జమ్ము బస్టాండ్‌లో విరుచుకుపడ్డ ఉగ్రమూక

45
  • గ్రనేడ్ పేల్చి అల్లకల్లోలం సృష్టించిన హిజ్జుల్?

  • ఒకరి మృతి: 32 మందికి గాయాలు: పోలీసులు

జమ్ము, మార్చి 7 (న్యూస్‌టైమ్): పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్ర దాడిని మర్చిపోకముందే జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని గ్రనేడ్ దాడికి పాల్పడ్డారు. ఈ దుర్ఘటనలో ఒకరు మరణించగా, 32 మంది గాయపడ్డారు. జమ్ము పట్టణ నడిబొడ్డున ఉన్న బస్టాండ్‌లో గురువారం మధ్యాహ్నం ఈ దాడి జరిగింది. పేలుడుకు కారణమైన హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది యాసిర్ జావేద్ భట్‌ను గంటల వ్యవధిలోనే పోలీసులు అరెస్టు చేయడం గమనార్హం. జమ్ములోని అత్యంత రద్దీ ప్రాంతమైన బీసీ రోడ్డులోని ఆర్టీసీ బస్టాండ్ ఏరియాలో ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ గ్రనేడ్ పేలుడు చోటుచేసుకుంది.

ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. పేలుడుతో ఓ ఆర్టీసీ బస్సు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనలో ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌కు చెందిన మహమ్మద్ షరిఖ్ (17) సహా మరో 32 మంది గాయపడ్డారు. ఛాతిలో తీవ్ర గాయాలైన షరీఖ్‌ను ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఇదే ఘటనలో గాయపడిన వారిలో మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. పేలుడు విషయం తెలియగానే భద్రతా బలగాలు, పోలీసులు వెంటనే బస్టాండ్ పరిసర ప్రాంతాల్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అక్కడి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తచ్చాడినట్లు గుర్తించామని జమ్ము ఐజీ ఎంకే సిన్హా తెలిపారు.

పేలుడు జరిగిన వెంటనే సమీప చెక్‌పోస్టులను అప్రమత్తం చేశామని, గంటల వ్యవధిలోనే హిజ్బుల్ ఉగ్రవాది యాసిర్ జావేద్ భట్‌ను అరెస్టు చేశామన్నారు. కుల్గాం జిల్లా ఖాన్‌పొరా-దస్సేన్ ప్రాంతానికి చెందిన జావేద్ బుధవారం రాత్రి గ్రనేడ్‌తో జమ్ముకు బయలుదేరాడని, గురువారం ఉదయం ఆర్టీసీ బస్టాండుకు చేరుకుని గ్రనేడ్‌ను విసిరివేసి పరారయ్యాడని చెప్పారు. మరోవైపు, జమ్మూ బస్టాండ్‌లో జరిగిన గ్రెనేడ్ దాడిని రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఖండించారు. ఈ పేలుడులో మృతి చెందినవారి కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

గాయపడిన వారికి రూ.20వేలు చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. ఇదిలావుండగా, జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక జైషే మహమ్మద్ ఉగ్రవాది హతమయ్యాడు. క్రాల్‌గుండ్ ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. వీరి రాకను గుర్తించిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడటంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. దీంతో ఉగ్రవాది హతమయ్యాడు. హతమైన ఉగ్రవాది పాకిస్థాన్ వాసి అని తెలిపాయి. ఎన్‌కౌంటర్ ప్రదేశంలో లభించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని భద్రతా బలగాలు పేర్కొన్నాయి.