స్థానిక సంస్థల నిధుల కేటాయింపుపై సమీక్ష

12

హైదరాబాద్, మార్చి 7 (న్యూస్‌టైమ్): రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు ఇంత వరకూ ప్రభుత్వం కేటాయించిన నిధులు, వాటి వినియోగంపై సెషల్ ఆడిట్ తప్పనిసరని తెలంగాణ ఆర్ధిక కమిషన్ చైర్మన్ జి.రాజేశంగౌడ్ పేర్కొన్నారు. ఇక్కడి ఎర్రమంజిల్‌లోని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక కమిషన్ కార్యాలయంలో గురువారం ఆయన నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ పంచాయతీ రాజ్ సంస్థలకు 2014-15 నుండి 2017-18 సంవత్సరాలకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు స్థానిక ప్రభుత్వాలకు ఇచ్చిన నిధులు, పన్నుల ఆదాయ వివరాలపై సెస్స్ (సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్) అధ్యయనం చేసి సమర్పించిన డ్రాఫ్ట్ రిపోర్ట్ మీద చర్చించడం చర్చించారు.

ఈ సమావేశంలో ఆర్ధిక కమిషన్ సభ్యుడు యం.చెన్నయ్య, కమిషన్ మెంబర్ సెక్రెటరీ సురేష్ చందా, ఆర్థిక మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు, రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, కార్యదర్శి నీతూకుమారి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

సెస్స్ (సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్) అధ్యయన డ్రాఫ్ట్ రిపోర్ట్‌ను సమావేశంలో చర్చకు ప్రవేశ పెట్టారు. వారు అధ్యయనం చేసిన రాష్ట్రంలోని ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలలోని 10 మండలాలు, 20 గ్రామ పంచాయతీలను ఎన్నుకొని వాటి ఆర్థిక స్థితిగతులపై విశ్లేషించిన అంశాలను ప్రధానంగా చర్చించారు.

రాష్ట్ర ప్రభుత్వ నిధులు కనీస అవసరం మేరకు విడుదల చేసినప్పటికీ స్థానిక సంస్థల స్వంత వనరుల ఆదాయం తక్కువ వున్నట్లు అధ్యయనంలో తెలిపినందున స్వంత వనరుల ద్వారా సమకుర్చుకొనే ఆదాయంలో గ్రామ పంచాయతీలు వాటి పరిధిలోని వృత్తిపన్ను, ఇంటిపన్ను, సంతలు మొదలగు అవకాశాలను బట్టి మేరుగుపరచుకొనవలసి ఉందని కమిషన్ అభిప్రాయపడింది. వైద్య ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, సాగునీటి పారుదల శాఖలు నేరుగా కాకుండా పంచాయతీ రాజ్ సంస్థల అధీనంలో ప్రత్యక్ష పర్యవేక్షణ పనిచేయాల్సిన అవసరం వుందని, గత 30 సంవత్సరాల కింద నిర్ణయించిన ఫార్ములా ప్రకారం (పర్ క్యా పిటా) తలసరి గ్రాంటు నిధులు పంచాయతీ రాజ్ సంస్థలకు అర్థిక సంవత్సరాలలో 4 క్వార్టర్లు పూర్తిగా విడుదల కావటం లేదని పేర్కొంది. (పర్ క్యా పిటా) తలసరి గ్రాంటు నిధుల కేటాయింపు పెరిగిన జనాభా ప్రకారం పెంచవలసిన అవసరం వుందని తెలిపింది.

గ్రామ పంచాయతీలకు ఒకే కార్యదర్శి 3-4 గ్రామ పంచాయితీలకు వుండడం వలన గత 4 సంవత్సరాలలో ఆశించినంత వరకు పన్నుల వసూలు కానీ ఇతర పనుల ప్రగతిని సాధించడంలో ఇబ్బందులు ఎదుర్కొనడం గమనించినట్లు వివరించింది. జిల్లా మినరల్ ఫండ్ పంచాయతీ రాజ్ సంస్థల అధీనంలో ప్రత్యక్ష పర్యవేక్షణ పనిచేయాల్సిన అవసరం వుందని అభిప్రాయపడింది.

పంచాయతీ రాజ్ సంస్థల స్టాండింగ్ కమిటిల సిఫార్సులను సర్వ సభ్య సమావేశంలో చర్చించి సమర్థవంతంగా అమలు కావాల్సిన అవసరం వుందని, సమాంతర శాఖలు (లైన్ డిపార్ట్మెంట్)లపై పంచాయతీ రాజ్ స్థానిక సంస్థల అజమాయిషీ కొరవడడం జరుగుతోందని తెలిపింది. పంచాయతీ రాజ్ స్థానిక సంస్థలలో సరిపోయే అధికార గణం అందుబాటులో లేకపోవడం ముఖ్యమైన పోస్టులలో తాత్కాలికంగా అధికారులను ఇతర శాఖల నుండి తీసుకోవడం వలన ఆశించిన అభివృద్ధి కనిపించడం లేదని సెస్స్ అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు. పంచాయతీ రాజ్ స్థానిక సంస్థలకు అధికార వికేంద్రికరణలో తెలంగాణ రాష్ట్రం ఇంకను ముందంజ వేయవలసి వుందని విశ్లేశించింది.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు బాపూజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాధించేందుకు నూతన పంచాయతీ రాజ్ చట్టం,2018ను ప్రవేశపెట్టడం జరిగిందని ఆర్థిక కమిషన్ చైర్మన్ జి.రాజేశం గౌడ్ తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక కమిషన్ మధ్యంతర నివేదికలో తెలిపిన నిధుల కన్నా పంచాయతీ రాజ్ స్థానిక సంస్థలకు ఎక్కువ నిధులను అనగా కేంద్ర ఆర్థిక సంఘం గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.లు.1629 కోట్లు, పట్టణ స్థానిక సంస్థలకు రూ.లు.1029 కోట్లు కేటాయించగా, ఎన్ఆర్ఈజీపీ ద్వారా రూ.లు.4000 కోట్లు, స్థానిక పన్నుల ద్వారా మరో రూ.లు.700 కోట్ల నిధులు సమకూరగా రెట్టింపు నిధులతో రూ.లు.8000 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు 2019-20 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రసంగంలో ముఖ్యమంత్రి ప్రకటన చేయడం అభినందించదగ్గ విషయమని సంతోషం వ్యక్తం చేశారు.