగించాలన్నారు.

ఎన్నికల వ్యయ పరిశీలన బృందాలు, ఫ్లైయింగ్ స్కోడ్స్, స్టాటిక్ నిఘా బృందాలు, వీడియో నిఘా బృందాల సహా సెక్టోరల్ అధికారులు వంద శాతం వారి విధులను నిర్వహించాలన్నారు. సెక్టోరల్ అధికారులు వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలను ఎన్ని పరిశీలించినది నియోజక వర్గాలవారీగా సమీక్షస్తూ పోలీస్ శాఖతో సమన్వయం చేసుకోవాలన్నారు. 3 బెస్ట్ పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేయాలని, ఈ పోలింగ్ కేంద్రాల ఫోటోల సేకరణను డిడి బిసి వెల్ఫేర్ అధికారి చూడాలన్నారు.

అలాగే ఓటరు క్లెయిమ్స్‌ను ఈసీఐ మార్గదర్శకాల ప్రకారం సత్వరమే వందశాతం ఈఆర్ఓలు, ఏఈ ఆర్ఓల ద్వారా పగడ్బందీగా పరిష్కరింపచేయాలని ఆదేశించారు. ఎన్నికల పోస్టర్లను విస్తృతంగా ప్రదర్శింపచేయాలని ఆర్ఒలను కలెక్టర్ ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా స్థాయి నోడల్ అధికారులు కూడా పాల్గొన్నారు.