సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రామస్వామి కన్నుమూత

67

హైదరాబాద్, మార్చి 7 (న్యూస్‌టైమ్): సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కటికితల రామస్వామి (87) బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఇటీవల అస్వస్థతకు గురైన ఆయన హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీలోని తన కుమార్తె ఇంట్లో నిద్రలోనే తుదిశ్వాస విడిశారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా బట్లమగటూరు గ్రామానికి చెందిన జస్టిస్ రామస్వామి హైదరాబాద్‌లోని దోమలగూడ అడ్వొకేట్స్ కాలనీలో నివసిస్తున్నారు. అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ (పీపీ)గా, హైకోర్టు జడ్జిగా, సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా, మానవ హక్కుల కమిషన్ సభ్యుడిగా పనిచేశారు. ఇటీవల ఇందిరా పార్కులో వాకింగ్ చేస్తూ కిందపడి అస్వస్థతకు గురైన ఆయన తన కుమార్తె ఇంట్లో కన్నుమూశారు.

రామస్వామి పార్థీవ దేహానికి హైకోర్టు చీఫ్ జస్టిస్ రాధాకృష్ణన్, న్యాయమూర్తులు రాఘవేంద్రసింగ్ చౌహాన్, ఎ. రాజశేఖర్‌రెడ్డి, అమర్‌నాథ్‌గౌడ్, కోదండరాం, పీవీ సంజయ్‌కుమార్, ఇండియన్ లాయర్స్ యూనియన్ సభ్యుడు పార్థసారథి తదితరులు నివాళులర్పించారు. జస్టిస్‌ రామస్వామికి కుమారుడు కె.శ్రీనివాస్‌, కుమార్తెలు జ్యోతి, డాక్టర్‌ జయ ఉన్నారు. ఆయన భార్య శ్యామలాదేవి 1998లోనే మరణించారు. 1932 జూలై 13న రామస్వామి జన్మించారు. ఆయన భీమవరం డబ్ల్యుజీబీ కాలేజీలో డిగ్రీ, ఆంధ్రా వర్సిటీలో ఎంఏ, లా పూర్తి చేశారు. 1962లో న్యాయవాదిగా నమోదై సివిల్‌, క్రిమినల్‌ కేసులను వాదించారు. 1981–82 కాలంలో ఏపీ ఎలక్ట్రిసిటీ బోర్డు సీనియర్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా వ్యవహరించారు.

1982 సెప్టెంబర్‌ 29న హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అనంతరం 2 నెలలకు శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. 1989 సెప్టెంబర్‌ నుంచి ఇంటర్నేషనల్‌ జూరిస్ట్స్‌ ఆర్గనైజేషన్‌ (ఆసియా) ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. 1989 అక్టోబర్‌ 6న పదోన్నతిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 1997 జూలై 12న పదవీ విరమణ చేశారు. 1998లో ఆయన జాతీయ మానవ హక్కుల కమిషన్‌ సభ్యులుగా నియమితులయ్యారు. 2012 వరకు ఆ పోస్టులో కొనసాగారు. 1972 నుంచి రెండేళ్లు అడిషనల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా పనిచేశారు. 1974లో నాటి ఏపీ హైకోర్టులో ప్రభుత్వ ప్లీడరుగా పనిచేశారు. 1982 సెప్టెంబరులో ఏపీ హైకోర్టు జడ్జి అయ్యారు.

అనంతరం 1989 నుంచి 1997 వరకు సుప్రీం కోర్టు జడ్జిగా పనిచేసి రిటైర్‌ అయ్యారు. ఆయన పిల్లలంతా విద్యాధికులే. కుమారుడు శ్రీనివాస్‌ కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సంయుక్త కార్యదర్శిగా ఉన్నారు. పెద్ద కుమార్తె జ్యోతి న్యూయార్క్‌లో ఎస్‌బీఐలో ఎజీఎంగా, చిన్న కుమార్తె ఎన్‌.జయ ఉస్మానియా ఆస్పత్రిలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. జస్టిస్‌ రామస్వామి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎస్‌ఆర్‌ బొమ్మై కేసు, కాంట్రాక్టు కార్మికుల క్రమబద్ధీకరణ వంటి కీలక కేసుల్లో తీర్పులిచ్చారు. వాదోపవాదాలు పూర్తయిన వెంటనే జస్టిస్‌ రామస్వామి తీర్పులిచ్చేవారని పలువురు లాయర్లు పేర్కొన్నారు.

రామస్వామి మృతిపట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు సహా పలు పార్టీల నేతలు, ప్రజాప్రతినిధులు సంతాపం ప్రకటించారు. ప్రస్తుతం న్యూయార్క్‌లో ఉన్న కుమార్తె గురువారం సాయంత్రానికి హైదరాబాద్‌ చేరుకునే అవకాశముంది. శుక్రవారం ఉదయం జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో జస్టిస్‌ రామస్వామి అంత్యక్రియలు జరగనున్నాయి. న్యాయవర్గాల్లో జస్టిస్‌ రామస్వామికి ఎంతో గొప్ప పేరుంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీబీ రాధాకృష్ణన్‌ రిటైర్డ్‌ జస్టిస్‌ రామస్వామి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదాద్చారు.