వ్యాక్సిన్‌ వికటించి చిన్నారి మృతి

88
  • 15 మందికి అస్వస్థత: ముగ్గురికి విషమం

  • క్షతగాత్రులకు మెరుగైన వైద్యం: మంత్రి ఈటెల

హైదరాబాద్, మార్చి 7 (న్యూస్‌టైమ్): హైదరాబాద్‌ నాంపల్లి అర్బన్ హెల్త్ కేర్‌ సెంటర్‌లో దారుణం చోటుచేసుకుంది. రోగనిరోధక టీకాలు వికటించిన ఘటనలో ఐదు నెలల చిన్నారి మృతిచెందగా మరో 15 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరంతా ప్రస్తుతం నీలోఫర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

వీరికి వెంటిలేటర్‌పై అత్యవసర చికిత్స అందిస్తున్నారు. నాంపల్లి అర్బన్ హెల్త్ కేర్‌ సెంటర్‌లో బుధవారం ఉదయం దాదాపు 90 మంది చిన్నారులకు వ్యాక్సిన్లు వేశారు. వీరంతా 3 నుంచి 5 నెలల వయసున్నవారే కావడం గమనార్హం. వ్యాక్సిన్‌ అనంతరం జ్వరం రాకుండా ఇవ్వాల్సిన మాత్రలు వేరేవి ఇవ్వడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అయితే, వ్యాక్సిన్‌ వేయడం వల్ల ఇలా జరిగిందా? లేదా మాత్రల వల్ల జరిగిందా? అనేది తెలియాల్సి ఉంది. ఘటన అనంతరం చిన్నారులను వేర్వేరు ఆస్పత్రులకు తరలించారు. ప్రస్తుతం నీలోఫర్‌లో 15 మంది చికిత్స పొందుతున్నారు.

ఈ ఘటనపై వైద్యాధికారులు స్పందించారు. జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్‌ పరిస్థితిపై ఆరాతీశారు. మరోవైపు, వైద్యాధికారులు ఈ ఘటనపై కమిటీ వేసి విచారణ జరుపుతున్నారు. ఆస్పత్రి వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా నీలోఫర్‌ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. వ్యాక్సిన్లు వికటించిన ఘటనపై ఆరోగ్యమంత్రి ఈటెల రాజేందర్‌ స్పందించారు.

చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని నీలోఫర్‌ వైద్యులకు ఆదేశించారు. ఘటన విషయం తెలుసుకున్న వెంటనే హుజూరాబాద్‌ నుంచి నీలోఫర్‌కు చేరుకున్నారు. కాగా, పారాసిటమాల్‌కు బదులు ట్రెమడాల్ మెడిసిన్ ఇవ్వడంతో ఈ దారుణం చోటుచేసుకున్నట్లు ప్రాధమిక విచారణలో తేలినట్లు సమాచారం. ఈ ఘటనపై నీలోఫర్ సూపరింటెండెంట్ మీడియాతో మాట్లాడుతూ నాంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్‌లో బుధవారం టీకాలు ఇచ్చిన తర్వాత ఇచ్చే మాత్రల్లో పొరపాటు జరిగిందని, పిల్లలకు పారాసిటమాల్‌కు బదులు ట్రెమడాల్ మాత్ర ఇచ్చారని, పిల్లలకు నొప్పి నివారణ ఔషధం డోస్ ఎక్కువ కావడంతో అస్వస్థతకు గురయ్యారన్నారు.

దీంతో 22 మంది చిన్నారులు నీలోఫర్‌లో చేరారని, చికిత్స పొందుతూ ఒక బాలుడు మృతి చెందాడని తెలిపారు. మరో 21 మంది చిన్నారులకు చికిత్స అందిస్తున్నామని, వీరిలో ముగ్గురికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని చెప్పారు.