ల్యాంకో పవర్ ప్లాంట్ టేకోవర్‌కు కేంద్రం అనుమతి

259
  • రూ.907 కోట్లతో ఎన్‌హెచ్‌పీసీ కొనుగోలుకు సీసీఈఏ ఆమోదం

న్యూఢిల్లీ, మార్చి 7 (న్యూస్‌టైమ్): ఆర్ధిక కష్టాలలో ఉన్న ల్యాంకో పవర్‌కు చెందిన సిక్కింలోని 500 మెగావాట్ల టీస్టా హైడ్రో-ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్టును ప్రభుత్వ రంగ హైడ్రోపవర్ ఉత్పాదక దిగ్గజం ఎన్‌హెచ్‌పీసీ హస్తగతం చేసుకుంది. సిక్కింలోగల టీస్టా నదిపై ల్యాంకో సంస్థ చేపట్టిన హైడ్రో-ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్టు (ఎల్‌టీహెచ్‌పీఎల్) టేకోవర్ కోసం ఎన్‌హెచ్‌పీసీ చేసిన ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఆమోదం తెలిపింది. రూ.907 కోట్లతో ప్రాజెక్టును చేజిక్కించుకునేందుకు కేంద్ర మంత్రివర్గం అనుమతినిచ్చింది. గురువారం ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆర్థిక వ్యవహారాలపై క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) సమావేశమైంది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు.

సమావేశం అనంతరం ఈ వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ విలేఖరులకు తెలియజేశారు. కాగా, ప్రాజెక్టు అమలు వ్యయ అంచనా రూ.5,748.04 కోట్లుగా ఉంది. ఈ క్రమంలోనే ప్రాజెక్టును సొంతం చేసుకోవడానికి రూ.907 కోట్లు, పెండింగ్ పనుల కోసం రూ.3,863.95 కోట్ల అంచనాలతో ఎన్‌హెచ్‌పీసీ ప్రతిపాదనలు చేసింది. టీస్టా నదిపై సిక్కిం రాష్ట్ర ప్రభుత్వం ఆరు జల విద్యుదుత్పత్తి కేంద్రాలను నిర్మించతలపెట్టగా, 500 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఆరో కేంద్రాన్ని ల్యాంకో గ్రూప్ చేపట్టింది. ఇందులో 125 మెగావాట్ల ఉత్పాదక సామర్థ్యంతో కూడిన 4 యూనిట్లున్నాయి.

వార్షిక విద్యుదుత్పత్తి సామర్థ్యం 2,441 మిలియన్ యూనిట్లు. చక్కెర మిల్లర్లకు కేంద్ర ప్రభుత్వం నుంచి మరింతగా స్వల్ప వడ్డీ రుణాలు అందనున్నాయి. సరిపడా ఇథనాల్ ఉత్పత్తికిగాను అదనంగా రూ.12,900 కోట్ల స్వల్ప వడ్డీ రుణాలను ఇస్తామని కేంద్రం ప్రకటించింది. ఇందుకు సీసీఈఏ ఆమోదం లభించినట్లు జైట్లీ చెప్పారు. అలాగే మొలాసిస్ ఆధారిత స్టాండలోన్ డిస్టిల్లరీలకు ఉత్పత్తి సామర్థ్యం పెంపు, కొత్త యూనిట్ల ఏర్పాటుకుగాను మరో రూ.2,600 కోట్ల స్వల్ప వడ్డీ రుణాలను ప్రత్యేకంగా ఇస్తామన్నారు. ఈ నిర్ణయాలపట్ల భారతీయ చక్కెర మిల్లుల సంఘం డైరెక్టర్ జనరల్ అభినాష్ వర్మ ఆనందం వ్యక్తం చేశారు.

విద్యుత్ ప్రాజెక్టుల్లోగల రూ.31,560 కోట్లకుపైగా విలువైన పెట్టుబడుల ప్రతిపాదనలకూ సీసీఈఏ ఆమోదం తెలిపింది. ఇందులో రెండు బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ ప్లాంట్లతోపాటు జమ్ముకశ్మీర్‌లోని చెనాబ్ నది వద్దనున్న హైడ్రోపవర్ ప్రాజెక్టుకు సంబంధించిన పెట్టుబడులున్నాయి. ఇదిలావుంటే బొగ్గు కొరత తదితర సమస్యలతో ఒత్తిడిలో ఉన్న విద్యుత్ ప్రాజెక్టులపై మంత్రుల బృందం చేసిన సిఫార్సులకూ సీసీఈఏ పచ్చజెండా ఊపింది. దీంతో జీఎమ్మార్, అదానీ, జీవీకే, జైపీ, ఎస్సార్ గ్రూప్‌లకు చెందిన విద్యుత్ ప్రాజెక్టులకు లాభం చేకూరనుంది. మరోవైపు, భారీ జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టులకు ఊతమిచ్చేలా పలు నిర్ణయాలనూ సీసీఈఏ తీసుకుంది. పునరుత్పాదక శక్తి హోదాను కల్పించడం, కొత్తగా నిధులను సమకూర్చడం వంటి వాటికి మార్గం సుగమం చేసింది. కాగా, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో (సీపీఎస్‌ఈ) వ్యూహాత్మక వాటాల విక్రయాన్ని వేగవంతం చేస్తూ కూడా సీసీఈఏ నిర్ణయం తీసుకుంది.

వాటాలను ఎప్పుడు అమ్మాలి? ఎంతకు అమ్మాలి? ఎన్ని షేర్లను ఉపసంహరించుకోవాలన్నదానిపై నిర్ణయాలను తీసుకునేందుకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నేతృత్వంలో ఓ మంత్రుల బృందాన్ని నియమించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018-19)లో సీపీఎస్‌ఈల్లో వాటాల విక్రయం ద్వారా రూ.80,000 కోట్ల నిధులను సమీకరించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2019-20)గాను ఈ లక్ష్యాన్ని రూ.90,000 కోట్లుగా మోదీ సర్కారు నిర్ణయించింది. టెక్స్‌టైల్స్ రంగానికి ఊరటనిస్తూ ఎగుమతులపై కేంద్ర, రాష్ట్ర సుంకాల్లో రిబేటును కల్పించాలని సీసీఈఏ నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో విదేశీ మార్కెట్లలో భారతీయ టెక్స్‌టైల్స్ ఎగుమతులకు డిమాండ్ పెరుగుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇక సెక్యూరిటీస్ అప్పీలెట్ ట్రిబ్యునల్ (శాట్)లో టెక్నికల్ సభ్యుడి నియామకానికి తాజా సమావేశంలో సీసీఈఏ ఆమోదం తెలిపింది. అలాగే ట్రాన్స్‌ఫార్మేటివ్ మొబిలిటీ, బ్యాటరీ స్టోరేజ్‌లపై నేషనల్ మిషన్ ఏర్పాటుకూ క్యాబినెట్ లైన్ క్లియర్ చేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాల ప్రకారం దేశీయ వాణిజ్య, పారిశ్రామిక రంగాలు మరింత పుంజుకుంటాయన్న విశ్లేషణలు ఉన్నాయి.